బీకాన్ సంస్థతో టీజీఐఐసీ ఒప్పందం చేసుకునేనాటికి 400 ఎకరాల భూమి నిషిద్ధ జాబితాలోనే ఉన్నది. మరి తనకు చెందని, తన పేరిట ఎలాంటి హక్కు పత్రాలూ లేని భూమిని టీజీఐఐసీ ఎలా తాకట్టు పెట్టింది? ల్యాండ్ రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ కాకుండానే ఆ భూమి తనదే అన్నట్టుగా రూ.10 వేల కోట్ల రుణం ఎలా తీసుకున్నది? ‘హక్కులు లేకుండానే టీజీఐఐసీ గచ్చిబౌలిలోని 400 ఎకరాలను ఎలా కుదువ బెట్టింది? సామాన్యులకు రుణాలిచ్చేందుకు డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలించి, ఫీల్డ్ వెరిఫికేషన్ చేసే బ్యాంకు అధికారులు..సేల్డీడ్లేని భూమికి ఆర్బీఐ నిబంధనలను కాలరాసి రూ.10 వేల కోట్ల రుణం ఎలా మంజూరు చేశారు? ఇందులోని అంతర్యమేంటి?
-కేటీఆర్
అటవీ, పర్యావరణ, ఫారెస్ట్ చట్టాలు, ఆర్బీఐ నిబంధనలను తుంగలో తొక్కి, భూముల తాకట్టు పేరిట రూ.10 వేల కోట్ల దోపిడీకి కాంగ్రెస్ ప్రభుత్వం పథకం రచించింది. కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల్లో భూ కుంభకోణానికి సీఎం రేవంత్‌రెడ్డే పాత్రధారి, సూత్రధారి! ఓ బీజేపీ ఎంపీ సహకారంతో ఆయన నేరపూరిత కుట్రకు పాల్పడ్డారు. దీనిపై రిజర్వ్‌బ్యాంక్, సెబీ, విజిలెన్స్ కమిషన్, సీబీఐ, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్‌కు ఫిర్యాదు చేస్తాం. కేంద్రం తక్షణమే విచారణ జరపాలి.
-బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
KTR | హైదరాబాద్, ఏప్రిల్ 11 (నమస్తేతెలంగాణ): కంచ గచ్చిబౌలిలోని హెచ్‌సీయూ భూముల వ్యవహారం వెనుక అతిపెద్ద ఆర్థికమోసం దాగి ఉన్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. రూ.10వేల కోట్ల కుంభకోణం జరిగిందని ఆయన ఆధారాలతో బయటపెట్టారు. ఒక బీజేపీ ఎంపీ స్వయంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి సహకరించి, ఈ కుంభకోణానికి బాటలు పరిచారని కేటీఆర్ ఆరోపించారు. సుప్రీంకోర్టు తీర్పుతోపాటు, వివిధ చట్టాలను, ఆర్బీఐ మార్గదర్శకాలను, ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్టు తెలిసీ రేవంత్ ప్రభుత్వం ఈ కుంభకోణానికి పాల్పడిందని ఆరోపించారు. దీనిపై కేంద్రం, రిజర్వ్‌బ్యాంక్, సెబీ, విజిలెన్స్ కమిషన్, సీబీఐ, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ విచారణ జరిపించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
జరిగిన ఆర్థిక నేరానికి సంబంధించి అన్ని కేంద్రంతోపాటు అన్ని దర్యాప్తు సంస్థలకు లేఖలు రాయనున్నట్టు తెలిపారు. ఒకవేళ కేంద్రం స్పందించకపోతే కాంగ్రెస్-బీజేపీ కుమ్మక్కైనట్టుగా భావించాల్సి వస్తుందని స్పష్టంచేశారు. హెచ్‌సీయూ భూములకు సంబంధించి రెండు రోజుల్లో సంచలన విషయాలు బయటపెడుతానని ప్రకటించిన కేటీఆర్.. అన్నట్టుగానే శుక్రవారం తెలంగాణ భవన్లో మీడియా ముందు భారీ కుంభకోణం గుట్టు విప్పారు. కంచ గచ్చిబౌలి భూముల్లో హరిత హననమే కాదు, ఆ భూముల వెనుక ఆర్థిక విధ్వంసానికీ రేవంత్ ప్రభుత్వం ఎలా ఒడిగట్టిందో సోదాహరణంగా వివరించారు. దేశంలోనే అతిపెద్ద బ్యాంకింగ్ కుంభకోణాల్లో ఒకదానికి రేవంత్ సర్కారు పాల్పడిందని కేటీఆర్ విరుచుకుపడ్డారు.
‘అటవీ, పర్యావరణ, ఫారెస్ట్ చట్టాలు, ఆర్బీఐ నిబంధనలను తుంగలో తొక్కి భూముల తాకట్టు పేరిట రూ.10 వేల కోట్ల దోపిడీకి కాంగ్రెస్ ప్రభుత్వం భారీ కుంభకోణానికి పథకం రచించింది. ఈ భూ కుంభకోణానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డే పాత్రధారి, సూత్రధారి! ఓ బీజేపీ ఎంపీ సహకారంతో ఆయన నేరపూరిత కుట్రకు పాల్పడ్డారు’ అని కేటీఆర్ విమర్శించారు. తనదికాని భూమిని టీజీఐఐసీ ఎలా తాకట్టు పెట్టిందని నిలదీశారు. అటవీ స్వభావం ఉన్న భూమిని క్షేత్రస్థాయిలో పరిశీలన చేయకుండానే రూ.10 వేల కోట్ల రుణాన్ని ఐసీఐసీఐ బ్యాంకు ఎలా మంజూరు చేసిందని కేటీఆర్ నిప్పులు చెరిగారు. హెచ్‌సీయూ భూముల తనఖా వెనుక రేవంత్ సర్కారు చేసిన మోసం.. సృష్టించిన ఆర్థిక విధ్వంసం.. మున్ముందు భూముల అ మ్మకం ముసుగులో చేయాలనుకున్న పన్నా గం.. దాని కోసం వ్యవస్థల దుర్వినియోగం.. తదితర అన్ని అంశాలను ఒక్క మీడియా సమావేశంతో కేటీఆర్ ఎండగట్టారు.
గచ్చిబౌలిలోని 400 ఎకరాలను 2003లో చంద్రబాబు ప్రభుత్వం ఐఎంజీ భారత్ అనే సంస్థకు కట్టబెట్టిందని, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ ప్రభుత్వం 2004లో ఆ ఒప్పందాన్ని రద్దు చేసిందని కేటీఆర్ తెలిపారు. దీనిపై ఐఎంజీ భారత్ అధినేత బిల్లీరావు హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో కేసులు వేశారని, దానిపై 2014కు ముందున్న ప్రభుత్వాలతోపాటు ఆ తర్వాత పదేండ్లపాటు కేసీఆర్ ప్రభుత్వం న్యాయపోరాటం చేసిందని ఆయన గుర్తుచేశారు. చివరికి 2024 మార్చి 24న కోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వెలువరించిందని, అయితే అదే అదనుగా కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు భూ కుంభకోణానికి తెరలేపారని కేటీఆర్ వివరించారు.ముఖ్యమంత్రికి ఓ బీజేపీ ఎంపీ పూరిస్థాయిలో సహకరించారని ఆయన ఆరోపించారు.
గచ్చిబౌలిలోని 400 ఎకరాలను తాకట్టుపెట్టాలని నిర్ణయించిన ప్రభుత్వం ఈ దిశగా విచ్చలవిడిగా చట్టాలను ఉల్లంఘించిందని కేటీఆర్ విరుచుకుపడ్డారు. యాజమాన్య హక్కులేవీ లేకుండానే భూములను టీజీఐఐసీ తాకట్టు పెట్టిందని విమర్శించారు. సుప్రీంకోర్టు తీర్పు రాగానే.. 2024 జూన్‌లో ఒక్కో ఎకరానికి రూ.75 కోట్ల విలువగా ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఆ భూములను టీజీఐఐసీకి బదిలీ చేస్తున్నట్టు ప్రభుత్వం నామమాత్రపు జీవో-54 జారీ చేసిందని, కానీ, ఆ భూముల్ని టీజీఐఐసీ పేరుమీదకు రిజిస్ట్రేషన్, సేల్‌డీడ్, మ్యుటేషన్ చేయలేదని చెప్పారు.
టీజీఐఐసీకి ఆ భూములపై యాజమాన్య హక్కులు దక్కలేదని, అయినా తానే యజమాని అన్నట్టుగా బ్యాంకుల వద్ద ఎలా తనఖా పెడ్తుందని కేటీఆర్ ప్రశ్నించారు. ‘బీకన్ సంస్థతో టీజీఐఐసీ ఒప్పందం చేసుకునేనాటికీ సదరు 400 ఎకరాల భూమి నిషిద్ధ జాబితాలోనే ఉన్నది. మరి తనకు చెందని భూమిని, తనపేరిట ఎలాంటి హక్కు పత్రాలు లేని భూములను టీజీఐఐసీ ఎలా తాకట్టు పెడ్తుంది? ఒకవైపు 400 ఎకరాలు హెచ్‌సీయూ పేరిట మ్యుటేషన్ కాలేదు కాబట్టి.. హెచ్సీయూకు ల్యాండే లేదని ప్రభుత్వం వాదిస్తున్నది. మరోవైపు టీజీఐఐసీ పేరు మీదకు ల్యాండ్ రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ కాకుండానే ఆ భూమి తనదే అన్నట్టుగా తనఖా పెట్టించింది’ అని కేటీఆర్ పేర్కొన్నారు.
ఎఫ్ఆర్బీఎం పరిధిలోకి రాకుండా ప్రభుత్వానికి రుణం ఇప్పిస్తానంటూ రాష్ట్రానికి చెందిన ఓ బీజేపీ ఎంపీ చెప్పడంతో రేవంత్ సర్కారు ఒప్పందానికి సిద్ధమైందని, ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఐడ్వెజర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే బోక్రర్ కంపెనీని సదరు ఎంపీ పరిచయం చేశారని కేటీఆర్ తెలిపారు. ‘కంచ గచ్చిబౌలి లోని 400 ఎకరాల భూమిని తనఖాపెట్టాలనుకున్న ప్రభుత్వానికి టీఐఏ దళారీలా వ్యవహరించింది. పేరుకు మర్చంట్ బ్యాంకే కానీ, అది చేసేది బ్రోకరేజీ! ఎఫ్ఆర్బీఎంను బైపాస్ చేసి తాము బ్యాంకుల నుంచి రుణం ఇప్పిస్తామని, అందుకుగాను తమకు కొంత లంచమో, కమీషనో ఇవ్వాలని సదరు సంస్థ చెప్పడంతో.. అప్పుల యావలో ప్రభుత్వం అందుకు అంగీకరించింది. టీఐఏకు రూ.169 కోట్లు ముట్టజెప్పింది. ప్రభుత్వం కమీషన్ అంటుందేమోకానీ, చేసింది నేరం కాబట్టి అది లంచమే అవుతుంది. ఆ తర్వాత ‘బీకన్ ట్రస్టీషిప్’ అనే ఫైనాన్షియల్ అడ్వైజరీ కంపెనీని ముందుపెట్టి ప్రభుత్వం-టీఐఏ తాకట్టు కథ నడిపించాయి’ అని కేటీఆర్ వివరించారు.
‘సాధారణంగా ఎవరైనా తన ఇంటిపైనో, ప్లాట్ పైనో లోన్ తీసుకోవాలనుకుంటే.. దాని రిజిస్టర్డ్ వాల్యూ ఎంత? ఆ ఏరియాలో మార్కె ట్ వాల్యూ ఎంత? అనే వాటి ఆధారంగా తనఖా పెట్టుకుని లోన్ ఇస్తారు. కానీ కంచ గచ్చిబౌలి 400 ఎకరాల విషయంలో అన్ని నిబంధనలను ప్రభుత్వం తుంగలో తొక్కింది. టీజీఐఐసీకి ఎలాంటి ఓనర్షిప్ లేకుండానే బ్రోకర్ కంపెనీ మాట విని తాకట్టుపెట్టేందుకు నిర్ణయించింది’ అని కేటీఆర్ తెలిపారు. స్టాం పులు, రిజిస్ట్రేషన్ల శాఖ లెక్కల ప్రకారం గచ్చిబౌలి ఏరియాలో గజం విలువ రూ.26,900గా ఉన్నదని, అంటే 400 ఎకరాలకు దాని విలువ గరిష్ఠంగా రూ. 5,240 కోట్లకు మించదని కేటీఆర్ తెలిపారు.
కానీ రేవంత్ ప్రభుత్వం రెవెన్యూశాఖ అధికారులతో ఆ భూమి విలువను రూ.30 వేల కోట్లు అని మార్చి చెప్పిందని, దాని ఆధారంగా బీకన్ కంపెనీని ముందుపెట్టి టీజీఐఐసీ ఆ భూములను ఐసీఐసీఐ బ్యాంకు కు తాకట్టు పెట్టి రూ.10 వేల కోట్ల లోన్ తీసుకున్నదని కేటీఆర్ వివరించారు. ‘లోన్ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు భూమి విలువను, మార్కె ట్ విలువను అంచనా వేయాల్సిన బ్యాంకు.. అదేం లేకుండానే ప్రభుత్వం చెప్పిన లెక్కను ప్రభుత్వం గుడ్డిగా ఎలా నమ్మింది? యాజమాన్య పత్రాలు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు లేకుండానే తనఖా పెడితే నమ్మేసి బ్యాంకు రూ.10 వేల కోట్ల రుణం ఎలా మంజూరు చేసింది? తప్పుడు పత్రాలతోపాటు బ్యాంకుల్ని మోసగించిన ఘటనలో టీజీఐఐసీ డైరెక్టర్‌తోపాటు పరిశ్రమల శాఖ సెక్రటరీనీ జైల్లో పెట్టవచ్చు’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
బ్యాంకుల నుంచి రూ.10 వేల కోట్ల రుణం తీసుకునేందుకు కంచ గచ్చిబౌలిలోని వివాదాస్పద భూమి విలువను పెంచిన ప్రభుత్వం.. ఆ తర్వాత అదే భూమి విలువను తగ్గించి మొత్తంగా కొట్టేసేందుకు పన్నాగం పన్నిందని కేటీఆర్ ఆరోపించారు. ‘ఎకరం విలువ రూ.75 కోట్లు అని ప్రభుత్వం జూన్‌లో జీవో జారీ చేసింది. ఐదు నెలలు తిరగకుండానే నవంబర్ 23న మరోసంస్థతో కొత్త వాల్యూయేషన్ తీసుకొచ్చింది. దాని ప్రకారం ఎకరాకు రూ. 52 కోట్లు అని రిపోర్ట్ తయారు చేశారు. అంటే ఐదు నెలల్లో భూమి విలువను ఎకరానికి రూ. 25 కోట్లు తగ్గించారు. ఆ తర్వాత బహిరంగ మార్కెట్లో దాని విలువ ఎకరానికి రూ.41.6 కోట్లు మాత్రమేనని ప్రకటించింది.
అంటే 400 ఎకరాల భూమి విలువను రూ.30 వేల కోట్ల నుంచి రూ. 16,640 కోట్లకు ప్రభుత్వమే కుదించింది. ఎందుకు పెంచింది? ఎందుకు తగ్గించింది?’ అని కేటీఆర్ ప్రశ్నించారు. భూమి విలువను పెంచడం వెనుక బ్యాంకుల్ని ముంచే ఉద్దేశం ఉన్నట్టుగానే.. తగ్గించడం వెనుక సదరు భూమిని కొట్టేసేందుకు స్కెచ్ వేసిందని ఆయన ఆరోపించారు. అదే బ్యాంకర్, అదే బ్రోకర్‌ను అడ్డంపెట్టుకొని అడ్డికి పావుశేరుకు 400 ఎకరాలను కొట్టేసేందుకు రేవంత్‌రెడ్డి కుట్ర చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఒక్క కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాలే కాకుండా.. అదే తరహాలో హెచ్ఎండీఏ పరిధిలోని భూములనూ రూ. 60 వేల కోట్లకు అమ్మేందుకు ప్రభుత్వం సిద్ధమైందని చెప్పారు. అసెంబ్లీలోనే ప్రభుత్వం ఈ విషయాన్ని వెల్లడించిందని తెలిపారు.
ఆర్బీఐ, సెబీ, వాల్టా, ఫారెస్ట్, ఎన్విరాన్మెంట్ చట్టాలను రేవంత్ సర్కారు యథేచ్ఛగా ఉల్లంఘించి భారీ ఆర్థిక దోపిడీకి పాల్పడిన ఘటనపై కేంద్ర సంస్థలు దర్యాప్తు జరుపాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు. అన్నిరకాల ఉల్లంఘనలు చోటుచేసుకున్న ఈ ఉదంతంపై రిజర్వ్‌బ్యాంక్, సెబీ, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్, కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ, కేంద్ర విజిలెన్స్ కమిషన్, సీబీఐకి తాము ఫిర్యాదు చేస్తామని ప్రకటించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, రేవంత్‌రెడ్డిని కాపాడే ఉద్దేశం లేకుంటే వెంటనే భూకుంభకోణంపై దర్యాప్తు చేయించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
‘నిరుడు పార్లమెంట్ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో పర్యటించినప్పుడు.. రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారంటూ ప్రధాని మోదీ ఆరోపించారు. కానీ కేంద్రంలో మూడో పర్యాయం అధికారంలోకి వచ్చి ఏడాదైనా ఎందుకు ఆ ట్యాక్స్‌పై మోదీ విచారణ జరిపించడం లేదు. అమృత్ స్కీంలో రేవంత్‌రెడ్డి బావమరిది రూ.1,100 కోట్ల స్కాం చేశారని ఆధారాలతో నేను ఫిర్యాదు చేసినా నేటికీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఉలుకూపలుకూ లేదు. అలాగే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు జరిపి ఆరునెలలైనా ఇంతవరకు కేసు ఎందుకు పెట్టలేదు’ అని కేటీఆర్ నిలదీశారు.
హెచ్‌సీయూ భూముల తాకట్టు, అమ్మకంపై కేంద్రం వెంటనే స్పందించి లోతుగా విచారణ చేపట్టాలని కేటీఆర్ కోరారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రధాని, ఆర్థికమంత్రిని కలిసి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. న్యాయస్థానాల్లో కేసు వేస్తామని, తమ ఎంపీల ద్వారా రాజ్యసభలో లేవనెత్తుతామని కేటీఆర్ స్పష్టంచేశారు. నిన్న వచ్చిన సుప్రీంకోర్టు సాధికార కమిటీ పర్యావరణ విధ్వంసాన్ని మాత్రమే పరిశీలించిందని, అందుకే వారికి ఆర్థిక నేరంపై తాము ఫిర్యాదు చేయలేదని కేటీఆర్ పేర్కొన్నారు. కేంద్రం విచారణకు ఆదేశించకుంటే రేవంత్‌రెడ్డితో బీజేపీ నేతలు కుమ్మక్కు అయినట్టుగా భావించాల్సి వస్తుందని స్పష్టంచేశారు.
వాల్టాకు విరుద్ధంగా హెచ్‌సీయూలోని వంద ఎకరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చెట్లను నరికివేయించిందని కేటీఆర్ దుయ్యబట్టారు. అన్నెం పున్నెం ఎరుగని మూగజీవాలైన మూడు జింకల మృతికి ప్రభుత్వమే కారణమైందని మండిపడ్డారు. గతంలో జింకలను వేటాడిన కేసుల్లో సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించి బాలీవుడ్ నటులకూ శిక్ష వేసిందని, అలాగే వన్యప్రాణులను వధకు కారణమైన రేవంత్‌రెడ్డిపై కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు దుర్మార్గాలను ప్రపం చం మొత్తం చూసిందని చెప్పారు. ప్రభుత్వ దురాగతాలను ఎదిరించి, హెచ్‌సీయూ భూములను కాపాడేందుకు విద్యార్థులు కంకణం కట్టుకోవడం అభినందనీయమన్నారు.
‘హక్కులు లేకుండానే టీజీఐఐసీ గచ్చిబౌలిలోని 400 ఎకరాలను ఐసీఐసీఐ బ్యాంకుకు ఏ విధంగా కుదువ బెట్టింది? సామాన్యులకు రుణాలిచ్చేందుకు ప్రతి డాక్యుమెంట్‌ను క్షుణ్నంగా పరిశీలించి, ఫీల్డ్ మీదకు వెళ్లి వెరిఫికేషన్ చేసే బ్యాంకు అధికారులు, సేల్డీడ్లేని భూమికి ఆర్బీఐ నిబంధనలను కాలరాసి రూ.10 వేల కోట్ల రుణం ఎలా మంజూరు చేశారు? తనఖా పెట్టిన భూమిలో కాలు పెట్టకుండానే అప్పు ఎలా ఇచ్చారు? ఇందులోని అంతర్యమేంటి? అది అక్రమం కాదా? ప్రభుత్వం కూడా ఏ నిబంధనలను అనుసరించి బీకన్ ట్రస్టీషిప్‌ను, ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ అనే బ్రోకర్ కంపెనీని ఎంపిక చేసింది? బీజేపీ ఎంపీ చెప్పారనే ఆ భూములను కట్టబెట్టాలని నిర్ణయించారా?’ అంటూ కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు.
0.4 కెనోపీ ఉన్న భూమి కచ్చితంగా అటవీ భూమే అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన విషయాన్ని కేటీఆర్ ప్రస్తావించారు. రిజర్వ్ ఫారెస్ట్ అని ప్రత్యేకంగా ప్రకటించకున్నా అడవులకు ఉండాల్సిన లక్షణాలుంటే యాజమాన్య హక్కులు ఎవరి పేరిట ఉన్నప్పటికీ ఆ భూమి అటవీభూమిగానే పరిగణించాలని 1996లో సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందని ఆయన గుర్తుచేశారు. ఆ భూముల లెక్కలు తీయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చిందని, అదే విషయమై రేవంత్ ప్రభుత్వం కూడా ఉన్నతస్థాయి కమిటీ వేసిందని వివరించారు. అంటే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం హెచ్‌సీయూ భూములు అటవీభూములేనని స్పష్టమవుతున్నదని, 1980 ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ ప్రకారం అలాంటి భూములను తాకట్టు పెట్టే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి లేదని చెప్పారు. అయినప్పటికీ రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వాల్టా, ఫారెస్ట్, పర్యావరణ చట్టాలను ఉల్లంఘించి అటు హరిత హననానికి, ఇటు భారీ ఆర్థిక నేరానికి పాల్పడిందని కేటీఆర్ ధ్వజమెత్తారు.
ఈ అక్రమ వ్యవహారంలో చక్రం తిప్పిన బీజేపీ ఎంపీకి ‘క్విడ్ ప్రోకో’ తరహాలో అనుచిత లబ్ధిని చేకూర్చేందుకు రేవంత్‌రెడ్డి సిద్ధమయ్యారని కేటీఆర్ ఆరోపించారు. అందుకే తాను సదరు ఎంపీ పేరు చెప్పడంలేదని స్పష్టంచేశారు. మీడియా కూడా ఈ వ్యవహారంపై సమగ్రంగా పరిశోధన చేయాలని కోరారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణ జరిపిస్తామని, బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని స్పష్టంచేశారు. బీకన్ ట్రస్టీషిప్, ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ కంపెనీలను నిషేధించాలని ఆయన డిమాండ్ చేశారు. అక్రమంగా సేకరించిన రూ.10వేల కోట్లను వెనక్కితీసుకోవాలని ఆర్బీఐని కోరారు.
భూములు తాకట్టు పెట్టి తెచ్చిన రూ.10 వేల కోట్లను రైతుభరోసాకు వినియోగిస్తామని ప్రభుత్వం చెప్పిందని, అదే విషయాన్ని తమ అనుకూల మీడియా ద్వారా ప్రచారం కూడా చేయించిందని కేటీఆర్ తెలిపారు. కానీ ఇప్పటివరకు రూ.5వేల కోట్లు కూడా రైతుభరోసా కింద పంపిణీ చేయలేదని మండిపడ్డారు. రైతుల పేరుచెప్పి తెచ్చిన రుణంలో రూ. 5వేల కోట్లతో రేవంత్ ప్రభుత్వం.. మంత్రివర్గంలోని బడా కాంట్రాక్టర్ల జేబులు నింపిందని కేటీఆర్ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ గద్దెనెక్కిన తర్వాత 16 నెలల్లో డిసెప్షన్, డిస్ట్రక్షన్, డిస్ట్రాక్షన్ అనే త్రీడీ విధానాలతో పేదల బతుకులను నాశనం చేస్తున్నదని మండిపడ్డారు. మాజీ మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, బీఆర్ఎస్ నేతలు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, బొల్లం మల్లయ్యయాదవ్, నోముల భగత్, చంద్రావతి తదితరులు ఉన్నారు.