హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ): కర్ణాటక వాల్మీకి స్కామ్ సొమ్మునే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఖర్చు చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. వాల్మీకి స్కామ్‌పై తాము మొదటి నుంచి చెప్తున్నదే ఇప్పుడు నిజమని తేలిందన్నారు. గిరిజనుల బాగు కోసం ఖర్చు చేయాల్సిన సొమ్మును ఎన్నికల ప్రచారం కోసం వాడుకున్న కాంగ్రెస్ పార్టీ నేతలను శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.
వాల్మీకి కుంభకోణంలో కాంగ్రెస్ నేత, కర్ణాటక మాజీ మంత్రి బీ నాగేంద్రనే కీలక సూత్రధారి అని ఈడీ తన చార్జిషీట్లో నిర్ధారించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ఉటంకించారు. కర్ణాటక మహర్షి వాల్మీకి షెడ్యూల్డ్ ట్రైబ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు చెందిన రూ.187 కోట్లు అప్పటి కాంగ్రెస్ మంత్రి చేతులమీదుగా దారిమళ్లాయని పేర్కొన్నారు.
ఆ స్కామ్‌లో ప్రధాన నిందితుడు సత్యనారాయణ వర్మ తెలంగాణకు చెందిన ఇద్దరు కీలక కాంగ్రెస్ నేతలకు అత్యంత సన్నిహితుడని ఆరోపించారు. సత్యనారాయణ వర్మ వ్యాపారంలోనూ కాంగ్రెస్ నేతలు భాగస్వాములుగా ఉన్నట్టు అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు.
ఈ కుంభకోణంలో ఇంకా అనేక మంది కాంగ్రెస్ పార్టీకి చెందిన పెద్దలు ఉన్నారనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదని అన్నారు. ఈ కుంభకోణంపై దర్యాప్తు సంస్థలు లోతుగా విచారించి నిజానిజాలను నిగ్గుతేల్చాలని, దోషులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.
అత్యాచార నిందితులకు మద్దతిచ్చిన వ్యక్తికి సీటా?
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కథువా అత్యాచారం కేసులో నిందితులకు మద్దతుగా నిలిచిన లాల్‌సింగ్ అనే వ్యక్తికి కాంగ్రెస్ అసెంబ్లీ టికెట్ ప్రకటించటం సిగ్గుచేటని కేటీఆర్ మండిపడ్డారు. నారీ న్యాయ్ అంటూ గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ రేపిస్టులను సమర్థించిన వ్యక్తికి సీటు ఎలా కేటాయిస్తుందని ప్రశ్నించారు. కథువా అత్యాచారాన్ని సమర్థించిన వ్యక్తికి సీటు కేటాయించి, అదే ఘటనలో బాధితుల తరఫున పోరాడుతున్నట్టు కాంగ్రెస్ ఎలా చెప్పుకుంటుందని నిలదీశారు.