హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): ‘మేము ఫైటర్స్ తప్ప చీటర్స్ కాదు’ అని మంత్రి కేటీఆర్ తేల్చి చెప్పారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి బీఆర్ఎస్ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోలేదని, ఎవరితోనూ పొత్తుకు కూడా ప్రయత్నించలేదని స్పష్టంచేశారు. కేసీఆర్‌ను ఓడించేందుకు సిద్ధాంతాలను పక్కన పెట్టి ప్రతిపక్షాలు కూటమిగా ఏర్పడి పోటీ చేశాయని గుర్తు చేశారు. కేసీఆర్‌పై ప్రధాని మోదీ చెప్పిన అబద్ధాలను ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్ ఎండగట్టారు. బీజేపీ అంటే బిగ్గెస్ట్ ఝూటా పార్టీ అని సరికొత్త నిర్వచనం ఇచ్చారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకొంటామని సంకేతాలు ఇచ్చారని, పొత్తు ప్రయత్నాలపై లక్ష్మణ్ ప్రకటన పత్రికల్లో కూడా వచ్చిందని, దానికి సంబంధించిన పాత క్లిప్పింగ్‌ను కేటీఆర్ ట్విట్టర్లో షేర్ చేశారు. 105 సీట్లలో డిపాజిట్ రాని బీజేపీతో బీఆర్ఎస్ ఎందుకు పొత్తు పెట్టుకుంటుందని ఎద్దేవా చేశారు.