హైదరాబాద్: సీపీఐ అగ్ర నాయకులు, నల్లగొండ మాజీ పార్లమెంటు సభ్యులు కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి (Suravaram Sudhakar Reddy) మరణం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్ర విచారం వ్యక్తంచేశారు. ఆయన మరణం తెలంగాణ రాజకీయాలకు, కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటని చెప్పారు. సురవరం సుధాకర్ రెడ్డి తన జీవితాన్ని ప్రజల కోసం, పేదల అభ్యున్నతి కోసం అంకితం చేశారు. నల్లగొండ పార్లమెంటు సభ్యుడిగా ఆయన అందించిన సేవలు అపారమైనవని తెలిపారు. విలువలతో కూడిన రాజకీయాలకు ఆయన నిలువుటద్దమని వెల్లడించారు. ఆయన పోరాట స్ఫూర్తి, నిబద్ధత అందరికీ స్ఫూర్తిదాయకమని చెప్పారు. వారి కుటుంబానికి, మిత్రులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సురవరం సుధాకర్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.
గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సురవరం సుధాకర్‌రెడ్డి (83) హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిశారు. మహబూబ్ నగర్ జిల్లాలోని కొండ్రావుపల్లి గ్రామంలో 1942 మార్చి 25లో జన్మించిన సురవరం.. 1998, 2004లో రెండుసార్లు నల్లగొండ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. సీపీఐ విద్యార్థి విభాగం ఏఐఎస్ఎఫ్ నుంచి మొదలైన ఆయన ప్రస్థానం సీపీఐ ప్రధాన కార్యదర్శి వరకు సాగింది.
చండ్ర రాజేశ్వర్‌రావు తర్వాత ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన రెండో తెలుగు వ్యక్తిగా సురవరం నిలిచారు. 2012 నుంచి 2019 వరకు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. సురవరం సుధాకర్‌రెడ్డి తండ్రి వెంకట్రామిరెడ్డి స్వాతంత్య్రసమరయోధుడు. ఆయన తెలంగాణ సాయుధ పోరాటంలోనూ పాల్గొన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి సురవరం సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కర్నూలులోని ఉస్మానియా కళాశాల నుంచి బీఏ, ఓయూ నుంచి ఎల్ఎల్బీ పట్టా పొందారు. 1974లో విజయలక్ష్మితో సుధాకర్‌రెడ్డి వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు.
1998, 2004లో లోక్‌సభకు
1950 చివరలో కర్నూలులోని పాఠశాలలకు ప్రాథమిక సౌకర్యాలను డిమాండ్ చేస్తున్న వారితో చేరడంతో సురవరంరెడ్డి సామాజిక, రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనడం ప్రారంభమైంది. 1960లో ఆయన సీపీఐ విద్యార్థి విభాగం ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ (ఏఐఎస్ఎఫ్) కర్నూలు శాఖలో నిర్వహించిన అనేక పదవుల్లో మొదటి పదవిని చేపట్టారు. తరువాతి దశాబ్దంలో ఆయన ఆంధ్రప్రదేశ్, ఇతర రాష్ర్టాలలో రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొన్నారు. ఏఐఎస్ఎఫ్ స్థానిక, జిల్లా, రాష్ట్ర విభాగాలలో నాయకత్వ పాత్రలను చేపట్టారు. 1966లో సురంవరం ఏఐఎస్ఎఫ్కు ప్రధాన కార్యదర్శి అయ్యారు.
తన రాజకీయ స్థావరాన్ని న్యూఢిల్లీకి మార్చారు. 1970లో ఆయన సంస్థ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. సీపీఐ పార్టీలో మరింత క్రియాశీలక పాత్రపోషించారు. 1971లో ఆయన పార్టీ జాతీయ మండలికి ఎంపికయ్యారు. 1998లో నల్లగొండ నుంచి 12వ లోక్‌సభకు ఎన్నికయ్యి మొదటిసారిగా పార్లమెంట్లో అడుగుపెట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సీపీఐ పార్టీకి కార్యదర్శిగా పనిచేశారు. 1998-99లో మానవ వనరుల అభివృద్ధి కమిటీ, ఔషధ ధర నియంత్రణ ఉపకమిటీలో సభ్యులుగా ఉన్నారు.
ఆర్థిక మంత్రిత్వ శాఖలో కూడా సుధాకర్‌రెడ్డి సలహాదారుడిగా పనిచేశారు. 2004లో 14వ లోక్ సభకు మరోసారి నల్లగొండ నుంచి ఎన్నికయ్యారు. సీపీఐ జాతీయ సమితికి కార్యదర్శిగా, వక్ఫ్‌పై సంయుక్త పార్లమెంటరీ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. గ్రామీణాభివృద్ధి కమిటీ, హౌస్ కమిటీ, సలహా కార్యవర్గ సమితిలోనూ, సమాచార, ప్రసార మంత్రిత్వశాఖలోనూ సభ్యులుగా ఉన్నారు. కార్మికస్థాయి సంఘం చైర్మన్‌గా కూడా సురవరం సుధాకర్‌రెడ్డి బాధ్యతలు నిర్వర్తించారు. సురవరం ఎప్పుడూ కమ్యూనిస్టు పార్టీల విలీనం కోరుకునే వారు.