హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలో ప్రభుత్వ అణచివేత, దమనకాండ విపరీతంగా పెరిగిపోయిందని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆందోళన వ్యక్తంచేశారు. ప్రజాస్వా మ్యం గురించి మాట్లాడే రాహుల్ గాంధీ ఈ అంశంపై వెంటనే స్పందించాలని ఆదివారం ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రభుత్వ విధానాలను నిరసించే ప్రతి గొంతునూ బంధిస్తున్నారని మండిపడ్డారు.
ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలను కవర్ చేస్తున్న జర్నలిస్టులను కూడా విచ్చలవిడిగా అరెస్టు చేస్తున్నారని విచారం వ్యక్తంచేశారు. వందలాది ఎకరాల హెచ్సీయూ భూములను వేలం వేయడాన్ని నిరసిస్తూ ఆదివారం సెంట్రల్ యూనివర్సిటీ లో ఆందోళన చేస్తున్న విద్యార్థులతో పాటు జర్నలిస్టులను కూడా పోలీసు లు అదుపులోకి తీసుకోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు.
తెలంగాణలో పత్రికా స్వేచ్ఛను, భావ ప్రకటన హకును అణచివేస్తున్నారని, ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు. తెలంగాణలో జరుగుతున్న అరాచకాలపై రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దేశంలోని ప్రతి పట్టణానికి వెళ్లి ప్రజాస్వామ్యం, పత్రికా స్వేచ్ఛ గురించి రాహుల్ గాంధీ ఉపన్యాసాలు ఇస్తున్నారని, తెలంగాణలో సొంత పార్టీ పాలనలో జరుగుతున్న అరాచకత్వంపై ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రజాస్వామిక పాలన చేసేలా తమ పార్టీకి ఆదేశాలివ్వాలని రాహుల్ గాంధీకి సూచించారు. విద్యార్థులతోపాటు జర్నలిస్టును బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.