KTR | మహత్తర తెలంగాణ పోరాటంలో పుట్టిన తల్లి.. తెలంగాణ జనని అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. మేడ్చల్ బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొని.. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఏ కేసీఆర్‌తో తెలంగాణ వచ్చిందో.. ఆ కేసీఆర్ ఆనవాళ్లు తుడిచే క్రమంలో.. చిన్నగా చేసి చూపే క్రమంలో తెలంగాణ అస్థిత్వంపైనే దాడి జరుగుతున్నది. మీరంతా గమనించండి ఏం జరుగుతున్నదో.. మొన్న తెలంగాణ ఆర్టీసీ లోగోలో కాకతీయ కళాతోరణం మాయమైపోయింది. అందులోని చార్మినార్ మాయమైపోయింది. వారు పెట్టిన విగ్రహం తెలంగాణ తల్లిది కాదు.. కాంగ్రెస్ తల్లి. తెలంగాణ తల్లి అని ముఖ్యమంత్రి బిల్డప్ ఇస్తున్నడో.. అందులో బతుకమ్మ మాయమైపోయింది. ముందు బతుకమ్మ చీరలు మాయమైపోయినయ్. ఇవాళ బతుకమ్మ మాయమైంది. నిన్న రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ కొత్తగా ఎట్లుంటదో చూపించే ఒక చిత్రాన్ని విడుదల చేయగానే.. తమ్ముళ్లు జోకులు పేలుస్తున్నారు. సెక్రటేరియట్లో లంకె బిందెలు లేవని అర్థమైందట రేవంత్‌రెడ్డికి. లంకె బిందెలు ఉంటయనుకొని వచ్చిండు.. లేకపోవడంతో ఏం చేసిండు.. తెలంగాణ తల్లి నెత్తిమీద ఉన్న బంగారు కిరిటాన్ని.. అందులో ఉండే కోహినూర్ వజ్రాన్ని ఇవాళ దొంగలు ఎత్తుకుపోయారని మొత్తం సోషల్ మీడియాలో జోకులు వేస్తున్నరు’ అన్నారు.
‘ఇవాళ తల్లి కిరీటం మాత్రమే కాదు. ఒక దేవతారూపంలో అందరం ఆరాధించుకునే విధంగా తెలంగాణ ఉద్యమంలో జన్మించిన తెలంగాణ తల్లిని చిన్నగాచూపెట్టే ప్రయత్నం ఈ సీఎం చేస్తున్నడు. ఆ నాడు స్వాతంత్య్ర పోరాటం భరతమాత ఎట్లయితే పుట్టిందో.. అట్లనే పాలసముద్రం లక్ష్మీదేవి ఎట్లయితే ఆవిర్భవించింది.. ఉద్యమకడలి మధనంలో తెలంగాణ తల్లి ఉద్భవించింది. తెలంగాణ తల్లి రూపాన్ని ఉమ్మడి ఉద్వేగంతో తెలంగాణ ఉద్యమం తీర్చిదిద్దింది. ఏ ఒక్క నాయకుడో.. రాజకీయ పార్టీకో సంబంధించిన రూపం కాదు. తెలంగాణ తల్లిని చూడగానే ఉద్యమ జ్ఞాపకాలు గుర్తుకు వస్తయ్. నాటి పోరాట స్ఫూర్తి రగులుత ఉంటది తెలంగాణలోని ప్రతి ఒక్కరి గుండెల్లో. ఈ జాతి సమష్టిగా సాధించిన ఈ పోరాటంలో సాంస్కృతిక పోరాటం మరోసారి గుర్తుకు వస్తుంది. ఒకనాడు వెక్కిరించబడినం. మీకు భాషరాదు.. మీ యాస సరిగా లేదు.. మీకు పరిపాలన రాదు.. తెలంగాణ ఇస్తే కూడా మీకు పరిపాలన చేతనైతదా..? మీకు అన్నం తినుడు నేర్పిందే మేము అంటూ వెక్కిరించిన నోర్లు మూతపడేలా పదేళ్లలోనే తెలంగాణను భారతదేశంలో అగ్రభాన నిలబెట్టిందిన కేసీఆర్ నాయకత్వం అనేమాట మీకు గుర్తు చేస్తున్న. మన భాషను ఎక్కిరించి.. సినిమాల్లో జోకర్లకు పెట్టి.. మన ఆటాపాటలను ఈసడించి.. ఈ బోనాలు ఏందీ.. ఈ మైసమ్మ ఏందీ? ఈ పెద్దమ్మ ఏందీ? ఈ ఎల్లమ్మ ఏందీ అని మన గ్రామదేవతలను ఎక్కిరించిన వాళ్ల నోర్లు మూతపడేలా సాంస్కృతిక ఆదిపత్యానికి తెరదించేలా ఉద్యమంలో ఎట్లయితే ఎదిరించినమో.. మరోసారి తెలంగాణ తల్లిని చూడగానే యాదికి వస్తుంది’ అన్నారు.
‘ఈ మహత్తర పోరాటంలో పుట్టిన తెలంగాణ జనని.. తెలంగాణ తల్లి. మనం భూమిని అమ్మ అంటం. ధరిణి, అవని, భూమాత, తల్లి, ధరిత్రి అంటం. అలాగే, దేశాన్ని కూడా తల్లిగానే కొలుచుకుంటం. భరతమాత అని పిలుస్తాం. మనం పుట్టినగడ్డను మాతృమూర్తిగా చూసుకునే నేలా ఈ భారత నేల. అట్లాంటి ఈ భారతదేశంలో భరతమాత ఎంత అద్భుతంగా ఉంటదో.. మీకే బాగా తెలుసు. మహాత్మాగాంధీ మొదటిసారి భరతమాతను వారణాసిలో పెట్టిండు. పెట్టిన సమయంలో మహాత్మా గాంధీ అనుకున్నది తప్పకుండా స్వాతంత్య్రం వస్తది అనుకున్నారు. వచ్చాక భారతదేశం ఉజ్వలంగా వెలగాలని చెప్పి భరతమాతకు బంగారు కిరీటం, ఆభరణాలతో దేవతామూర్తిగా వారణాసిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత ఇందిరాగాంధీ హరిద్వార్‌లో భారీ ఊరేగింపు తీసి.. భరతమాత విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అదే తరహాలో మనరాష్ట్రం కలిసి ఉన్నప్పుడు ఉమ్మడి ఏపీలో అప్పటి పాలకులు తెలుగు తల్లి విగ్రహాన్ని పెట్టారు. తెలుగు తల్లి కూడా బంగారు కిరీటం, చేతిలో కలశం, బంగారు ఆభరణాలు ఉంటయ్. పక్కనే తమిళనాడులో తమిళ సోదరులు తమిళతాయి అని పేరు పెట్టుకున్నారు. ఆమెకు కిరీటం, బ్రహ్మాండమైన వైజ్యవైడూర్యాలతో కూడుకున్న ఆభరణాలు ఉన్నయ్. కర్ణాటకలో కన్నడ అంబే అనే పిలుస్తారు. దేవతామూర్తి తరహాలో రూపం ఇచ్చారు. అదే పద్ధతుల్లో మన వైతాళికులు, ఉద్యమ నేతలు, మహానుభావాలు, రచయితలు.. సాహితీ వేత్తలు, కళాకారులు, కవులు మొదటి నుంచి తెలంగాణ తల్లిని అద్భుతంగా కీర్తించారు’ అని గుర్తు చేశారు కేటీఆర్.