హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్)పై ప్రత్యేక దృష్టి పెట్టాలని గ్రేటర్ హైదరాబాద్ నేతలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. ఓటర్ల జాబితాలో దొంగ ఓట్లు నమోదు కాకుండా చూడాలని, ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీ ఇప్పటికే నమోదు చేసిన దొంగ ఓట్లు, డబుల్ ఓట్లను గుర్తించి వాటిని తొలగిం చేలా చర్యలు చేపట్టాలని సూచించారు. గత జుబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి ఇంట్లోనే పదుల సంఖ్యలో ఓట్లు నమోదు కావడం, వేల సంఖ్యలో ఇతర నియోజకవర్గాల ఓట్లు ఉండటం వల్ల పార్టీ పరాజయానికి దారి తీసిన ఉదంతాన్ని గుర్తుచేశారు. హైదరాబాద్ జిల్లా పార్టీ ప్రజా ప్రతినిధులతో కేటీఆర్ మంగళవారం సమావేశమయ్యారు.
మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్, ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్, వాణీదేవి, ఇతర నియోజకవర్గాల ఇన్చార్జులు, సీనియర్ నేతలతో ‘సర్’పై సుదీర్ఘంగా చర్చించారు. ఈ కార్యక్రమం హైదరాబాద్లోని ప్రతి నియోజకవర్గానికీ అత్యంత కీలకమని, దీన్ని పార్టీ శ్రేణులు సీరియస్గా తీసుకొని పకడ్బందీ కార్యాచరణతో ముందుకెళ్లాలని చెప్పారు. నగరంలో ఏ ఒక్కరూ తన ఓటు హకు కోల్పోకుండా పార్టీ తరఫున అండగా నిలువాలని, నూతన ఓటర్ల నమోదు ప్రక్రియలో పార్టీ కార్యకర్తలు చొరవ చూపాలని సూచించారు.
హైదరాబాద్ జిల్లా పరిధిలో ఈ ఓటర్ల సవరణ కార్యక్రమ బాధ్యతలు, పర్యవేక్షణను మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్కు అప్పగించారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ ప్రతి ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్చార్జి ఈ అంశాన్ని అత్యంత ప్రాధాన్యతగా తీసుకోవాలని కోరారు. బూత్ స్థాయిలో చురుకైన కార్యకర్తలను వెంటనే ‘బూత్ లెవల్ అసిస్టెంట్స్’ (బీఎల్ఏ) గా గుర్తించి, ఆ జాబితాను ప్రభుత్వ సిబ్బందికి, పార్టీ కేంద్ర కార్యాలయానికి అందజేయాలని చెప్పారు.
త్వరలోనే బూత్ లెవల్ ఏజెంట్లకు నియోజకవర్గ స్థాయిలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని, ఈ ప్రక్రియలో నేతలకు ఎలాంటి మద్దతు అవసరమైనా తాను స్వయంగా అందిస్తామని భరోసా ఇచ్చారు. నగర రాజకీయాల్లో ఓటర్ల జాబితా గెలుపోటములను శాసిస్తుందని, అందుకే ‘సర్’పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని కోరారు.