హైదరాబాద్, డిసెంబర్ 1(నమస్తే తెలంగాణ): ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలోని శంకరగిరితండాకు చెందిన కౌలు రైతు వీరన్న బలవన్మరణంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది ఆత్మహత్య కాదని, కాంగ్రెస్ సర్కారు చేసిన హత్యేనని సోమవారం ఒక ప్రకటనలో విమర్శించారు. వీరన్న మరణానికి ముఖ్యమంత్రిదే పూర్తిబాధ్యత అని స్పష్టం చేశారు. కౌలు రైతులకు ఏటా రూ.15వేల చొప్పున ఇస్తామని చెప్పిన మాటిచ్చిన సీఎం రేవంత్రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేయడం వల్లే వీరన్న ప్రాణాలు విడిచారని, కాంగ్రెస్ మోసానికి రైతు ఆత్మహత్యే నిదర్శనమని నిప్పులు చెరిగారు. తుఫాను కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైందని విరుచుకుపడ్డారు.
కాంగ్రెస్ విజయోత్సవాలు సిగ్గుచేటు
పంటకు మద్దతు ధర దక్కక, కొనే దిక్కులేక రాష్ట్రవ్యాప్తంగా ఓవైపు 700మంది రైతులు ప్రాణాలు విడిచిన పరిస్థితిలో సర్కారు మాత్రం విజయోత్సవాలు జరుపుకోవడం సిగ్గుచేటని ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎంకు రియల్ ఎస్టేట్ దందాలు, కుంభకోణాలు, కమీషన్లపై ఉన్న శ్రద్ధ కర్షకుల కష్టాలపై లేకపోవడం విడ్డూరమని మండిపడ్డారు. పాలకుల కనీస అవగాహనలేమితో సాగురంగం సంక్షోభంలో కూరుకుపోయిందని ఆరోపించారు.
సెల్ఫీ వీడియో చూసైనా కండ్లు తెరువాలి
కౌలు రైతు వీరన్న సెల్ఫీ తీసుకొని తనువు చాలించిన తీరు చూసైనా కాంగ్రెస్ సర్కారు కండ్లు తెరువాలని కేటీఆర్ హితవు పలికారు. రెండేళ్ల పాలనలో అన్నదాతలకు చేసిన మోసాలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో వినిపిస్తున్న చావుడప్పును ఆపకుంటే లక్షలాది మంది రైతులే కాంగ్రెస్కు సమాధి కడతారని హెచ్చరించారు.
రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలి
కష్టాల కడలిలో చిక్కుకుని బలవణ్మరణానికి పాల్పడ్డ వీరన్న కుటుంబాన్ని గట్టెక్కించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదని కేటీఆర్ తేల్చిచెప్పారు. బాధిత కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా అన్నదాతలకు ఇచ్చిన హామీలపై దృష్టిపెట్టాలని పేర్కొన్నారు. అన్నదాతలు అధైర్యపడొద్దని, బీఆర్ఎస్ అండగా ఉంటుందని, సర్కారుపై పోరాడుతామని స్పష్టంచేశారు.