బీసీ మహిళా మంత్రి కొండ సురేఖను బలిపీఠం ఎక్కించటానికి రంగం సిద్ధం అయినట్టు విశ్వసనీయంగా తెలిసింది. నేడో రేపో ఆమెపై వేటు వేయడం ఖాయమని సమాచారం. ఇందుకోసం బీసీ నేతలనే పావులుగా ముందుపెట్టి అధికార పీఠం నడిపించిన శల్య సారథ్యం ముందు బహుజన సామాజిక న్యాయం మరోసారి బేలగా తలవంచిందని కాంగ్రెస్ శ్రేణుల్లో చర్చ జరుగుతున్నది.
హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ) : మంత్రివర్గంలో ఐదుగురు బీసీలు ఉండాల్సిందేనంటూ నిన్నటిదాకా నినదించిన పార్టీ పెద్దే, తాజాగా మంత్రి పదవి ఎరకు లొంగిపోయి జీహుజూర్ అనడంతో సురేఖ తొలగింపునకు మార్గం మరింత సులువైనట్టు తెలుస్తున్నది. సీఎం క్యాంపు కార్యాలయం సిద్ధం చేసిన ముందస్తు స్రిప్ట్‌ను క్రమశిక్షణా కమిటీ యథాతథంగా ఏఐసీసీ పెద్దల చేతుల్లో పెట్టడం, దానికి పీసీసీ అధ్యక్ష పీఠం సైతం వత్తాసు పలకడంతో వేటు ప్రక్రియ ఊపందుకున్నట్టు సమాచారం. రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షీనటరాజన్ మౌనం, పార్టీ వ్యవస్థాగత ప్రధానకార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెరవెనుక నడిపిన మంత్రాంగం అంతా కలిసి సురేఖను బలిపీఠం ముందు నిలబెట్టారనే చర్చ జరుగుతున్నది. ఇప్పటివరకు కొండా సురేఖను రాజీనామా చేయాలని ఎవరూ నేరుగా అడగనప్పటికీ, ఆమె ను తొలగించడానికి అవసరమైన అన్ని కాగితాలను సిద్ధం చేసినట్టు, అధిష్ఠానం తన నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించడమే మిగిలి ఉన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.
వరంగల్ జిల్లాలో తమ ప్రాబల్యాన్ని బలంగా కోరుకుంటున్న కొండా సురేఖ దంపతులను వ్యూహం ప్రకారమే ఉచ్చులోకి లాగినట్టు పార్టీ శ్రేణుల్లో ప్రచారం జరుగుతున్నది. పరకాల నియోజకవర్గంలో ముందస్తుగా అభ్యర్థిని ప్రకటించ డం ద్వారా కొండా కుటుంబాన్ని వ్యూహాత్మకంగా రెచ్చగొట్టి, తద్వారా వివాదపు ఉచ్చులోకి లాగినట్టు కాంగ్రెస్ శ్రేణులు చెప్పుకుంటున్నారు. సాధారణంగా పార్టీ అభ్యర్థుల ఎంపికను అధిష్ఠానం నిర్ణయించాల్సి ఉండగా, సీఎం ఏకపక్షంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డికే మళ్లీ టికెట్ అని బహిరంగసభలో ప్రకటించడం వెనుక పకా వ్యూహం ఉన్నదని అంటున్నారు. మొదటి నుంచీ పరకాల సీటుపై ఆశ పెట్టుకున్న కొండా సురేఖ కుమార్తె సుస్మిత వారి ఉచ్చులో పడ్డట్టు చెప్తున్నారు. సుస్మిత వ్యాఖ్యలను తల్లిగా కొండా సురేఖ ఖండించకపోవడాన్ని సాకుగా మార్చుకుని, ఆమెపై శాశ్వతంగా వేటు వేసేందుకు పకడ్బందీ కుట్రకు తెరలేపినట్టు చర్చ జరుగుతున్నది.
ఒక క్యాబినెట్ మంత్రి తన కుమార్తె చేసిన వ్యాఖ్యలను కనీసం ఖండించకపోవ డం తీవ్రమైన ఉల్లంఘన అంటూ సీఎంవో రూపొందించిన స్క్రిప్ట్‌నే క్రమశిక్షణా కమిటీ చైర్మన్ మల్లు రవి ఏఐసీసీ ముందుపెట్టారని తెలిసింది. ఎంపీ హోదాలో ఉన్న ఆ యన, ప్రభుత్వ పెద్దలకు ఏమాత్రం ఇబ్బం ది కలగకుండా, వారు నిర్దేశించిన దర్యాప్తు పంథాలోనే అంతా నడిపించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీలో అసలు ఈ అంతర్గత తిరుగుబాటు ఎందుకు మొదలైంది? పరకాలలో ఆజ్యం పోసింది ఎవరు? అన్న అంశాలను ఎకడా ఆ రిపోర్టులో ప్రస్తావించలేదని పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. కేవలం అధిష్ఠానం వద్ద సురేఖను దోషిగా నిలబెట్టేలా వాక్యాలను పేర్చి, 34 పేజీల ముసాయిదాను ఏఐసీసీ పెద్దల టేబుల్‌పై పెట్టినట్టు చెప్తున్నారు. అదే సమయంలో నిష్పాక్షికంగా ఉండాల్సిన పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ ఈ వ్యవహారంలో ప్రభుత్వ పెద్దల నిర్ణయాలకు వత్తాసు పలుకుతూ సైలెంట్ సపోర్ట్ అందించారని కాంగ్రెస్ నాయకులే అనుకుంటున్నారు. మీనాక్షీనటరాజన్ వంటి నేతలు సైతం ఢిల్లీ లాబీయింగ్ ఒత్తిళ్ల ముం దు కనీసం గొంతు విప్పలేక మిన్నకుండిపోయినట్టు ప్రచారం జరుగుతున్నది.
తనపై జరుగుతున్న కుట్రలను ముందే పసిగట్టిన కొండా సురేఖ ఢిల్లీ గడ్డపైనే ప్రతిఘటనకు దిగారు. రాజధాని వేదికగా మీడియా చిట్‌చాట్‌లో ఆమె మాట్లాడిన మాటలు కాంగ్రెస్ నేతల మీద తూటాల్లా సంధించారు. తన కూతురు మాట్లాడిన దాంట్లో అక్షరం పొల్లు పోలేదని, అకడ జరుగుతున్న వాస్తవాలనే నిర్భయంగా చెప్పిందని సురేఖ బాహాటంగానే సమర్థించుకున్నారు. అంతేకాదు, ప్రభుత్వంలో మంత్రుల కమీషన్ల దందా, నిధుల మళ్లింపులు, కొందరు మంత్రులపై వెల్లువెత్తుతున్న అవినీతి ఆరోపణలపై పార్టీ అధిష్ఠానం ఎందుకు మౌనంగా ఉన్నదని సూటి గా ప్రశ్నించారు. బీసీ వర్గానికి చెందిన మహిళా మంత్రిపై చిన్న మాటకు కూడా క్రమశిక్షణా అస్త్రాలు ఝుళిపించే నాయకులు, కోట్లాది రూపాయల ఆరోపణలు ఎదురొంటున్న ఇతర మంత్రుల వద్దకు వచ్చేసరికి ఎందుకు కళ్లు మూసుకుంటారని నిలదీశారు. బీసీలకో న్యాయం, బడా వర్గాలకో న్యాయమా అంటూ పార్టీ అధినేత మల్లికార్జున ఖర్గే, రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీలకు లేఖల ద్వారా సమగ్ర విషయాలను చేరవేసినట్టు తెలిసింది.
కొండా ఎపిసోడ్ వెనుక త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణ, పునర్వ్యవస్థీకరణ సమీకరణలు అత్యంత బలంగా పనిచేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. క్యాబినెట్ నుంచి కొండా సురేఖను తప్పించడం ద్వారా ఖాళీ అయ్యే ఆ ఒక మంత్రి పదవిని ఆశావహులకు ఎరగా చూపి, పార్టీలో ఎగిసిపడుతున్న అసమ్మతి గళాలను తొకిపెట్టాలనేది ప్రభుత్వ పెద్దల ప్రధాన వ్యూహంగా ఉన్నట్లు గాంధీభవన్ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. ఈ రాజకీయ ఎత్తుగడలో భాగంగానే నాడు పార్టీ అధికారంలోకి రావడానికి అహర్నిశలు శ్రమించిన సీనియర్ నేతలను సైతం వ్యూహాత్మకంగా పకనపెట్టి, ముఖ్యమంత్రి తన సొంత వర్గాన్ని క్యాబినెట్లో మరింత పటిష్టం చేసుకునే పనిలో పడ్డారని పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి.