KTR | హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): ‘ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి దమ్ముంటే రాష్ట్రంలో మంత్రుల ఫోన్లు.. మా ఫోన్లు ట్యాప్ చేయటం లేదని చెప్పాలి.. కెమెరాల ముందు ఓపెన్‌గా లైడిటెక్టర్ పరీక్షకు రావాలి’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. రేవంత్‌కు దమ్మూ ధైర్యం ఉంటే తన సవాల్‌ను స్వీకరించి ఫోన్లు ట్యాప్ చేయటం లేదని చెప్పాలని డిమాండ్ చేశారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష నేతల ఫోన్లను కూడా రేవంత్‌రెడ్డి ట్యాప్ చేయిస్తున్నారని ఆరోపించారు. సీఎం స్థానంలో ఉండి రేవంత్‌రెడ్డి నీచమైన వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏబీపీ న్యూస్ నిర్వహించిన సదరన్ సమ్మిట్‌లో పాల్గొన్న కేటీఆర్, పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని నమ్మబలికి 300 రోజులైనా ఒక్క హామీని కూడా అమలు చేయలేదని దుయ్యబట్టారు. రూ. 50 లక్షల నోట్ల కట్టలతో అడ్డంగా పట్టుబడిన రేవంత్‌రెడ్డిని దొంగ అనకుంటే ఏమనాలని ప్రశ్నించారు. డబ్బుతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి కొత్తగా ఏర్పడిన ప్రభుత్వాన్ని అస్థిర పరచాలని కుట్రచేస్తున్న క్రమంలో దొరకబట్టి రేవంత్ రెడ్డిపై ఆనాడు కేసు పెట్టాల్సి వచ్చిందని వివరించారు. ఓటమి కారణాలను విశ్లేషించుకున్నామని, బీఆర్ఎస్ తెలంగాణ ప్రజల ఇంటి పార్టీ అని, ప్రజల మనసులను గెలిచి తిరిగి అధికారంలోకి వస్తామని ఆశాభావం వ్యక్తంచేశారు.
ఫిరాయింపు సంస్కృతి తెచ్చిందే కాంగ్రెస్
దేశంలో పార్టీ ఫిరాయింపుల సంస్కృతికి ఆజ్యం పోసిందే కాంగ్రెస్ అని కేటీఆర్ మండిపడ్డారు. నెహ్రూ కాలం నుంచి కాంగ్రెస్ ఫిరాయింపులను ప్రోత్సహిస్తే మోదీ హయాం వచ్చే సరికి అది తీవ్రరూపం దాల్చిందని చెప్పారు. ప్రశ్నించే పార్టీలను మట్టుబెట్టడమే పనిగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనేక రాష్ర్టాల ప్రభుత్వాలను కూల్చిందని గుర్తుచేశారు. తాము అధికారంలో ఉన్నప్పుడు రేవంత్‌రెడ్డి ప్రభుత్వంలాగా ఫిరాయింపులను ప్రోత్సహించలేదని, రేవంత్‌రెడ్డి మాదిరిగా ఎమ్మెల్యేల ఇండ్లకు వెళ్లి కేసీఆర్ కండువా కప్పలేదని చెప్పారు. రాజ్యాంగ బద్ధంగా కాంగ్రెస్ శాసనసభాపక్షం బీఆర్ఎస్లో విలీనమైందని గుర్తుచేశారు. పార్టీ ఫిరాయింపులకు తాము వ్యతిరేకమని, కండువా మారితే సభ్యత్వం ఖతమేనని రాహుల్‌గాంధీ ఎన్నికల ముందు ప్రకటించారని, తెలంగాణలో ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.తమది ప్రేమ సమూహమని, ప్రేమ దుకాణమని చెప్తున్న రాహుల్‌గాంధీ తెలంగాణలో మాత్రం బుల్డోజర్రాజ్ను ప్రోత్సహిస్తున్నారని నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ బుల్డోజర్ల నుంచి పేదలను కాపాడటంపై రాహుల్ దృష్టి పెట్టాలన్నారు.
ఓటమి కారణాలను సమీక్షించుకున్నాం
ఎన్నికల్లో ఓటమి కారణాలపై సమీక్షించుకున్నామని కేటీఆర్ తెలిపారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 64 సీట్లు, బీఆర్ఎస్కు 39 సీట్లు వచ్చినా, ఓట్లశాతంలో తేడా కేవలం 1.8శాతమేనని వివరించారు. 14 స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులు స్వల్పతేడాతో ఓడిపోయారని చెప్పారు. పదేండ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలో అద్భుతాలు సృష్టించిందని వివరించారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రమే అయినా వ్యవసాయం, విద్యుత్తు, ఐటీ, గ్రీన్‌కవర్ ఇలా అనేక రంగాల్లో అత్యద్భుత ప్రగతిని సాధించి దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా నిలిచిందని గుర్తుచేశారు. ప్రభుత్వ రంగంలో దేశంలోనే లక్షా 60వేల ఉద్యోగ నియమకాలు చేపట్టామని, ఆ విషయంపై ప్రచారం చేసుకోలేకపోయామని చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఆ మాటకొస్తే కేంద్రప్రభుత్వం కన్నా ఉద్యోగులకు 73 శాతం జీతాలు పెంచినా ప్రచారం చేసుకోలేదని, ఇలా అనేక అంశాల్లో అద్భుతాలు సృష్టించినా ప్రచారం చేసుకోలేకపోయామని చెప్పారు. పదేండ్లు పాలించిన ప్రభుత్వంపై సహజంగా ఉండే వ్యతిరేకతే తమకూ ఎదురైందని, దీనికి తోడు సోషల్‌మీడియాలో అదేపనిగా విమర్శలు వెల్లువెత్తినా పనిచేస్తూ పోయామే తప్ప వెనుతిరిగి చూడలేదని తెలిపారు. హైదరాబాద్ నగరంలో అభివృద్ధికి బాటలు వేశామని, గ్రామీణ ప్రజల కోసం అద్భుతమైన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామని వివరించారు.
మా పార్టీనే విలీనం చేద్దామనుకున్నం
తెలంగాణ సాధన కోసం ఏర్పాటైన నాటి టీఆర్ఎస్ (నేటి బీఆర్ఎస్)ను రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కాంగ్రెస్‌లో విలీనం చేయాలనుకున్నామని కేటీఆర్ పునరుద్ఘాటించారు. కాంగ్రెస్ పార్టీ వల్లే విలీనం కాలేదని, కాకపోవటం వల్లే తెలంగాణకు మేలు జరిగిందని చెప్పారు. తెలంగాణను అభివృద్ధి పథంలో తీసుకెళ్లే అవకాశం తమకు లభించిందని, అన్ని రంగాల్లో రాష్ర్టాన్ని గొప్పగా తీర్చిదిద్దామని గుర్తుచేశారు. అధికారం శాశ్వతమని తామేనాడూ అనుకోలేదని, అధికారంలో ఉన్నప్పుడు రాష్ర్టానికి, రాష్ట్ర ప్రజలకు మంచి చేయాలని తమ సర్వశక్తులా ప్రయత్నాలు చేశామని, అందు లో తాము విజయం సాధించామని పేర్కొన్నారు.
సమాంతరంగా అభివృద్ధి చేశాం
తెలంగాణలో గ్రామీణ, నగర ప్రాంతాలను సమగ్రంగా, సమాంతరంగా అభివృద్ధి చేశామని కేటీఆర్ స్పష్టంచేశారు. పదేండ్లలో అభివృద్ధి, ప్రభుత్వ పాలనపైనే ప్రధానంగా దృష్టి సారించామని వివరించారు. తమ హయాంలో విప్లవాత్మకంగా అభివృద్ధి చేసిన రంగాలపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు. బీఆర్ఎస్కు రెండున్నర దశాబ్దాల చరిత్ర ఉన్నదని, ఆర్తి, ఆత్మగౌరవంతో నిర్మించుకున్న నాయకత్వం ఉన్నదని స్పష్టం చేశారు. గ్రామ, పట్టణ ప్రాంతాల్లో దృఢమైన పార్టీ నిర్మాణం ఉన్నదని చెప్పారు. ఒక ఎన్నికల్లో ఎదురైన పరాజయంతో పార్టీకి వచ్చిన ఇబ్బందేమీ లేదని తేల్చిచెప్పారు.
చంద్రబాబు వ్యాఖ్యలపై…
పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన విషయంలో జనాభా ప్రాతిపదికను పరిగణనలోకి తీసుకోవటం అసంబద్ధమైన విధానమని కేటీఆర్ పేర్కొన్నారు. జనాభాను పెంచుకోవాలనే విధంగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. ప్రస్తుత జనాభాకు తగ్గట్టుగా మౌలిక వసతులే లేని పరిస్థితి ఉన్నదని, ముందుగా వాటిని కల్పించడంపై ప్రభుత్వాలు దృష్టి సారించాలని సూచించారు. జనాభా నియంత్రణపై దక్షిణ భారతదేశానికి స్పష్టమైన అవగాహన ఉన్నదని చెప్పారు. జనాభా తగ్గించుకుని క్రమశిక్షణ పాటించిన దక్షిణాది రాష్ర్టాలకు డీ లిమిటేషన్ పేరుతో నష్టం చేయడం అన్యాయమని వాపోయారు.
తెలంగాణ భవిష్యత్తు కోసమే కేసీఆర్ ఆరాటం
రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, వాటి పట్ల చలించిపోయేతత్వం కేసీఆర్‌ది కాదని కేటీఆర్ స్పష్టం చేశారు. కేసీఆర్ బలమైన మనస్తత్వం, వ్యక్తిత్వం జీవితంలో అనేక ఒడిదొడుకులను చూసిందన్నారు. నిరంతరం భవిష్యత్తు కోసమే కేసీఆర్ ఆలోచిస్తారని చెప్పారు. తెలంగాణ కోసం ప్రణాళికలు రచిస్తున్నారని వివరించారు. అరచేతిలో వైకుంఠాన్ని చూపించి ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ తీరుపైనా, ఆ పార్టీ పాలన వల్ల ప్రజలు ఎదురొంటున్న ఇబ్బందులపై కేసీఆర్ ఆవేదన చెందుతున్నారని చెప్పారు. ప్రజలు మరోసారి కేసీఆర్‌కు ముఖ్యమంత్రిగా పనిచేసే అవకాశం ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం కాంగ్రెస్, బీజేపీల కన్నా గొప్పగా పనిచేసిందని తెలిపారు.
నిర్మాణాత్మక పాత్రపోషిస్తున్నాం
ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో, వారి ఆకాంక్షల కోసం పోరాటం చేయడంలో సంతృప్తిగా పనిచేస్తున్నామని కేటీఆర్ చెప్పారు. నిర్మాణాత్మక ప్రతిపక్షంగా తమ పాత్ర పోషిస్తున్నామన్నామని చెప్పారు. కొంతమంది తనపై అర్థంలేని విమర్శలు చేస్తున్నారని, తనపై చేస్తున్న అవినీతి, అహంకారం వంటి విమర్శలను రుజువు చేయాలని ఆయన సవాల్ విసిరారు.