హైదరాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో సీఎం రేవంత్‌రెడ్డి తన తప్పు ఒప్పుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై గురువారం ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రభుత్వం తరఫున వాదిస్తున్న అడ్వకేట్‌ను హెచ్చరించిన సుప్రీంకోర్టు, కంచ గచ్చిబౌలి అడవుల విధ్వంసానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు పలువురు అధికారులను జైలుకు పంపించాలా? అంటూ హెచ్చరించిన విషయాన్ని ప్రస్తావించారు. ఈ విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన తప్పులకు తెలంగాణ ప్రభుత్వ అధికారులు శిక్ష ఎదుర్కొనే పరిస్థితి నెలకొన్నదని కేటీఆర్ విచారం వ్యక్తంచేశారు.
తెలంగాణ ప్రభుత్వ అధికారులకు సుప్రీంకోర్టు హెచ్చరికలు జారీ చేయడంపై ఆవేదన వ్యక్తంచేశారు. రేవంత్‌రెడ్డి మూర్ఖత్వం వల్ల అధికారులు జైలు పాలు కావాల్సి వస్తుందని వాపోయారు. అన్నింటికీ తాను బాధ్యుడిని కాదని రేవంత్‌రెడ్డి తప్పించుకునే అవకాశం లేనే లేదని స్పష్టంచేశారు. సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలపై, కంచ గచ్చిబౌలి వ్యవహారంలో రేవంత్‌రెడ్డి చేసిన తప్పులను ఒప్పుకోవాలని డిమాండ్ చేశారు. వందల బుల్డోజర్లతో ధ్వంసం చేసిన కంచ గచ్చిబౌలి అడవులను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. లేకుంటే రేవంత్‌రెడ్డికి కోర్టు శిక్షలు తప్పవని హెచ్చరించారు.
కంచ గచ్చిబౌలి భూములను అమ్మి రూ.10 వేల కోట్ల రూపాయల స్కామ్ చేశారని, ఇది ముమ్మాటికీ అవినీతి, నమ్మక ద్రోహమే అవుతుందని కేటీఆర్ ఆరోపించారు. సెలవు రోజుల్లో బుల్డోజర్లను పంపి అండవులను ధ్వంసం చేయడం కూడా పర్యావరణ చట్టాల ఉల్లంఘనే అవుతుందని పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి బాధ్యతారాహిత్య చర్యల ఫలితంగా పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగిందని మండిపడ్డారు. కంచ గచ్చిబౌలి భూములను ప్రభుత్వం కాపాడాల్సిందేనని, ఇప్పటికైనా రేవంత్‌రెడ్డి తాను సృష్టించిన విధ్వంసానికి, తన బాధ్యతారాహిత్యానికి, చేసిన రూ.10 వేల కోట్ల స్కామ్‌కు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.