KTR | హైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ): నిరుద్యోగ యువత, విద్యార్థులపై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకొని, వారికి సీఎం రేవంత్‌రెడ్డి క్షమాపణ వెంటనే చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. నిర్లక్ష్యంగా, నిర్లజ్జగా సీఎం తన స్థాయిని దిగజారి, దివాలాకోరుతనంతో మాట్లాడారని మండిపడ్డారు. ఎనిమిది నెలల్లో ఒక నోటిఫికేషన్ ఇవ్వలేని కాంగ్రెస్ సర్కారు.. నాలుగు నెలల్లో 2 లక్షల ఉద్యోగాలు ఎలా ఇస్తుందని నిలదీశారు.
రేవంత్‌రెడ్డికి సత్తా, చిత్తశుద్ధి ఉంటే ఉద్యోగాలు, నోటిఫికేషన్లు, జాబ్ క్యాలెండర్‌పై శ్వేతపత్రం ప్రకటించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో స్వర్ణకిలారి రచించిన ‘మేక బతుకు’ పుస్తకాన్ని ఆదివారం కేటీఆర్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిరుద్యోగుల కోసం దీక్షచేసిన నిరుద్యోగ అభ్యర్థి మోతీలాల్‌ను అవమానించేలా సీఎం మాట్లాడటం తగదని హితవు పలికారు.
రాజకీయ నిరుద్యోగులుగా అశోక్‌నగర్ కోచింగ్ సెంటర్లకు వెళ్లి ఉద్యోగాలు సంపాదించుకున్న రాహుల్‌గాంధీ, రేవంత్‌రెడ్డి.. అవే కోచింగ్ సెంటర్లు, నిరుద్యోగ అభ్యర్థులను అవమానించేలా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. అశోక్‌నగర్‌లోని నిరుద్యోగులు, విద్యార్థులను సన్నాసులు అంటున్న రేవంత్‌రెడ్డి సన్నాసా? లేదా రాహుల్‌గాంధీ సన్నాసా? చెప్పాలని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ను దించి కాంగ్రెస్‌ను గద్దెనెకించిన అదే యువత ఈరోజు ప్రశ్నిస్తున్నదని వెల్లడించారు. రేవంత్ సర్కారును వదిలిపెట్టబోమని, అసెంబ్లీలో నిలదీస్తామని చెప్పారు. విద్యార్థులు, నిరుద్యోగులతో ప్రజాక్షేతంలో కొట్లాడుతామన్నారు.
ఇది యువత భవిష్యత్తు..
ఇది రాజకీయ పార్టీల సమస్య కాదని, లక్షల మంది యువత భవిష్యత్తుకు సంబంధించిన అంశమని కేటీఆర్ అన్నారు. ఈ అంశంలో రేవంత్‌రెడ్డి ఇగో, భేషజాలకు పోకుండా నిరుద్యోగులు అడుగుతున్న డిమాండ్లపై సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలని సూచించారు. కండకావరంతో మాట్లాడటం రేవంత్‌రెడ్డి ఆపాలని హితవు పలికారు.
అశోక్‌నగర్, దిల్సుఖ్నగర్, యూనివర్సిటీలో పిల్లలను పోలీసులు ఈడ్చుకుపోతున్న విషయం వాస్తవం కాదా? అని నిలదీశారు. ‘రేవంత్‌రెడ్డి ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్టుగానే మాట్లాడుతున్నారు. ఆయన సీఎం అనే విషయాన్ని గుర్తుంచుకొని మాట్లాడితే ఆయనకే మంచిది’ అని సూచించారు. గ్రూప్-1 మెయిన్స్‌కు అభ్యర్థులను 1:100 నిష్పత్తిలో తీసుకోవాలని నాడు అసెంబ్లీ అడిగింది భట్టి విక్రమార్క కాదా? అని నిలదీశారు.
సాహిత్యంతో సామాజిక చైతన్యం
సాహిత్యంతో సమాజంలో చైతన్యం తీసుకురావచ్చని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. తాను దుబాయ్ వెళ్లినప్పుడు స్వయంగా లేబర్ క్యాంపులో కార్మికుల కష్టాలను చూశానని, గుండె తరుకుపోయిందని చెప్పారు. వలస ఎంత వాస్తవమో.. వలసలోని దోపిడీ కూడా అంతే వాస్తవం.. అది దుబాయ్ అయినా హైదరాబాద్ అయినా ఇంకెకడైనా.. అని పేర్కొన్నారు. పెద్దూరు వలస కార్మికుల కోసం దుబాయ్‌లోని జైలుకు వెళ్లి కలిసి వచ్చానని కేటీఆర్ పేర్కొన్నారు.
వారిని ఏండ్ల తర్వాత ఇండియాకి తీసుకురాగలిగామని గుర్తుచేశారు. ప్రస్తుతం సమాజంలో చదివే అలవాటు తగ్గుతూ వస్తున్నదని, ఈ సమయంలో మేక బతుకు పుస్తకాన్ని తీసుకురావడం హర్షణీయమన్నారు. సమాజంలో చైతన్యం, మార్పు తీసుకురాగలిగే సాహిత్యానికి మరింత మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఈ దిశగా డిజిటల్, ఆడియో పుస్తకాల ద్వారా మరింత ప్రయత్నం జరగాలని కేటీఆర్ కాంక్షించారు.
పుస్తకావిష్కరణలో ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి, పెద్దింటి అశోక్‌కుమార్, డాక్టర్ జే నీరజ, మీడియా సమావేశంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, బీఆర్ఎస్ నాయకులు గెల్లు శ్రీనివాస్‌యాదవ్, తుంగ బాలు, వాసుదేవరెడ్డి పాల్గొన్నారు.
ఎడారిలో చిక్కుకున్న యువకుడి కథే ‘మేకబతుకు’
మెరుగైన జీవితం కోసం కేరళ నుంచి గల్ఫ్‌కు వలస వెళ్లి అకడ ఎడారిలో చికుకుపోయిన నజీబ్ అనే యువకుడి కథే ‘మేక బతుకు’ పుస్తకం. ఈ పుస్తకానికి మాతృక మలయాళంలో బెన్యామిన్ రాసిన ‘ఆడుజీవితం’. 2008లో వచ్చిన ఈ నవల బహుళ ప్రజాదరణ పొందింది. ఇప్పటివరకు 100కుపైగా పునర్ముద్రణలు పొంది మూడు లక్షల పైచిలుకు కాపీలు అమ్ముడయ్యాయి. దీనికి కేరళ సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చింది.
ఈ పుస్తకాన్ని ఇంగ్లిషులోకి ‘గోట్ డేస్’ పేరిట జోసెఫ్ కోయిపల్లి అనువదించారు. ఈ పుస్తకం ఇప్పటికే ఎనిమిది భాషల్లోకి (ఇంగ్లిష్, అరబిక్, నేపాలీ, ఒడియా, థాయ్, తమిళ్, హిందీ, కన్నడ) అనువాదమైంది. మార్చి 2024లో ‘ఆడుజీవితం’ పేరుతో ప్రముఖ హీరో పృధ్వీరాజ్ ప్రధాన పాత్రలో సినిమాగా విడుదలై సూపర్ హిట్ అయ్యింది. ఇంగ్లిష్ నుంచి తెలుగులోకి ‘మేక బతుకు’ శీర్షికన రచయిత్రి స్వర్ణ కిలారి అనువాదం చేశారు. పుస్తకాన్ని అన్విక్షికి పబ్లికేషన్స్ ప్రచురించింది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఇతర పుస్తకాల షాపుల్లో ‘మేక బతుకు’ పుస్తకం అందుబాటులో ఉంటుంది.