హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ) : నాడు మత్తళ్లు దుంకిన చెరువుల్లో నేడు నీళ్లు అట్టడుగుకు చేరాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. నాడు కాలువల నిండా నీళ్లు పారించి ఏడాదికి రెండు పంటలు పండించుకునేందుకు రైతులకు కేసీఆర్ అండగా నిలిచారని మంగళవారం ఎక్స్ వేదికగా గుర్తుచేశారు. సమయానికి రైతుబంధు, 24 గంటల ఉచిత కరెంటు, సాగునీళ్లు, విత్తనాలు, ఎరువులు, పంటల కొనుగోళ్లతో రైతులకు కంటినిండా నిద్ర, కడుపు నిండా సంతోషం ఉండేదని పేర్కొన్నారు. కేసీఆర్ పాలనలో వ్యవసాయ అనుకూల విధానాలతో సాగు పండుగలా విరాజిల్లిందని, ఇప్పుడు అలంపూర్ నుంచి ఆదిలాబాద్ వరకు అశ్వారావుపేట నుంచి జహీరాబాద్ వరకు వ్యవసాయం తిరోగమనంలో సాగుతున్నదని వాపోయారు.
సాగునీళ్లు లేక పంటలు ఎండుతుంటే రైతుల గుండెలు మండుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మన ప్రాజెక్టులను పడావుబెట్టి, ఆంధ్రాకు నీళ్లు వదిలి పంటలను ఎండబెడుతున్నదని మండిపడ్డారు. 15 నెలల పాలనలో రైతుభరోసా రాలేదని, సాగునీళ్లు, కరెంటు, విత్తనాలు, ఎరువులు అందడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. అన్ని గండాలను దాటుకొని పంటలు పండిస్తే కొనుగోళ్లు ఉండవని ఎద్దేవాచేశారు. అన్నదాతలపై కక్షగట్టిన కాంగ్రెస్ సర్కారు వ్యవసాయాన్ని ఆగం పట్టించిందని దుయ్యబట్టారు. ‘కాంగ్రెస్ వచ్చింది.. కరువు తెచ్చింది.. ఎట్లుండె తెలంగాణ ఎట్లయింది?’ అంటూ కేటీఆర్ వాపోయారు.