హైదరాబాద్, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): ‘నిన్న గేటు ఎత్తుకెళ్లిండ్రు.. నేడు స్టార్టర్లు పీకెళ్లిండ్రు.. రేపు పుస్తెలతాళ్లు గుంజుకపోతరా?’ అని సర్కారు తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. వ్యవసాయరంగంలో కేసీఆర్ హయాంలో నెలకొన్న సంతోషపు ఆనవాళ్లను చెరిపేసి, ఉమ్మడి రాష్ట్రంలో రైతులను పీడించిన సంక్షోభం ఆనవాళ్లను తెలంగాణ నేలపై మళ్లీ తెస్తామంటే రైతులు సహించబోరని హెచ్చరించారు. కష్టాల్లో ఉండి, అప్పుల పాలైన అన్నదాతలపై కాంగ్రెస్ సర్కార్‌కు ఇంత కక్షనా? అని మండిపడ్డారు. సాగునీరు లేక పంటలు ఎండిపోతుంటే పట్టించుకునే సోయిలేదు కాగాని, రైతులను ఇన్ని రకాలుగా వేధిస్తరా? అని ప్రశ్నించారు.
‘రైతులంటే అంత అలుసైపోయారా? బీఆర్ఎస్ ప్రభుత్వం రద్దుచేసిన నీటి తీరువాను ఐదేండ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు వసూలు చేస్తరా? రైతులకు సాగునీరిచ్చే సోయిలేదు గాని, ఓట్లనాడు ప్రేమ ఒలకబోసి అధికారం చేపట్టాక వారికి నరకం చూపిస్తరా? రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ సరిగా చేయ చేతగాక ఇంత దారుణానికి ఒడిగడుతరా?’ అని నిలదీశారు. రైతు భరోసాకు సవాలక్ష ఆంక్షలు పెట్టి రైతన్నలను సంక్షోభంలోకి నెట్టింది ముమ్మాటికీ కాంగ్రెస్ సర్కారేనని విమర్శించారు. రైతు పెట్టుబడి సాయాన్ని ఎగ్గొట్టి మళ్లీ వాళ్లు అప్పులపాలయ్యేలా చేసిన పాపం కాంగ్రెస్ సర్కారుదేనని మండిపడ్డారు. ‘ఆత్మగౌరవంతో బతికే అన్నదాతపై ఈ దాష్టీకాలేమిటి? దుర్మార్గాలేమిటి?’ అని ధ్వజమెత్తారు. వ్యవసాయరంగంలో సంతోషాన్ని చెరిపేసి మళ్లీ సంక్షోభాన్ని తెస్తామంటే రైతులు సహించరని, సంఘటితంగా పోరాడి సీఎం రేవంత్‌రెడ్డికి తగిన బుద్ధిచెప్తారని హెచ్చరించారు.
బంజారాల ఆరాధ్యదైవం సేవాలాల్‌కు కేసీఆర్ పాలనలోనే సముచిత గౌరవం లభించిందని కేటీఆర్ గుర్తుచేశారు. తండాలను పంచాయతీలుగా మార్చి ఆయన కలలను సాకారం చేశారని పేర్కొన్నారు. ఆ మహనీయుడి పేరిట హైదరాబాద్‌లో బంజారా భవనాన్ని నిర్మించారని తెలిపారు. శనివారం సేవాలాల్ జయంతిని పురస్కరించుకొని ఎక్స్ వేదికగా ఆ మహనీయుడికి కేటీఆర్ నివాళులర్పించారు. జయంత్యుత్సవాలను అధికారికంగా నిర్వహించి గౌరవించుకున్నామని గుర్తుచేశారు. వీరుడిగా, సంఘ సంస్కర్తగా, వైతాళికుడిగా సేవాలాల్ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని కిర్తీంచారు. ఆయన చూపిన మార్గంలో ప్రతిఒక్కరూ ప్రజాసేవకు అంకితంకావాలని పిలుపునిచ్చారు.