హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ) : పట్టపగలు గూండాల మాదిరిగా కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయంలోకి ప్రవేశించి వాహనాలు, ఆఫీసును ధ్వంసం చేయడం అత్యంత దుర్మార్గమైన చర్యగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభివర్ణించారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడి వాహనంతోపాటు మరో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ కార్యాలయంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ అనుచరుల హేయమైన దాడిని గురువారం ఎక్స్ వేదికగా తీవ్రంగా ఖండించారు.
దాడి జరిగిన వెంటనే ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డితో మాట్లాడినట్టు తెలిపారు. కండ్లముందే ఇంత అరాచకం సృష్టిస్తున్నా పోలీసులు ప్రేక్షకపాత్ర వహిస్తూ చోద్యం చూడటం సిగ్గుచేటని మండిపడ్డారు. సీఎం రేవంత్‌కు బీ-టీమ్‌గా మారిన బండి సంజయ్, బీఆర్ఎస్ నేతల ప్రశ్నలకు సమాధానం చెప్పలేకే ఈ పిరికిపంద చర్యలకు ఉసిగొలుపుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రతిసారీ ముఖ్యమంత్రి వైఫల్యాన్ని కప్పిపుచ్చేందుకు కుప్పిగంతులు వేయడం తప్ప కరీంనగర్ ప్రజలకు బండి సంజయ్ చేసిందేమీ లేదని విమర్శించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉండి తన అనుచరులతోనే శాంతిభద్రతలను దెబ్బతీసేలా వ్యవహరించడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని మండిపడ్డారు.