నాంపల్లి క్రిమినల్ కోర్టులు/హైదరాబాద్ సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై పరువు నష్టం దావా వేశారు. తనపై తప్పుడు ఆరోపణలు, అనుచిత వ్యాఖ్యలు చేసి పరువుకు భంగం కలిగించిన సంజయ్ తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేదా రూ.10 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కొన్ని మీడియా సంస్థలు, సామాజిక మాధ్యమాలపై కూడా హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో సోమవారం పరువు నష్టం దావా వేశారు. సోమవారం విచారణకు స్వీకరించిన కోర్టు బండి సంజయ్‌కి సమన్లు జారీచేస్తూ డిసెంబర్ 15న విచారణకు హాజరవ్వాలని ఆదేశించింది.
వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా బండి వ్యాఖ్యలు
కేటీఆర్‌కు విరుద్ధంగా బండి సంజయ్ ఆగస్టు 8న తప్పుడు ఆరోపణలతోపాటు అనుచితమైన వ్యాఖ్యలు చేశారని ఆయన తరఫు న్యాయవాదులు పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలను ఏబీఎన్ తెలుగు, ఎన్టీవీ, టీవీ5, వీ6, ఏఎన్ఎన్ తెలుగు వంటి టీవీ చానళ్లు, ఇండియా టుడే, ఎన్డీటీవీ, డెకన్ హెరాల్డ్, టైమ్స్ ఆఫ్ ఇండియా వంటి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు, ఎక్స్ (ట్విట్టర్), యూట్యూబ్, గూగుల్, మెటా (ఫేస్ బుక్/ఇన్స్టాగ్రామ్) వంటి సోషల్ మీడియా సంస్థలు విస్తృతంగా ప్రసారం చేశాయని తెలిపారు. ఈ వ్యాఖ్యలు కేవలం ఆయన పరువుకు భంగం కలిగించడమే కాకుండా, కేటీఆర్ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయని తెలిపారు. 2025 ఆగస్టు 11న లీగల్ నోటీసు పంపినప్పటికీ, బండి సంజయ్ బేషరతుగా క్షమాపణ చెప్పడానికి నిరాకరించడంతో కేటీఆర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్టు పేర్కొన్నారు. బండి సంజయ్ కేవలం రాజకీయ కక్షతో నిందారోపణలు చేస్తూ దుష్ర్పచారానికి పాల్పడ్డారని వెల్లడించారు. కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ ఇటువంటి బాధ్యతారహితమైన, పరువునష్టం కలిగించే వ్యాఖ్యలు చేయడం వల్ల ప్రజాప్రతినిధుల విశ్వసనీయత, గౌరవానికి తీవ్రమైన పరిణామాలు ఉంటాయని తమ దావాలో వెల్లడించారు. బండి సంజయ్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌చేశారు.