వరంగల్, ఆగస్టు 27: తెలంగాణ రాష్ట్ర రాజముద్రలో కాకతీయ కళాతోరణం లేకుండా గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ అధికారులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. ‘ఇది అధికార నిర్ణయమా? లేక అనధికార నిర్లక్ష్యమా? తెలంగాణలో అసలు ఏం జరుగుతుందో కనీసం మీకైనా తెలుసా సీఎస్ గారు?’ అంటూ తన ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. తెలంగాణ అస్థిత్వ చిహ్నాలైన కాకతీయ కళాతోరణం, చార్మినార్లతో వెకిలి పనులు ఏంటి? కొత్త చిహ్నం ఎవరు? ఎప్పుడు అమోదించారు? ఒకవేళ అమోదించకపోతే అధికారులు దీనిని ఎందుకు వాడారు? దీనికి కారకులెవరో కనుక్కొని వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతోపాటు గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ప్రదాన కార్యాలయం ముందు అధికారులు రాజముద్రలో కాకతీయ కళాతోరణం, చార్మినార్ చిహ్నాలు లేకుండా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఫొటోను ఆయన పోస్ట్ చేశారు.
వరంగల్, ఆగస్టు 27: వరంగల్ బల్దియా అధికారులు తప్పును గుర్తించారు. రెండు రోజుల క్రితం గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం ముందు ఎల్ఆర్ఎస్ హెల్ప్‌లైన్ పేరిట అధికారికంగా ప్రకటించని రాష్ట్ర రాజముద్రతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై కమిషనర్ అశ్విని తానాజీ వాకడే చర్యలు తీసుకుంటున్నట్టు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. బల్దియా టౌన్‌ప్లానింగ్ విభాగం ఉద్యోగులకు మెమో జారీ చేసి చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాజముద్రను తప్పుగా ముద్రించిన ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంపై ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన ‘ఎక్స్’ అకౌంట్లో ఫ్లెక్సీతో సహా పోస్ట్ చేశారు. దీనిపై స్పందించిన కమిషనర్ ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. బల్దియా కార్యాలయం ముందు రాజముద్రలో కాకతీయ కళాతోరణం, చార్మినార్‌తో కూడిన కొత్త ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు.