హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తేతెలంగాణ): సాగునీటిరంగ నిపుణులు, ఉమ్మడి పాలనలో నదీజలాల దోపిడీని ఎండగట్టి తెలంగాణ ప్రజల హృదయాల్లో జల విజ్ఞాన నిధిగా నిలిచిపోయిన విద్యాసాగర్‌రావు సేవలు చిరస్మరణీయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొనియాడారు. కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు దక్కాల్సిన వాటా కోసం జీవితాన్ని ధారపోసి నీళ్ల సారుగా ప్రసిద్ధిగాంచారని గుర్తుచేసుకున్నారు. విద్యాసాగర్‌రావు వర్ధంతిని పురస్కరించుకొని ఆయన మంగళవారం ‘ఎక్స్’ వేదికగా నివాళులర్పించారు. రాష్ట్ర ఆవిర్భావం అనంతరం కేసీఆర్ ఆహ్వానం మేరకు రాష్ట్ర నీటిపారుదల సలహాదారుగా అనేక ప్రాజెక్టుల నిర్మాణానికి విలువైన సూచనలు, సలహాలు ఇచ్చారని కొనియాడారు. విద్యాసాగర్‌రావు సేవలను గుర్తించిన కేసీఆర్.. డిండి ప్రాజెక్టుకు ఆయన పేరుపెట్టారని గుర్తుచేసుకున్నారు.
జాగృతం చేసిన మహనీయుడు: హరీశ్
సాగునీటిరంగ నిపుణుడు విద్యాసాగర్‌రావు ‘నీళ్లు-నిజాలు’ పుస్తకాన్ని రచించి తెలంగాణను జాగృతం చేశారని మాజీ మంత్రి హరీశ్‌రావు కొనియాడారు. ఆయన వర్ధంతిని పురస్కరించుకొని ‘ఎక్స్’ వేదికగా నివాళులర్పించి, ఆయన సేవలను స్మరించుకున్నారు. చివరి శ్వాస వరకు సమైక్య పాలకుల జలదోపిడీని అడ్డుకున్న మహనీయుడని కిర్తీంచారు.
సేవలు ఎనలేనివి: అనిల్‌కుమార్
నీటిరంగ నిపుణులు విద్యాసాగర్‌రావు సేవలు చిరస్మరణీయమని ఇరిగేషన్‌శాఖ ఈఎన్సీ అనిల్‌కుమార్ కొనియాడారు. మంగళవారం జలసౌధలో విద్యాసాగర్‌రావు జయంతిని నిర్వహించారు. విద్యాసాగర్‌రావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.