మహబూబ్నగర్ : రేవంత్రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ఈ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు కొత్తగా చేసిందేమీ లేదని, పైగా బీఆర్ఎస్ హయాంలో ఉన్న పథకాలను కూడా ఊడగొట్టిందని అన్నారు. మహబూబ్నగర్ జిల్లాలో జరిగిన బీఆర్ఎస్ సర్పంచ్ల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ప్రసంగించారు. పార్టీ తరఫున గెలిచిన సర్పంచ్లు, వార్డు సభ్యులను అభినందించిన అనంతరం.. కాంగ్రెస్ సర్కారుపై విమర్శలు చేశారు.
అధికారంలోకి వచ్చిన రెండేళ్లకే కాంగ్రెస్ సర్కారుపై ప్రజల్లో అసంతృప్తి పెరిగిపోయిందని కేటీఆర్ అన్నారు. అందుకే మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు 40 శాతం సీట్లను ప్రజలు మనకు ఇచ్చారని చెప్పారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలు ప్రజల్లో మార్పు మొదలైందనడానికి నిదర్శనమని అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో చూసింది శాంపిల్ మాత్రమేనని, ప్రజలు అసంతృప్తిగా ఉన్నరని, రేపు మున్సిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్కు బుద్ధి చెబుతరని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
ఇంకా ఏమర్నారంటే.. ‘అబద్ధాలు చెప్పి, అడ్డగోలు మాటలు చెప్పి, ‘నేను మీ పాలమూరు బిడ్డను నన్ను ముఖ్యమంత్రిగా గెలిపించండి’ అని చెప్పి, ఆరు గ్యారంటీలు అని చెప్పి, 420 హామీలు ఇచ్చి కాంగ్రెస్ గద్దెనెక్కింది. రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు అయ్యింది. నూరు రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలుచేస్తాం అన్నరు. ఒక్క హామీ అయినా అమలయ్యిందా..? ఒక్కసారి గుర్తుచేసుకోండి. ఒక్క హామీ అయినా అమల్లోకి వచ్చిందా..? కొత్తవి అమలు చేయడం దేవుడెరుగు.. ఉన్నయ్ కూడా ఊడగొట్టిండ్రు’ అని విమర్శించారు.
‘కేసీఆర్ హయాంలో గర్భిణి మహిళలను ఆస్పత్రికి తీస్కపోయ్, బిడ్డ పుట్టినంక కేసీఆర్ కిట్ ఇచ్చి, మళ్లీ ఇంటి కాడ దింపిన సంస్కారం ఉండె. మగ పిల్లగాడు పుడితే రూ.12 వేలు ఇచ్చినం. ఆడపిల్ల పుడితే మహాలక్మి పుట్టిందని రూ.13 వేలు ఇచ్చినం. ఇయ్యాల కేసీఆర్ కిట్టు ఉన్నదా..? అది కూడా పోయింది. బతుకమ్మ పండుగకు కేసీఆర్ ఆడబిడ్డలకు చీరలు పెట్టేది. ఇయ్యాల వస్తున్నదా బతుకమ్మ చీర..? రంజాన్ పండుగ వస్తే రంజాన్ తోఫా ఇచ్చేది. ఇయ్యాల ఇస్తున్నరా రంజాన్ తోఫా..? క్మిస్మస్ పండుగ వస్తే క్రిస్మస్ కానుక ఇచ్చేది. ఇయ్యాల వస్తున్నదా ఆ కానుక..? అది కూడా లేదు’ అని ప్రశ్నల వర్షం కురిపించారు.