పరకాల, జూలై 27: దేశంలోనే అతిపెద్ద కాకతీయ మెగా టెక్స్టైల్ పారుకు పరిశ్రమలను రప్పించి ఇక్కడి యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని బీఆర్ఎస్ సర్కార్ భావిస్తే, కాంగ్రెస్ నేతలు మాత్రం దానిని నిలువు దోపిడీ చేసే కుట్రలు చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఆగ్రహం వ్యక్తంచేశారు. టెక్స్టైల్ పార్క్‌లో రూ.2,400 కోట్ల పెట్టుబడి పెట్టి, పాతిక వేల మందికి ఉద్యోగాలిస్తామన్న కిటెక్స్ సంస్థను .. తాము చెప్పినవారికే ఉద్యోగాలు ఇవ్వాలంటూ కాంగ్రెస్ నేతలు బెదిరిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ గూండాయిజం భరించలేక పరిశ్రమలు ఇక్కడి నుంచి వెళ్లిపోయే పరిస్థితి దాపురించిందని మండిపడ్డారు. ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమంలో భాగంగా ఆదివారం హనుమకొండ జిల్లా పరకాలలో పోచంపల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 500 మంది మహిళలకు కుట్టుమిషన్లు, వంద మందికి కేసీఆర్ కిట్లను కేటీఆర్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ షాన్‌గా ఉన్న ఆజంజాహి మిల్లు సమైక్య పాలనలో మూతపడటంతో వరంగల్ జిల్లాలోని పద్మశాలీలు బతుకుదెరువు కోసం భీవండి, సూరత్, షోలాపూర్ వంటి పట్టణాలకు వలసపోయారని ఆవేదన వ్యక్తంచేశారు. అలా వలసపోయిన వాళ్లందర్నీ స్వరాష్ట్రంలో తిరిగి వెనకి తెప్పించుకుంటామన్న కేసీఆర్ ఆలోచనల మేరకు వరంగల్ గడ్డపై 1,500 ఎకరాల్లో భారతదేశంలోనే అతిపెద్ద కాకతీయ టెక్స్టైల్ పార్ను ఏర్పాటుచేశామని గుర్తుచేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ చిత్తశుద్ధి, పట్టుదల, నిజాయితీ కారణంగా కేరళకు చెందిన ‘కిటెక్స్’ సంస్థ రూ.2,400 కోట్లను పెట్టుబడిగా పెట్టిందని, దాంతోపాటు ‘యంగ్వన్’ అనే కొరియా సంస్థ, ‘గణేశ్’ అనే ముంబై సంస్థ కూడా పెట్టుబడులు పెట్టడంతో 2022-23 నాటికి టెక్స్టైల్ పార్లో ఒక యూనిట్‌ను ప్రారంభించామని వివరించారు. కాంగ్రెస్ నిర్వాకాల కారణంగా ఆయా సంస్థలు వెనక్కివెళ్లిపోయే పరిస్థితి దాపురించిందని విమర్శించారు. శ్రామికులను పారిశ్రామికవేత్తలుగా మార్చడంలో భాగంగా సూరత్‌కు వలసపోయిన కార్మికులను తిరిగి తెలంగాణకు రప్పించేందుకు కేసీఆర్ హయాంలో మడికొండలో 100 ఎకరాల్లో ఏర్పాటుచేసిన షెడ్లు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాకంతో నిరుపయోగంగా మారాయని విమర్శించారు.
అసెంబ్లీలో నిలదీస్తాం
‘మెగా టెక్స్టైల్ పార్క్‌లో యంగ్వన్, కిటెక్స్, గణేశ్ వంటి పరిశ్రమలు నడవాలని మనకు ఉంటే.. కాంగ్రెస్ పార్టీకి, రేవంత్‌రెడ్డి సర్కార్‌కు మాత్రం వాటి చుట్టూ ఎట్లా పడాలె.. కోట్లకు కోట్లు ఎట్లా కొల్లగొట్లాలె అని ఉంటది. టెక్స్టైల్ పార్క్‌లో అన్నీ మనమే చేసినం. నాలా కట్టేందుకు జాగ మనమే కేటాయించినం. కానీ, రేవంత్‌రెడ్డి, ఆయన దోచుడు బ్యాచ్ రెండు నెలలకే రూ.160 కోట్లు కొల్లగొట్టేందుకు ప్లాన్ చేసింది. పారులో కాల్వ నిర్మాణానికి జనవరి 2025లో రూ.137 కోట్లతో రూపొందించిన అంచనాలను కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు ధనదాహంతో మార్చి 22, 2025న రూ.297 కోట్ల 65 లక్షలకు పెంచారు. కాల్వ నిర్మాణం పేరుతో వరంగల్ జిల్లా కాంగ్రెస్ దండుపాళ్యం బ్యాచ్ రూ.160 కోట్లు దోచుకోవాలని చూస్తున్నది. ప్రశ్నించకపోతే కాంగ్రెస్ నేతలు చేస్తున్న దోపిడీ ఆగదు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఈ అక్రమాలపై నిలదీస్తాం’ అని కేటీఆర్ హెచ్చరించారు. ఇది కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్‌లో కాంగ్రెస్‌ది మెగా మోసం కాకపోతే ఏమైతది? అని ప్రశ్నించారు.