‘దేవర’ చిత్రంలోని ‘చుట్టమల్లే’ పాట తాలూకు వీడియోను కృత్రిమ మేధ (ఏఐ) సహాయంతో మార్ఫింగ్ చేసి సోషల్మీడియాలో షేర్ చేసిన సంఘటనపై సినీ ప్రముఖుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నది. ఇప్పటికే ఈ సంఘటనపై స్పందించిన చిత్ర హీరో ఎన్టీఆర్ ఇది అసహ్యకరమైన, సిగ్గుమాలిన చర్య అని మండిపడ్డారు. తాజాగా ఈ విషయంపై మరోమారు ఇన్స్టాగ్రామ్ ద్వారా తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది కథానాయిక జాన్వీకపూర్. సాంకేతికతను నేరపూరితంగా దుర్వినియోగం చేసి మహిళలను అభ్యంతరకరంగా చూపించడం లైంగిక దాడితో సమానమని జాన్వీకపూర్ పేర్కొన్నది. ‘మహిళల తాలూకు వ్యక్తిగత ఇష్టాలు, ఎంపికలను ప్రతీ ఒక్కరూ గౌరవించాలి.
అది వారి ప్రాథమిక హక్కు. ఇప్పుడు డిజిటల్ ప్రపంచంలో కూడా మహిళల భద్రత ప్రశ్నార్థకమవుతున్నది. ఇతరుల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడి వారిని కించపరిచే వ్యక్తిత్వాలను మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పురుషులు కూడా ఈ మార్పులో కీలక పాత్ర పోషించాలి’ అని జాన్వీకపూర్ చెప్పింది. ఈ వ్యవహారంలో తనకు మద్దతుగా నిలిచిన ఎన్టీఆర్, చిరంజీవి, విజయ్ దేవరకొండ, ఖుష్బూ సుందర్ వంటి సినీ ప్రముఖులకు జాన్వీకపూర్ కృతజ్ఞతలు తెలిపింది.