రాష్ట్రంలో క్రైం రేటు పెరుగుతున్నది. మహిళలపై దాడులు జరుగుతున్నాయి. శాంతిభద్రతలు క్షీణించాయి. కొత్త పెట్టుబడులు తీసుకొనిరాకపోగా, గాల్లో తిరుగుతూ గాలి మాటలు మాట్లాడుతున్నారు. రూ.లక్షా నలభై వేల కోట్లు అప్పు చేశారు. – కేటీఆర్
KTR | రాజన్న సిరిసిల్ల, జనవరి 24 (నమస్తే తెలంగాణ): ‘రూ.2 లక్షల రుణమాఫీ పూర్తయ్యిందంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్తున్న మాటలు శుద్ధ అబద్ధాలే. పూర్తిస్థాయిలో కాలేదని స్వయానా మంత్రి దామోదర రాజనర్సింహ చెప్తున్నరు. ఇకనైనా మోసపు మాటలు బంద్ పెట్టాలి’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు హెచ్చరించారు. గుడ్లు పీకుతా, పేగులు మెడలో వేసుకుంటానంటూ డైలాగులు కొట్టిన రేవంత్‌కు ప్రభుత్వాన్ని నడపడం చేతకావట్లేదని ధ్వజమెత్తారు. ‘మాటలు కోటలు దాటుతున్నాయి. చేతలు గడప దాటట్లేదు. పాలన అంటే డైలాగులు చెప్పినంత సులభం కాదు.
ప్రభుత్వం నడపడం ఎంత కష్టమో ఆయనకు ఇప్పుడు తెలిసి వచ్చింది’ అని చురకలంటించారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై కేసులు ఎలా పెట్టాలి? ఎవరిని జైల్లో తోయాలన్న కుట్రలు మాని ఆరు గ్యారెంటీలు అమలు చేసి రాష్ట్ర అభివృద్ధిపై దృష్టిపెట్టాలని హితవు చెప్పారు. మహాలక్ష్మి పథకం ఎందుకు అమలు చెయ్యలేదని నిలదీశారు. కోటీ అరవై ఐదు లక్షల మంది ఆడపడచులు రూ.2,500 పింఛను కోసం ఎదురుచూస్తున్నారని, అందుకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజాపాలనలో తీసుకున్న కోటి ఐదు లక్షల దరఖాస్తులు ఏమయ్యాయని ప్రశ్నించారు. తీసుకున్న దరఖాస్తులకు పథకాలు అమలు చెయ్యకుండా మళ్లీ ఎందుకు గ్రామసభలు పెట్టారని నిలదీశారు. ఇచ్చిన దరఖాస్తులకు దిక్కులేదని, జాబితాలో పేరు రాలేదంటే మళ్లీ దరఖాస్తు పెట్టుకోమని చెప్పడం దాటవేయడమేనని ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పలు వార్డుల్లో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం స్థానిక తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మున్సిపాలిటీ పాలకవర్గ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ నెల 26తో పదవీకాలం ముగుస్తున్న నేపథ్యంలో సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల చైర్పర్సన్లతోపాటు కౌన్సిలర్లందరినీ ఘనంగా సన్మానించి, మాట్లాడారు. మనకు అధికారం పోయింది కానీ, ప్రజల్లో అభిమానం మాత్రం పోలేదని కేటీఆర్ స్పష్టంచేశారు. ఎక్కడికి పోయినా, ఎవరిని కదిలించినా కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండేనంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. పోయింది అధికారమే తప్ప పోరాట పటిమ కాదని, ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని పిలుపునిచ్చారు. వచ్చేది మన ప్రభుత్వమేనని, కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తంచేశారు. ‘గాడిదలుంటేనే గుర్రం విలువ తెలుస్తుంది. చీకటితోనే వెలుగు విలువ తెలుస్తుంది.. కేసీఆర్ ప్రభుత్వం లేని లోటు ప్రజలంతా అర్థం చేసుకుంటున్నారు’ అని తెలిపారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రామసభల్లో అధికారులను ఎక్కడికక్కడ నిలదీస్తున్నారని, సర్కారు చేసిన తప్పిదాలకు అధికారులు బలవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
అభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా నిలిపాం
అభివృద్ధిలో దేశానికే తెలంగాణ ఆదర్శం గా నిలిపేలా కేసీఆర్ ప్రభుత్వం పాలన సా గించిందని కేటీఆర్ గుర్తుచేశారు. దేశంలో 3% జనాభా ఉన్న తెలంగాణకు 30% అవార్డులు కేంద్రం ఇవ్వడమే నిదర్శనమని వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో డంప్‌యార్డులు, శ్మశానవాటికలు, పల్లె, పట్టణ ప్రకృతి వనాలు, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక కార్యక్రమాలు ప్రణాళికాబద్ధంగా చేసుకుంటూ ముందుకుపోయామని గుర్తుచేశారు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు అన్న తేడా లేకుండా పల్లెలను దేశానికి పట్టుగొమ్మల్లా అభివృద్ధి చేసి దేశానికి స్ఫూర్తిగా నిలిపిన ఘనత కేసీఆర్‌దేనని కొనియాడారు. పదవులు లేవన్న భావన పక్కనపెట్టి ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషిచేయాలని కౌన్సిలర్లుకు సూచించారు. 2014కు ముందు తెలంగాణ ఎట్లుండె, ఇప్పుడెట్లుందో ప్రజలకు కండ్ల ముందు కనిపిస్తున్నదని చెప్పారు.
మనమంటే ప్రజల్లో అభిమానం ఉన్నదని, రెట్టింపు ఉత్సాహంతో వారికి మెరుగైన సేవలందించి ఎక్కువ అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. కేసీఆర్ ప్రభు త్వం సిరిసిల్ల జిల్లాకు రూ.నలభై కోట్లు కేటాయించిందని, కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు ఇవ్వదని చెప్పారు. సిరిసిల్ల, వేములవాడ ప్రాంతాల అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం వందల కోట్లు ఖర్చుపెట్టిందని వివరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణ అ ధ్యక్షుడు చక్రపాణి, సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్లు జిందం కళ, రామతీర్థపు మాధవి, వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనర్సింహారావు, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.