KTR | కాంగ్రెస్ సర్కారుకు కూలగొట్టాలన్న పిచ్చితప్పా.. ఓ పద్ధతి.. ప్లానింగ్ లేదని కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ భవన్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ నేతలకు కీలక విజ్ఞప్తి చేశారు. కూల్చివేతల అంశంపై కొందరు నేతలు మంచిది కాదని మాట్లాడుతున్నారని.. మరికొందరు లోలోపల ఉడికిపోతున్నారన్నారు. పేదల కన్నీళ్ల ధాటికి ఇబ్బందిపడుతరు కాంగ్రెస్ నాయకులారా.. పేదలతో పెట్టుకోవడం మంచిది కాదని మీ ముఖ్యమంత్రికి చెప్పాలని సూచించారు. ‘తెలంగాణ ఉద్యమంలో సరిగ్గా ఇవాళ సాగరహారం జరిగి 12వ వార్షికోత్సవం. మళ్లీ అలాంటి ఉద్యమాలు నిర్మించాల్సిన అవసరం వస్తుందేమో అనుమానం వస్తున్నది. ఈ దాష్టీకాలు ఒక్కదగ్గర కాదు చేస్తున్నది. సంగారెడ్డిలో కూల్చివేతతో రాయి వచ్చి హోంగార్డ్‌కి తగిలింది. ఈ రకంగా ప్లానింగ్ లేదు. పాడు లేదు. కూలగొట్టాలన్న ఓ పిచ్చితప్పా. దానితో ఏం వస్తుందో అర్థం తెలియదు’ అంటూ విమర్శించారు.
‘నేను మున్సిపల్ మినిస్టర్‌గా పని చేసినకాబట్టి అడుగుతున్న. మూసీలో గతంలో ఎవరి ఇబ్బంది పెట్టకుండా మాపాటికి మేం సుందరీకరణ చేశాం. సుందరీకరణ పేదల కడుపుకొట్టకుండా చేయొచ్చు. నాగోల్ దగ్గర ఐదుకిలోమీటర్ల పరిధిలో చేశాం. ఒకటి కాదు 15 బ్రిడ్జిలు మూసీపై మంజూరు చేశాం. కొన్ని ఇంకా నిర్మాణాల్లో ఉన్నాయి. పేద ప్రజల కోసం ఆ నాడు చేస్తూ పోయాం. వాకింగ్ ట్రాక్‌లు ఏర్పాటు చేశాం. ఇదేదో ప్రపంచంలో ఎవరూ చేయంది చేస్తాను అన్నట్టు ముఖ్యమంత్రి ఫోజులు కొడుతున్నడో వారికి చెప్పేది ఒక్కటే. చేయాలనుకున్నది.. ఏం చేయాలనుకుంటున్నారో చెప్పండి. ఎస్టీపీలు మేమే పూర్తి చేశాం. రూ.545కోట్లతో బ్రిడ్జిలు మంజూరు చేశాం. మరి దేనికి రూ.1.50లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నవ్. ముఖ్యమంత్రి మాటలు అర్థం కావడం లేదు. నిన్నగాక మొన్న కొందరి ఇండ్లలో నుంచి వచ్చే మురికినీరు చెరువుల్లోకి వెళ్లుతుంటే.. దాన్ని నేను అడ్డుకోకపోతే ముఖ్యమంత్రి ఎట్ల అయితా? దాన్ని అడ్డుకోక పోతే సీఎం ఎట్ల అయిత ? నా డ్యూటీ చేయకపోతే ఎట్లా? ఈ రోజు ముఖ్యమంత్రి ఇంట్లో నుంచి వచ్చే, జూబ్లీహిల్స్ నుంచి వచ్చే మురికి నీరు ఎక్కడకు పోతుందో ఆయనకు ఎరికేనా? మరి మురికి నీరు గ్రౌండ్లోకి, పక్కనే ఉన్న కుంటల్లోకి పోతున్నదంటే ఎస్టీపీలు కట్టిందెందుకు? సీఎంకు అవగాహన లేదు. సబ్జెక్ట్ తెలియదు. ఇండివిజువల్ ఇండ్లకు ఎస్టీపీలకు ఉండవు కదా? గేట్ కమ్యూనిటీలకు, అపార్ట్మెంట్లకు ఉంటయ్. నాలాలపై ప్రభుత్వం నిర్మించనకాడ ఉంటయ్’ అని తెలిపారు.
‘ఆయనకు తెలియక మాట్లాడుతున్నడు.. దానికి ఆహా.. ఓహో గొప్ప విషయాలు చెబుతున్నడని మీడియా అనవసర ప్రచారం కల్పిస్తున్నది. ఎస్టీపీలు లేవని ఇండ్లు కూలగొడుతా అంటే.. హైదరాబాద్‌లో ఒక్క ఇళ్లు కూడా మిగలదు. సీఎం ఇంట్లో ఎస్టీపీ ఉన్నదా? చూపిస్తారా? హరీశ్‌రావు ఒక ఆరోపణ చేశారు. సీఎం రేవంత్ ఇళ్లు కొడంగల్‌లో సీఎం రేవంత్ ఇళ్లు ఓ కుంటలో ఉన్నదని అన్నారు. మరి నీ ఇళ్లు కూలగొడుతావా? రెడ్డికుంట అది. సర్వే నంబర్ 1138. మీ బ్రదర్ తిరుపతి ఎఫ్టీఎల్లో ఉన్నది. కూలగొడుతవా? మెమోలో ఉన్నది. ఉస్మాన్ సాగర్, హిమాయత్‌నగర్ వద్ద 500మీటర్ల లోపు నిర్మాణాలు ఉండవద్దని ఉన్నది. మీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నరు. పెద్దవారికి నోటీసులు ఇస్తరు.. వాళ్లను కంటికి రెప్పలా కాపాడుతవ్.. పేదలను ఇష్టం వచ్చినట్లు కొడుతమ్ అంటే ఎట్లా ఉరుకుంటరనుకున్నవ్.. సీఎంకు నిజాయితీ ఉంటే మీ అన్న ఇల్లు మొదట కూల్చాలి. ఎఫ్టీఎల్, బఫర్‌లో ఉన్న వారి ఇండ్లన్నీ కూలగొట్టు. నీ ఇల్లు కొడంగల్లోనిది కూలగొట్టు. ఆ తర్వాత మీ మంత్రులు, ఎమ్మెల్యేల నివాసాల కూల్చాలి. రెవెన్యూ మినిస్టర్ ఇల్లు, వాళ్ల తమ్ముడిది ఉన్నది. ఎమ్మెల్యే వివేక్, కేవీపీ రామచంద్రరావు, మధుయాష్కీ గౌడ్.. ఇంకా చాలామంది ఉన్నారు’ అన్నారు.
‘పేదల ఇండ్లమీదకు వచ్చే ముందు వారి ఇండ్లు కూలగొట్టి చిత్తశుద్ధి రుజువు చేసుకొని.. పేదల ఇండ్ల మీదకురా. మేం నిర్మాణం పని చేశాం. నువ్వేమో విధ్వంసం చేస్తున్నవ్. మేం అందరూ మావాళ్లేనని పని చేసుకుంటూ వెళ్లాం. ఈయనేమో అసలు గ్యారంటీలు అమలు ఎక్కడ అడుగుతరేమోనని విధ్వంసం చేస్తున్నరు. చెప్పాలంటే ఇంకా చాలానే ఉన్నయ్. సీఎంని ఒక్కటే అడుగుతున్న. అసెంబ్లీలో అడిగినా సమాధానం చెప్పలేదు. అసలు మూసీ ప్రాజెక్టు డీపీఆర్ తయారు కాలేదు. అధికారికి ఒక్కరికీ ఏం తెలియదు. అసెంబ్లీలో డిప్యూటీ సీఎం డైలాగ్ ఏదో కొట్టిండు.. కేంద్ర ప్రభుత్వాన్ని మూసీ బ్యూటీఫికేషన్ కోసం అడిగాం.. సహకరించలేదు. రూపాయి ఇవ్వలేదన్నారు. అదేంటీ నాకు పంపి.. డీపీఆర్ అంటే.. వెంటనే నాలుక కరుచుకొని ఇంకా డీపీఆర్ తయారు కాలేదని చెప్పాడు. డీపీఆర్ తయారు కాకుండానే కూల్చివేతలు ఎందుకు జరుపుతున్నవ్ ముఖ్యమంత్రి ? ఎందుకు మార్కింగ్ ఇస్తున్నవ్? నువ్వు రెడ్లైన్లు పెట్టుడు కాదు.. నీకే మేమే డెడ్‌లైన్ పెడ్తం. ఎట్టి పరిస్థితుల్లో మూసీ నిర్వాసితులను ముట్టుకుంటే మేం వారి తరఫున గట్టిగా కదం తొక్కుతం. ప్రజాకోర్టుతో పాటు అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తాం’ అని స్పష్టం చేశారు.