KTR | హైదరాబాద్, ఫిబ్రవరి 1(నమస్తే తెలంగాణ): జాతీయ పార్టీలు ఎప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడలేవని మరోసారి కేంద్ర బడ్జెట్‌తో రుజువైందని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆ రెండు పార్టీల నుంచి చెరో ఎనిమిది మంది ఎంపీలను పార్లమెంటుకు పంపిస్తే బడ్జెట్లో తెలంగాణకు తెచ్చింది గుండు సున్నా అని ధ్వజమెత్తారు. సీఎం రేవంత్‌రెడ్డి బీజేపీతో చీకటి ఒప్పందాలు చేసుకోవడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తంచేశారు. వరుసగా రెండో ఏడాది తెలంగాణకు చిల్లి గవ్వ కూడా తేలేకపోయిన కేంద్ర మంత్రులు, సీఎం రేవంత్‌రెడ్డితోపాటు కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు తెలంగాణ సమాజానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. స్వీయ రాజకీయ అస్తిత్వమైన బీఆర్ఎస్ మాత్రమే తెలంగాణ హకులను, జాతి ప్రయోజనాలను కాపాడగలుగుతుందని ప్రొఫెసర్ జయశంకర్ చెప్పిన మాట మరోసారి గుర్తుకు వస్తుందని తెలిపారు. లోక్‌సభలో తెలంగాణ ఇంటిపార్టీ అయిన బీఆర్ఎస్కు ప్రాతినిధ్యం లేకుంటే జరిగే నష్టం ఏమిటో ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. పార్లమెంట్లో ప్రాంతీయ పార్టీలకు బలమున్న బీహార్, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ర్టాలకు దకిన ప్రాధాన్యం చూసి జాతీయ పార్టీలను గెలిపిస్తే తెలంగాణను నిండా ముంచారని ప్రజలకు అర్థమైందన్నారు.
ఇద్దరు కేంద్రమంత్రులతో ఏం ప్రయోజనం?
డబుల్ ఇంజిన్ సరార్ అంటూ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడితే తెలంగాణకు నిధులు తేస్తామంటూ రాష్ట్రం నుంచి ఎనిమిది మంది బీజేపీ ఎంపీ గెలిచినా అందులో ఇద్దరు కేంద్ర మంత్రులున్నా తెలంగాణకు నయా పైసా తీసుకురాలేదని కేటీఆర్ విమర్శించారు. ఇతర రాష్ర్టాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎంపీలు తమ రాష్ర్టాలకు నిధుల వరద పారిస్తుంటే తెలంగాణ బీజేపీ ఎంపీలు, మంత్రులు నిస్సహాయ, చేతకాని దద్దమ్మల్లా వ్యవహరిస్తున్నారని నిప్పులు చెరిగారు.
తెలంగాణ ఆశలపై నీళ్లు
గత బడ్జెట్ మాదిరిగానే ఈ సారి కూడా కనీసం తెలంగాణ అనే పదాన్నే కేంద్రం ఉచ్ఛరించలేదని, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలందరి ఆశలపై కేంద్ర సర్కారు మళ్లీ నీళ్లు చల్లిందని కేటీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. వచ్చే ఎన్నికల కోసం బీహార్‌కు బంగారు పల్లెంలో వడ్డించి, తెలంగాణకు అన్యాయం చేసిందని మండిపడ్డారు. తెలంగాణకు ఐఐటీ, ఐఐఎం, ఐసర్, ఎన్ఐడీ, ట్రిపుల్ ఐటీ వంటి ఉన్నత విద్యాసంస్థల్లో ఏదీ ఇవ్వకపోవడం ఇకడి విద్యార్థులకు, యువతకు, వారి తల్లిదండ్రులకు తీవ్ర అన్యాయం చేయటమేనని స్పష్టంచేశారు. దేశ అత్యున్నత చట్టసభలో హామీ ఇచ్చిన విభజన హకులను కూడా కేంద్రం నెరవేర్చకపోవడం అత్యంత దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తంచేశారు. బయ్యారం ఉకు ఫ్యాక్టరీ, ఐటీఐఆర్ పునరుద్ధరణ, సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా వంటి హామీలు ఇన్నేళ్లయినా అమలు చేయని బీజేపీని ఇకపై రాష్ట్ర ప్రజలు నమ్మరని స్పష్టంచేశారు. విశాఖ ఉకు కర్మాగారానికి నిధులు అందిస్తూ తెలంగాణకు మొండిచెయ్యి చూపారని విమర్శించారు. కేంద్ర బడ్జెట్లో ప్రాధాన్యతలు, కేటాయింపులు చూస్తే కేవలం బీజేపీ పాలిత రాష్ర్టాలకే పెద్దపీట వేసి, బడ్జెట్లో ఇతర రాష్ర్టాలకు అన్యాయం చేశారని, ఇది సరైన సంస్కృతి కాదని పేర్కొన్నారు. దేశ ఖజానా నింపే దక్షిణాది రాష్ర్టాలపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం సమాఖ్య స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధమని తెలిపారు.
గులాంగిరీ కోసమే ఢిల్లీకి 30 సార్లు సీఎం
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 30 సార్లు ఢిల్లీకి పోయింది తెలంగాణకు నిధులు తెచ్చేందుకు కాదని, తెలంగాణ నుంచి ఢిల్లీకి మూటలు మోసేందుకేనని కేంద్ర బడ్జెట్‌తో మరోసారి తేలిపోయిందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ సీఎంగా ఉంటూ బీజేపీకి గులాంగిరీ చేస్తున్నారని, బడేభాయ్-చోటే భాయ్ బంధంతో తెలంగాణకు నయాపైసా లాభం లేదని తేలిపోయిందని దెప్పిపొడిచారు. కేవలం ఢిల్లీ బాసులను ప్రసన్నం చేసుకునే పని తప్ప ఏనాడూ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో తెలంగాణ గళం వినిపించిన పాపాన పోలేదని మండిపడ్డారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు రావాల్సిన వాటా గురించి పోరాడిన దాఖలు లేకపోవడం వల్లనే తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని నిప్పులు చెరిగారు.
కేంద్రానికి తెలంగాణ అంటే ఎంత చిన్నచూపో పార్లమెంట్ సాక్షిగా ఈ బడ్జెట్ రుజువుచేసింది. గత బడ్జెట్ మాదిరే ఈసారి కూడా కనీసం తెలంగాణ అనే పదాన్నే ఉచ్ఛరించలేదు. ఈసారైనా కేంద్రం తెలంగాణ వైపు కన్నెత్తి చూస్తుందేమోనని ఎదురుచూసినం. 4 కోట్ల తెలంగాణ ప్రజలందరి ఆశలపై కేంద్ర సర్కారు మళ్లీ నీళ్లు చల్లింది. వచ్చే ఎన్నికల కోసం బీహార్‌కు బంగారు పల్లెంలో వడ్డించి.. తెలంగాణకు మొండిచెయ్యి చూపింది. – కేటీఆర్
కాంగ్రెస్, బీజేపీ నుంచి చెరో 8 మంది ఎంపీలను పార్లమెంటుకు పంపిస్తే ఆ 16 మంది కలిసి కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తెచ్చింది అక్షరాలా గుండు సున్నా.. తెలంగాణ ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాల్సిన రేవంత్‌రెడ్డి, బీజేపీతో చీకటి ఒప్పందాలు చేసుకోవడం వల్లే ఈ దుస్థితి దాపురించింది. -కేటీఆర్