హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): స్థానికత విషయంలో తీసుకొచ్చిన కొత్త నిబంధన వల్ల మెడికల్ సీట్లలో తెలంగాణ విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. తక్షణమే ఈ నిబంధనను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్థానికత విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీరు అనేక అనుమానాలకు తావిస్తున్నదని పేర్కొన్నారు. జీవో-33 ప్రకారం నిర్దేశించిన స్థానికతలో ని అంశాలు ప్రభుత్వం వేలితో విద్యార్థుల కండ్లను పొడిచినట్టే ఉన్నాయని మండిపడ్డారు. 9 నుంచి 12వ తరగతి వరకు తెలంగాణలో చదివిన విద్యార్థులే స్థానికులు అవుతారని ప్రభు త్వం చెప్తున్నదని, దీంతో చాలామంది ఇతర రాష్ట్రాల విద్యార్థులు తెలంగాణలో లోకల్ అవుతారని ఆందోళన వ్యక్తంచేశారు.
హైదరాబాద్‌లో ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలు ఉన్నందున ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు చాలామంది ఇకడే విద్యాభ్యాసం చేస్తున్నారని, కొత్త నిబంధనల ప్రకారం వారంతా తెలంగాణలో లోకల్ అవుతారని, అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో చదివే తెలంగాణ విద్యార్థులు నాన్‌లోకల్ అయ్యే ప్రమాదం ఉన్నదని హెచ్చరించారు. 2023-24 వరకు 6 నుంచి 12 తరగతి వరకు నాలుగేండ్లు గరిష్ఠంగా ఎకడ చదివితే అదే స్థానికతగా గుర్తించిన విషయాన్ని కేటీఆర్ ఉదహరించారు. దాంతో మన విద్యార్థులు ఇంటర్మీడియెట్ కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లినా వారు లోకల్‌గానే పరిగణించబడేవారని వివరించా రు. వేలాది మంది ఇతర రాష్ట్రాల విద్యార్థులు తెలంగాణలో లోకల్ అవుతారని, మన విద్యార్థులు మెడిసిన్ సీట్లు కోల్పో యే ప్రమాదం ఉన్నదని హెచ్చరించారు.