KTR | తెలంగాణలో ఒకేరోజు ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారం వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం అచ్చన్నపేటలో మొగిలి లక్ష్మణ్(45), మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురం పీక్లా తండాలో గూగులోత్ భాస్కర్(40), హన్మకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలో నాలికె అనిల్(29).. ఈ ముగ్గురు రైతుల బలవన్మరణాలకు ముఖ్యమంత్రి రేవంతే పూర్తి బాధ్యుడని అన్నారు.
సీఎం చేతకానితనంతో సృష్టించిన సాగునీటి సంక్షోభంతో బోర్లు వేసి బొక్కబోర్లా పడి ఒకరు ప్రాణాలు తీసుకుంటే.. పెట్టుబడి సాయం లేక ఆర్థిక భారంతో అప్పుల పాలై ఇంకొకరు బలయ్యారని కేటీఆర్ అన్నారు. భారీ వర్షాలతో నష్టపోయిన పంటకు పరిహారం అందక మరొక యువ రైతు కుటుంబాన్ని విషాదంలో ముంచి తనువు చాలించాడని తెలిపారు. ఇలా రేవంత్ సర్కార్ తెచ్చిన ఈ వ్యవసాయ సంక్షోభం నుంచి గట్టెక్కలేక అన్నదాతలు వరుసగా తమ నిండు ప్రాణాలు బలితీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ పదేళ్ల ప్రస్థానంలో రైతుల ఆత్మహత్యలు 96 శాతం తగ్గాయని ఇటీవలే NCRB నివేదిక తేల్చిచెబితే.. మళ్లీ కాంగ్రెస్ పాలన రాగానే రైతు కుటుంబాల్లో ఈ మరణమృదంగం ప్రమాదఘంటికలు మోగిస్తోందని మండిపడ్డారు.
సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు జరిగిన స్థాయిలో మరోసారి తెలంగాణ గడ్డపై రైతుల ఆత్మహత్యలు చోటు చేసుకోవడం విషాదమే కాదు.. ముంచుకొస్తున్న విలయానికి సంకేతమని కేటీఆర్ అన్నారు. రైతన్నలారా అధైర్యపడకండి అని ధైర్యం చెప్పారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కేసీఆర్ సారథ్యంలో మళ్లీ వ్యవసాయాన్ని గాడిన పెట్టుకుందామని అప్పటి వరకు సంఘటితంగా పోరాడదామని పిలుపునిచ్చారు. రైతు వ్యతిరేక రేవంత్ సర్కారుకు బుద్ధి చెబుదామన్నారు.