హైదరాబాద్: గ్రూప్-1 పరీక్ష నిర్వహణలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని యువత ఎన్నటికీ క్షమించదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. కాంగ్రెస్ సర్కార్ అసమర్ధత, కాసుల కక్కుర్తి కలగలిసి అనేక అవకతవకలకు కారణమయిందని చెప్పారు. హైకోర్టు ఆదేశించినట్లు పరీక్షను మళ్లీ నిర్వహించాలని, అవకతవకలపై జ్యుడీషియల్ కమిషన్ వేసి ఉద్యోగాల దొంగలెవరో తేల్చాలని ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు.
‘సర్కారు కొలువుకోసం ఏళ్ల తరబడి కష్టపడి తమ విలువైన సమయాన్నీ, అమ్మా, నాన్నల కష్టార్జితాన్నీ ధారపోసిపోటీ పరీక్షలు రాసే తెలంగాణ యువత నమ్మకాన్ని వమ్ముజేసింది ఈ కాంగ్రెస్ సర్కార్. అసమర్ధత, కాసుల కక్కుర్తి కలగలిసి అనేక అవకతవకలకు కారణమయ్యింది. అంగట్లో కొలువులు అమ్ముకొని నిరుద్యోగుల గొంతుకోసింది.
గ్రూప్ 1 పరీక్ష నిర్వహణలో ఫెయిల్ అయిన ఈ ప్రభుత్వాన్ని యువత ఎన్నటికీ క్షమించదు. హైకోర్టు ఆదేశించినట్టు గ్రూప్-1 పరీక్ష మళ్లీ తాజాగా నిర్వహించాలి. అవకతవకలపై జుడీషియల్ కమిషన్ వేసి ఉద్యోగాల దొంగలెవరో తేల్చాలి. ఏడాదిలోపే రెండు లక్షల ఉద్యోగాలిస్తామని కాంగ్రెస్ చేసిన మోసపూరిత వాగ్ధానంపై ప్రత్యేక అసెంబ్లీ సెషన్ ఏర్పాటు చేసి చర్చించాలని డిమాండ్ చేస్తున్నాను.’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.