హైదరాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తేతెలంగాణ): చిరుద్యోగులకు కాంగ్రెస్ అడుగడుగునా అన్యాయం చేస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. వేతనాలు పెంపు మరిచి ఉన్న జీతాల్లో కోత విధించడం దారుణమని గురువారం ఎక్స్ వేదికగా దుయ్యబట్టారు. ‘నమస్తేతెలంగాణ’లో ప్రచురితమైన ‘డ్రైవర్ కంటే టీచర్ జీతం తక్కువ’ కథనాన్ని తన పోస్ట్‌కు ట్యాగ్ చేసి సర్కారు వైఖరిని కడిగిపారేశారు. ‘కాకుల్ని కొట్టి గద్దలకు వేయడం గురించి ఇంతకాలం విన్నాం, కానీ రేవంత్ పాలనలో ప్రత్యక్షంగా చూస్తున్నాం.
నిరుపేద బక్కోడి పొట్టగొట్టి పెద్దోళ్ల బొజ్జలు నింపడమే పనిగా పెట్టుకున్నారు’ అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హైడ్రా ఉద్యోగులకు రూ. 5 వేలు, మైనార్టీ విద్యా సంస్థల సిబ్బందికి రూ. 10 వేల నుంచి రూ. 15 వరకు ప్రతినెలా వేతనాల్లో కోత విధించడం దారుణమని నిప్పులు చెరిగారు. అందాల పోటీలకు రూ. 200 కోట్లు ఖర్చు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి బక్క జీవులకు వేతనమిచ్చేందుకు డబ్బు కరువైందా? అని ప్రశ్నించారు. 22 నెలల్లో తెచ్చిన రూ. 2.5 లక్షల కోట్ల అప్పు ఢిల్లీ పెద్దలకు పంచడం, మీ అన్నదమ్ములు బొక్కేందుకేనా అని నిలదీశారు. వెంటనే వేతనాల్లో కోతను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ చిరుద్యోగులకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.