రాజన్న సిరిసిల్ల, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): ఇచ్చిన హామీలు అమలు చేయని సర్కారు మెడలు వంచేందుకు ఆటో డ్రైవర్ల సంఘాలన్నీ పార్టీలకు అతీతంగా కలిసి రావాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పిలుపునిచ్చారు. ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని అసెంబ్లీలో, అనేక సమావేశాల్లో ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ ఒత్తిడి తీసుకొచ్చిందని, అయినా సర్కారులో చలనం లేదని మండిపడ్డారు. ఒక్కో ఆటో డ్రైవర్‌కు ప్రభుత్వం ఏడాదికి రూ. 12 వేల చొప్పున రూ. 24 వేలు బాకీపడిందని గుర్తుచేశారు. మంగళవారం సిరిసిల్ల నియోజకవర్గంలో ఆయన విస్తృతంగా పర్యటించారు. జిల్లా కేంద్రంలో జరిగిన శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన రథోత్సవానికి హాజరయ్యారు. స్వామి వారిని దర్శించుకుని పూజలు చేశారు.
అనంతరం మాజీ కౌన్సిలర్లు రాజిరెడ్డి, తుమ్మ రాజు కుటుంబాలను పరామర్శించి ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చేరుకున్నారు. ఉపాధి కరువై.. అప్పుల పాలై ఆత్మహత్యాయత్నం చేసుకుని అక్కడి దవాఖానలో చికిత్స పొందుతున్న వీర్నపల్లి మండలం అడవిపదిరకు చెందిన అటోడ్రైవర్ నాంపల్లి సతీశ్‌ను పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. పక్క రాష్ట్రంలో చంద్రబాబునాయుడి ప్రభుత్వం ఆటోడ్రైవర్లకు ఆర్థిక సహాయం అందిస్తున్న తీరును ప్రస్తావించారు. కేసీఆర్ హయాంలో ఆటోడ్రైవర్ల కోసం తెచ్చిన ప్రమాద బీమాను తొలగించిన కాంగ్రెస్ సర్కారు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీమా సౌకర్యం తొలగించడం వల్ల రాష్ట్రంలోని 8.5 లక్షల మంది నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
బతుకుదెరువు కోల్పోయి 93 మంది చావుకు కారణమైందంటూ ప్రభుత్వంపై మండిపడ్డారు. ‘ఇంకా ఎంత మంది చావాలి? ఎంత మందిని చంపుతారు’ అంటూ నిలదీశారు. తాము ఫ్రీ బస్సును వ్యతిరేకించడం లేదని, అవసరమైతే మహిళల కోసం ఏసీ బస్సులు పెట్టాలని, ఉపాధి కోల్పోయిన అటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి, చనిపోయిన ప్రతి కుటుంబానికి రూ.పది లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కొత్తగా ఒక్క ప్రాజెక్టు కట్టలేదని, కొత్తగా ఒక రోడ్డు వేయలేదని, కొత్తగా ఒక సంక్షేమ పథకం అమలు చేయలేదని, మరి తెచ్చిన రూ. 2.3 లక్షల కోట్ల అప్పులు ఎక్కడికి పోతున్నాయని ప్రభుత్వాన్ని నిలదీశారు.
ఆటో డ్రైవర్లు ఆత్మైస్థెర్యం కోల్పోవద్దని, వారికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని, అందరినీ ఆదుకుంటామని కేటీఆర్ భరోసా ఇచ్చారు. ఎవరూ ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడవద్దని కోరారు. ఆటోడ్రైవర్లకు పార్టీ రక్షణ కవచంగా ఉంటుందని చెప్పారు. ఆత్మహత్యాయత్నం చేసుకుని చికిత్స పొందుతున్న నాంపల్లి సతీశ్ వైద్య ఖర్చులన్నీ పార్టీ భరిస్తుందని చెప్పారు. రెండేండ్లలో మనకు నచ్చిన కేసీఆర్ ప్రభుత్వాన్ని తెచ్చుకుందామని, తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని, లేని పక్షంలో పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఆయన వెంట నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, బొల్లి రాంమోహన్, గూడూరి ప్రవీణ్, మండలాధ్యక్షుడు వరుస కృష్ణహరి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సిరిసిల్ల పట్టణంలో జరిగిన శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి రథోత్సవానికి హాజరైన కేటీఆర్‌ను చూసేందుకు జనం పోటెత్తారు. పూజలు చేసి రథాన్ని లాగి వేడుకను ప్రారంభించిన కేటీఆర్‌ను కలిసేందుకు అభిమానులు పోటీపడ్డారు. అందరినీ చిరునవ్వుతో ఆప్యాయంగా పలకరిస్తూ, చేతులు కలుపుతూ జాతరకు వచ్చిన అభిమానుల్లో రామన్న ఉత్సాహాన్ని నింపారు.