బీఆర్ఎస్ హయాంలో తీసుకొచ్చిన ధరణి వ్యవస్థ ప్రజల ఆస్తులకు రక్షణ కవచంలాంటి. యజమాని వేలిముద్ర లేకుండా ఆస్తి బదిలీ చేయడం సాధ్యంకాని విధంగా భద్రత ఉండేది. ప్రస్తుతం కాంగ్రెస్ తెచ్చిన భూభారతితో భూయజమానులకుభూయజమానులకు తెలియకుండానే రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఆస్తులు నిషేధిత జాబితాలోకి వెళ్తున్నాయి. ఇది భూభారతి కాదు.. భూహారతి.
-కేటీఆర్
ప్రభుత్వం తీసుకొనే ప్రతి పథకం వెనుక అక్రమాలు జరుగుతున్నాయి. మా ఆరోపణలు భవిష్యత్తులో వెలుగులోకి వస్తాయి. రెండేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. కాంగ్రెస్ పాలనలో జరిగిన అక్రమాలను వెలికితీస్తాం. అన్ని అంశాలపై విచారణ జరిపిస్తాం. తప్పు చేసిన వారిని వదిలిపెట్టం.
-కేటీఆర్
హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): 22ఏ నిషేధిత జాబితా పేరిట జరిగిన అక్రమాలు, అవకతవకలపై న్యాయ విచారణ జరుపాలని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో లక్షలాది ఎకరాలను, ప్రజల ఆస్తులను 22ఏ జాబితాలో చేర్చి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. ఈ జాబితా పేరిట ప్రజల ఆస్తుల దోపిడీకి పాల్పడుతున్నారని, 30 శాతం కమీషన్ల కోసం చేస్తున్న చిల్లర ప్రయత్నాలను కాంగ్రెస్ సర్కార్ వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
ఢిల్లీలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు హాజరైన కేటీఆర్.. అక్కడ మంగళవారం మీడియాతో మాట్లాడారు. 22ఏ అంశంపై అసెంబ్లీలో ప్రభుత్వం సరైన సమాధానం ఇస్తుందని ఆశించామని, రెవెన్యూ మంత్రి కేవలం ‘సారీ’తో సరిపెట్టారని పేర్కొన్నారు. తప్పు చేసింది అధికారులు కాదని, ప్రభుత్వమేనని, ప్రజల సమస్యలను పరిషరించకుండా అధికారులపై నెపం నెడుతున్నదని మండిపడ్డారు. ప్రజలు తమ కష్టార్జితంతో కొనుగోలు చేసిన ఫ్లాట్లు, ఇండ్లను నిషేధిత జాబితా నుంచి బేషరతుగా తొలగించి, బాధితులకు ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
యథాతథ స్థితిని పునరుద్ధరించాలి
భూహక్కులపై అన్ని అడ్డగోలు చర్యలను ప్రభుత్వం నిలిపివేసి, ప్రజల యాజమాన్య హకులకు రక్షణ కల్పించేలా యథాతథ పరిస్థితిని పునరుద్ధరించాలని కేటీఆర్ కోరారు. అసైన్డ్ భూముల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని ఇచ్చిన హామీని ఇప్పుడు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీల అసైన్డ్ భూములను రెగ్యులరైజ్ చేసి, వారికి యాజమాన్య హకులు కల్పించాలని కోరారు. అసైన్డ్ భూములకు పట్టాలిచ్చే పేరుతో ముందుగానే ఒప్పందాలు జరుగుతున్నాయన్న అనుమానాలు వ్యక్తంచేశారు. ప్రభుత్వం తీసుకొనే ప్రతి పథకం వెనుక అక్రమాలు జరుగుతున్నాయని, తమ ఆరోపణలు భవిష్యత్తులో వెలుగులోకి వస్తాయని చెప్పారు. ‘రెండేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. కాంగ్రెస్ పాలనలో జరిగిన అక్రమాలను వెలికితీస్తాం. అన్ని అంశాలపై విచారణ జరిపిస్తాం. తప్పు చేసిన వారిని వదిలిపెట్టం’ అని స్పష్టంచేశారు.
ప్రభుత్వం తప్పు చేస్తే.. శిక్ష ప్రజలకా?
‘22ఏ జాబితా పేరిట తప్పు చేసింది ప్రభుత్వం.. శిక్ష అనుభవిస్తున్నది ప్రజలు’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. నిషేధిత జాబితాలో ఆస్తులను చేర్చడం ద్వారా ప్రజల యాజమాన్య హకులను దెబ్బతీస్తున్నాని ఆరోపించారు. ఇవాళ తప్పించుకున్నా రేపు తప్పించుకోలేరని హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో ప్రధాన ప్రతిపక్షంగా నిరసన తెలిపే హకు తమకున్నదని చెప్పారు. ‘సస్పెండ్ చేసినప్పటికీ మేము ప్రజల్లోనే ఉన్నాం. ప్రజా సమస్యలను ఎత్తిచూపుతూనే ఉంటాం. 22ఏ అంశమైనా, ప్రజల భూముల సమస్యలైనా ప్రజల మధ్యకు తీసుకెళ్తాం’ అని చెప్పారు.
న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం
పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తల కంటే హీనంగా పనిచేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. ‘పోలీసులను నమ్ముకుంటే న్యాయం దొరుకదనే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నాం. న్యాయస్థానంలో తప్పకుండా న్యాయం దొరుకుతుందని ఆశిస్తున్నాం’ అని పేర్కొన్నారు. కామన్ సివిల్ కోడ్‌పై ఇప్పుడే నిర్ణయం చెప్పాల్సిన అవసరం లేదని, అలాంటి ప్రతిపాదన వచ్చినప్పుడు పార్టీ నాయకత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. తమ సిబ్బందిని పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి అకడే కాంగ్రెస్ కార్యకర్తలు దాడిచేసే పరిస్థితిని కల్పించారని ధ్వజమెత్తారు.