మరో దేశంలో కాళేశ్వరం లాంటి గొప్ప ప్రాజెక్టును నిర్మించి ఉంటే చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయేది..కానీ మన దేశంలో మాత్రం రెండు జాతీయ పార్టీల కుట్రలకు కాళేశ్వరం పావుగా మారింది. రెండు పార్టీలు ఎన్నికుట్రలు చేసినా ప్రజలు నమ్మబోరు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రయోజనాలు తెలంగాణ ప్రజానీకానికి తెలుసు.
-కేటీఆర్
హైదరాబాద్ జూన్ 9 (నమస్తేతెలంగాణ): కేసీఆర్‌ను బద్నాం చేసేందుకే కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కై కల్పతరువు లాంటి కాళేశ్వరంపై దుష్ప్రచారం చేస్తున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. వ్యక్తిగత నిర్ణయంతో ప్రాజెక్టును నిర్మించారని కుసంస్కారంతో వ్యహరిస్తూ కుత్సిత రాజకీయాలకు తెరలేపాయని నిప్పులు చెరిగారు. కాళేశ్వరంపై బీజేపీ, కాంగ్రెస్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని సోమవారం ఓ ప్రకటనలో తిప్పికొట్టారు. రెండు పార్టీలు ఎన్నికుట్రలు చేసినా ప్రజలు నమ్మబోరని, ప్రాజెక్టు ప్రయోజనాలు తెలంగాణ ప్రజానీకానికి తెలుసునని స్పష్టం చేశారు.
అవతకవకలు అబద్ధం
కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం కేవలం ఒక్క వ్యక్తి నిర్ణయం కాదని, అప్పటి తెలంగాణ మంత్రివర్గం సమష్టిగా తీసుకున్న నిర్ణయమని, ఇదే విషయాన్ని అప్పటి మంత్రివర్గంలో ఉన్న ఈటల రాజేందర్, హరీశ్‌రావు స్పష్టం చేశారని కేటీఆర్ ఉదహరించారు. ‘ఇది విధానపరమైన నిర్ణ యం.. ఆచరణలో పెట్టాల్సిన బాధ్యత యంత్రాంగంపై ఉంటుంది’ అని చెప్పా రు. పథకం నిర్మాణం విషయంలో దాచిపెట్టాల్సింది ఏమీలేదని, ఎలాంటి అవకతవకలూ జరగలేదని స్పష్టంచేశారు.
ఇతర దేశాల్లో చరిత్రలో నిలిచిపోయేది
45 లక్షల ఎకరాలకు సాగునీరందించే కాళేశ్వరం లాంటి బృహత్తర ప్రాజెక్టు ఇతర దేశాల్లో నిర్మించి ఉంటే కట్టిన నాయకుడి పేరు అజరామరంగా చరిత్రలో నిలిచిపోయేదని, ఎన్నో పురస్కారాలు దక్కేవని కేటీఆర్ పేర్కొన్నారు. కానీ మన దేశంలో రికార్డు సమయంలో కట్టినందుకు నిందారోపణలు చేస్తున్నారని, ఈ ప్రాజెక్టును రాజకీయ క్రీడలో పావుగా మార్చుకోవడం దురదృష్టకరమని వాపోయారు.
‘భాక్రానంగల్, నాగర్జునసాగర్, నర్మద, శ్రీరాంసాగర్ తదితర ప్రాజెక్టులు నిర్మించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వాలకు దశాబ్దాలు పట్టింది. కానీ ఇంతటి గొప్ప పథకాన్ని నాలుగేండ్లలో పూర్తి చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కింది.’ అని గుర్తుచేశారు. ఇది గిట్టని కాంగ్రెస్, బీజేపీ దున్నపోతు ఈనిందంటే దుడ్డెను కట్టేయిమన్న చందంగా కూడబలుక్కొని కుట్రలకు దిగాయని ధ్వజమెత్తారు.
అందుకే కేసీఆర్, హరీశ్‌రావుకు నోటీసులిచ్చి వేధింపులకు దిగుతున్నాయని విమర్శించారు. ఏదేమైనా హరీశ్‌రావు అన్ని ఆధారాలతో జస్టిస్ ఘోష్ కమిషన్ ఎదుట కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాధాన్యతను వివరించారని, అక్రమాలు జరగలేదని ఏకరువుపెట్టారని, ఇక కేసీఆర్ చెప్పాల్సిందేమీలేదని స్పష్టంచేశారు. విధ్వంసపూరిత విధానాలతో రాష్ర్టాన్ని సీఎం రేవంత్ సర్వనాశనం చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ఎన్నికల ముందు 420 హామీలతో మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన ఆయన ఇప్పుడు మొండి చెయ్యి చూపుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ సర్కారు తాటాకు చప్పుళ్లకు బీఆర్ఎస్ భయపడబోదని తేల్చిచెప్పారు. రేవంత్ తన పదవిని కాపాడుకొనేందుకు మీడియా మేనేజ్మెంట్ చేసి ప్రధాని దృష్టిలో పడేందుకు యత్నిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని ఈ రెండు పార్టీలకు తగిన సమయంలో బుద్ధిచెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.
సీఎం రేవంత్ విధ్వంసపూరిత విధానాలతో రాష్ర్టాన్ని సర్వనాశనం చేస్తున్నరు. ఎన్నికల ముందు 420 హామీలతో మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి ఇప్పుడు మొండి చెయ్యి చూపుతున్నరు. కాంగ్రెస్ సర్కారు తాటాకు చప్పుళ్లకు బీఆర్ఎస్ భయపడబోదు. రేవంత్‌రెడ్డి తన పదవిని కాపాడుకొనేందుకు మీడియా మేనేజ్మెంట్ చేసి ప్రధాని దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తున్నరు.
– కేటీఆర్
కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం ఒక్క వ్యక్తి నిర్ణయం కాదు.. అప్పటి తెలంగాణ మంత్రివర్గం సమష్టిగా తీసుకున్న నిర్ణయం..ఇదే విషయాన్ని అప్పటి మంత్రివర్గంలో ఉన్న ఈటల రాజేందర్, హరీశ్‌రావు స్పష్టం చేశారు. ఈ ఎత్తిపోతల పథకం నిర్మాణ విషయంలో దాచిపెట్టాల్సింది ఏమీలేదు. మొన్న హరీశ్‌రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూసిన ప్రతి ఒక్కరికీ ఈ ప్రాజెక్టు ప్రాధాన్యం, ప్రయోజనం అర్థమవుతుంది. ప్రాజెక్టు వల్ల కలిగే లాభాలను అరటిపండు ఒలిచినట్టు హరీశ్‌రావు విపులంగా వివరించారు. -కేటీఆర్