Telangana | ఇచ్చోడ, జనవరి 25 : ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం లచ్చింపూర్(బీ)గ్రామానికి చెందిన గిరిజన మహిళ పెందుర్ సోంబాయికి ఆరుగురు కూతుళ్లు. ఇటీవల రెండో కూతురు హిరాదేవికి వివాహం చేసింది. కల్యాణలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకోగా రూ.1,00,116 చెక్కు వచ్చింది. శుక్రవారం డబ్బుల కోసం బ్యాంకుకు వెళ్లగా.. రూ.40 వేలు బ్యాంక్ ఖాతాలో జమ అయినట్టు సిబ్బంది తెలిపారు. బ్యాంక్ మేనేజర్‌ను అడిగితే రెండేండ్ల క్రితం పంట రుణం రూ.1.60 లక్షలు తీసుకోగా, రూ.60 వేలు వడ్డీ కావడంతో అవి కట్ చేశారని తెలుపడంతో ఆందోళనకు గురైంది.
కల్యాణలక్ష్మి సొమ్మును వడ్డీ వసూలు కింద పెట్టుకుంటరా? ఇది సర్కారా? రికవరీ ఏజెన్సీయా? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆడబిడ్డ పెండ్లి చేయడం కష్టం కావద్దని కేసీఆర్ తీసుకొచ్చిన కల్యాణలక్ష్మి పథకాన్ని వడ్డీ వసూలు సీమ్‌గా మార్చడానికి సిగ్గులేదా? అని మండిపడ్డారు. కల్యాణలక్ష్మి రూ.లక్షలో 60 వేలు బ్యాంకుకు, 40 వేలు లబ్ధిదారునికి ఇస్తారా? అని ధ్వజమెత్తారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేశామని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ, కల్యాణలక్ష్మి సొమ్మును వాడింది నిజమా? కాదా? సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దందాలకు వెళ్లే రేవంత్‌రెడ్డి ఆడపిల్ల పెండ్లి కోసం కేసీఆర్ అమలుచేసిన కల్యాణలక్ష్మి స్కీం జోలికి వెళ్లొద్దని సూచించారు.
ఏడాది కాంగ్రెస్ పాలనలో మళ్లీ తిరోగమనం మొదలైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆందోళన వ్యక్తంచేశారు. ‘సంఘర్షణ మనకు కొత్తకాదు.. మోసం చేయటం కాంగ్రెస్‌కు కొత్తకాదు’ అనే విషయాన్ని రైతన్నలు గుర్తుంచుకోవాలని ఆయన విజ్ఞప్తిచేశారు. ‘రైతన్నలారా.. ఆత్మహత్యలు సమస్యకు పరిషారం కాదు.. నాగలి ఎప్పుడూ ఒంటరి కాదు.. నాగలి ఈ దేశ భవిష్యత్తు.. జోడెద్దుల మాదిరిగా బీఆర్ఎస్ ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటుంది’ అని భరోసా ఇచ్చారు.