మహబూబాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వంపై, సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శల వర్షం కురిపించారు. మహబూబాబాద్‌లో ఇవాళ జరిగిన సర్పంచ్ల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతలు, సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాయమాటలను గుర్తుచేశారు. మాయ మాటలతో గద్దెనెక్కి ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని దుయ్యబట్టారు. రేవంత్‌రెడ్డి చెప్పిన అబద్దాలను ఒక్కొక్కటిగా గుర్తుచేస్తూ దుమ్మెత్తిపోశారు.
కేటీఆర్ మాట్లాడుతూ.. ‘ఆడపిల్లల పెళ్లిళ్లకు కేసీఆర్ ఒక లక్ష రూపాయలు మాత్రమే ఇస్తున్నడు.. నేను లక్ష రూపాయలతోపాటు తులం బంగారం కూడా ఇస్త అని రేవంత్‌రెడ్డి అన్నడు. కేసీఆర్ వృద్ధులకు రూ.2 వేల పింఛనే ఇస్తున్నడు.. నేను రూ.4 వేల పింఛన్ ఇస్త అన్నడు. కేసీఆర్ ఇంట్లో ఒక్కరికే పింఛన్ ఇస్తున్నడు.. నేను గెలిస్తే ఇంట్లో ఇద్దరు ముసలోళ్లుంటే ఇద్దరికీ పింఛన్ ఇస్త అన్నడు. ఈ మాటలు చెప్పుకుంట సోనియాగాంధీ మీద, ప్రియాంకాగాంధీ మీద, రాహుల్‌గాంధీ మీద ఒట్లు పెట్టిండు. మరి రెండేళ్లలో ఏం చేసిండు రేవంత్‌రెడ్డి..?’ అని ప్రశ్నించారు.
‘ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపిచ్చి అత్తెసరు మార్కులతోటి కాంగ్రెసోళ్లు గద్దెనెక్కిండ్రు. వంద రోజుల్లో ఏమేమో చేస్తమన్నరు. గ్యారంటీ కార్డులన్నరు. మరి ఈ రెండేళ్లలో ఏం పీకిండ్రని నేను అడుగుతున్నా. ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ..? ఏమన్న అంటే ఫ్రీ బస్సు ఇచ్చినం అంటున్నరు. ఎవరికిచ్చిండ్రు ఫ్రీ బస్సు..? మహిళలకు ఫ్రీ బస్సట.. కానీ మొగోళ్లకు డబుల్ టికెటట. సదువునే పిల్లల బస్‌పాస్ చార్జీలు చాలానే పెంచిండ్రు. ఇట్ల అబద్దాలు చెప్పి, అధికారంలోకి వచ్చి, మంచిగున్న రాష్ట్రాన్ని ఆగమాగం చేసిండ్రు. ప్రజలు కూడా వాళ్ల మాటలు నమ్మిండ్రు. కాంగ్రెస్‌కు ఓటేస్తే రూ.4 వేల పింఛన్ వస్తదనుకున్నరు. ధనిక రాష్ట్రమేగదా ఇస్తడని పొరబడ్డరు. మరి ఇప్పుడు ఆ ధనమంతా ఎక్కడికి పోయింది..? ఎక్కడి పోతుందంటే ఢిల్లీకి పోతున్నది’ అని కేటీఆర్ ఆరోపించారు.