జెన్ జీ.. దేశ భవిష్యత్తునే మార్చగలిగిన యువశక్తి. అన్ని రంగాల్లో తామేంటో నిరూపించే సామర్థ్యం కలిగిన తరం. పట్టుదలతో ప్రభుత్వాల మెడలు వంచగలిగిన ధైర్యం.
అయితే.. ఇదంతా నాణేనికి ఒకవైపేనా? అంటే.. అవుననే సమాధానమే వినిపిస్తున్నది మరి. తాజాగా విడుదలైన ఓ నివేదిక.. భారతీయ జెన్ జెడ్‌లోని భయాలకు అద్దం పట్టడం గమనార్హం.
ప్రతికూల అంచనాలకు జడిసి బంగరు భవితకు దూరమవుతున్నారని, కెరీర్లో వృద్ధి అవకాశాలను చేజార్చుకుంటున్నారని, ఉన్నతికి దోహదపడేవారిని కలిసేందుకూ వెనుకాడుతున్నారంటూ సదరు సర్వేలో తేలింది.
ముంబై, సెప్టెంబర్ 2: జెన్ జెడ్(జీ).. జంకుతున్నది. తమను ఎదుటివారు విమర్శిస్తారని, తక్కువగా అంచనా వేస్తారన్న భయాలకు లోనవుతున్నది. ఈ క్రమంలోనే మెజారిటీ జెన్ జెడ్ ప్రొఫెషనల్స్.. తమ కెరీర్ ఉన్నతికి దోహదపడేవారిని కలిసేందుకు, వారితో పనిచేసేందుకు కూడా వెనుకడుగు వేస్తున్నారని ప్రముఖ అంతర్జాతీయ వ్యాపార, ఉపాధి ఆధారిత సోషల్ నెట్వర్కింగ్ సర్వీస్ లింక్డిన్ బుధవారం విడుదల చేసిన నివేదికలో తెలియజేసింది. కాగా, 1997-2012 మధ్య జన్మించినవారిని (14-29 ఏండ్ల వయస్కులు) జెనరేషన్ ‘జెడ్’గా పిలుస్తున్న విషయం తెలిసిందే.
భారతీయ జెన్ జెడ్ ప్రొఫెషనల్స్ సామాజిక మాధ్యమాల్లో (ఎక్స్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ తదితరాలు)నే చురుకుగా ఉంటున్నారని లింక్డిన్ చెప్తున్నది. ఈ క్రమంలోనే ఆన్లైన్లో అన్నింటిపైనా స్పందిస్తూ ఎప్పుడూ అందరితో కనెక్ట్ అవుతున్నారని, అయితే నేరుగా కలిసేందుకు విముఖత ప్రదర్శిస్తున్నారని పేర్కొన్నది. ప్రస్తుతం 83 శాతం వైఖరి ఇలాగే ఉందన్నది. చివరకు తమ కెరీర్ ఉన్నతికి దోహదపడేవారిని కలిసేందుకూ సంశయిస్తున్నారని లింక్డిన్ చెప్పడం గమనార్హం. ఇక ఈ సర్వేలో పాల్గొన్నవారిలో 44 శాతం మంది ఎదుటివారు తమను జడ్జ్ చేస్తారని భయపడుతున్నట్టు తేలింది.
అలాగే ఇబ్బందిపెడుతారని 39 శాతం మంది, చిత్తశుద్ధి లేదని 37 శాతం మంది దిగులు చెందుతున్నారు. దీంతో జెన్ జెడ్.. ఎవ్వరి నుంచి విలువైన సలహాలు, సూచనలు తీసుకోలేకపోతున్నారని, తద్వారా కొత్త అవకాశాలను చేజార్చుకోవాల్సి వస్తున్నదని లింక్డిన్ అంటున్నది. ఈ ఏడాది జూలై 20 నుంచి ఆగస్టు 11 మధ్య భారత్ సహా బ్రిటన్, అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, సింగపూర్, ఆస్ట్రేలియా, బ్రెజిల్, యూఏఈ, సౌదీ అరేబియా దేశాల్లో ఈ సర్వే జరిగింది. ఈ సందర్భంగా ఫుల్‌టైమ్, పార్ట్‌టైమ్‌గా పనిచేస్తున్న 18,050 మంది నుంచి ఆయా అంశాలపై అభిప్రాయాలను తీసుకున్నామని, ఇందులో 18 ఏండ్ల నుంచి 80 ఏండ్ల వయస్కులున్నారని లింక్డిన్ స్పష్టం చేసింది. ఇదిలావుంటే ప్రతి ఐదుగురిలో దాదాపు ముగ్గురికి ప్రొఫెషనల్ రిలేషన్షిప్స్ నిర్మించుకోవడం ఎలాగో తెలియట్లేదని లింక్డిన్ తెలిపింది. సరైన మార్గదర్శకత్వం కూడా లేదన్నది.
మీ సర్కిల్‌ను పెంచుకోండి. తద్వారా అవకాశాలను అందిపుచ్చుకోండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో నైపుణ్యాలను పెంచుకోవడం ఎంత ముఖ్యమో.. అర్థవంతమైన సంబంధాలను బలోపేతం చేసుకోవడం కూడా అంతే ముఖ్యం. యువత ఈ విషయంలో వివేకంతో మెలగాలి.
-నిరజితా బెనర్జీ, లింక్డిన్ కెరీర్ ఎక్స్పర్ట్