ప్రజాస్వామ్యానికి నాలుగు స్తంభాల్లో ఒకటైన న్యాయ వ్యవస్థ దేశంలో జరుగుతున్న పరిణామాలన్నింటినీ గమనిస్తూనే ఉన్నది. సరైన సమయంలో, సరైన పద్ధతుల్లో స్పందిస్తుంది. సుప్రీంకోర్టులో జస్టిస్ గవాయి ధర్మాసనం నిన్న చేసిన వ్యాఖ్యలు విన్న తర్వాత ఈ దేశంలో సగటు పౌరుడికి న్యాయవ్యవస్థ మీద మరింత గౌరవం పెరిగింది.
హైదరాబాద్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ) : పర్యావరణ పరిరక్షణ పట్ల కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కారుకు చిత్తశుద్ధి ఉంటే తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు భూ కుంభకోణంపై వెంటనే సుప్రీంకోర్టు జడ్జి నేతృత్వంలో విచారణకు ఆదేశించాలని, లేదా ఆర్బీఐ, సీవీసీ, సీబీఐ, కేంద్ర సంస్థల ద్వారా విచారణ జరిపించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ‘మోదీ సంవత్సరానికి ఒకసారి మాట్లాడుతరు. తెలంగాణలో రాహుల్, రేవంత్ (ఆర్ఆర్) ట్యాక్స్ వసూలు చేస్తూ విచ్చలవిడిగా దోపిడీ చేస్తున్నరని సరిగ్గా ఏడాది కిందట.. 2024 ఏప్రిల్‌లో మోదీ ఆరోపించిండ్రు. హైదరాబాదులో బిల్డింగ్ కట్టాలంటే స్వేర్ ఫీట్‌కి 100-150 రూపాయల హఫ్తా వసూలు టైపు అరాచకత్వం చెలరేగుతున్నదన్నారు. ఆర్ఆర్ ట్యాక్స్ అన్న మోదీ మాటలకు వార్షికోత్సవం కూడా అయిపోయింది. ఆ తర్వాత ఎలాంటి విచారణ లేదు. మళ్లీ సంవత్సరానికి మేలొన్న మోదీ నిన్న మాట్లాడిండు.
హెచ్‌సీయూ భూముల్లో అర్ధరాత్రి బుల్డోజర్లను పంపి కాంగ్రెస్ ప్రభుత్వం ఆగమాగం చేస్తున్నదని హరియాణాలో ప్రవచనాలు చెప్పిండు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అక్రమాలు, అరాచకాలను నిజంగానే ఆపాలని మోదీ అనుకుంటే కేంద్ర సాధికార కమిటీ నివేదిక ఆధారంగా భారత ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు? ఎందుకు విచారణకు ఆదేశించడం లేదు?’ అని నిలదీశారు. ‘లిప్ సింపతీ కాదు మోదీజీ.. చిత్తశుద్ధి ఉంటే హెచ్‌సీయూ భూ కుంభకోణంపై విచారణకు ఆదేశించండి’ అని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ తరఫున అన్ని దర్యాప్తు సంస్థలకు ఉత్తరాలు కూడా రాశామని, బీజేపీ ప్రభుత్వం ఈ విషయంలో స్పందించకపోతే అది మాటల ప్రభుత్వమే కానీ చేతల ప్రభుత్వం కాదని భావించాల్సి వస్తుందని చెప్పారు. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టు తాజా ఆదేశాల నేపథ్యంలో హైదరాబాద్‌లోని తెలంగాణభవన్‌లో గురువారం ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు మహమూద్ అలీ, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, అనిల్ జాదవ్, మాజీ ఎంపీ మాలోతు కవిత, మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, మెతుకు ఆనంద్‌తో కలిసి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
హెచ్‌సీయూ విద్యార్థులకు ఏదైనా ఆపద ఎదురైతే వెంటనే వస్తానన్న కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ పత్తా లేకుండా పోయాడని కేటీఆర్ విమర్శించారు. రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకున్నప్పుడు హెచ్సీయూకు వచ్చిన రాహుల్‌గాంధీ ఇకడి విద్యార్థులకు ఏ సమస్య వచ్చినా తాను అండగా నిలబడతానని చెప్పారని గుర్తుచేశారు. ఢిల్లీకి రేవంత్‌రెడ్డి పంపుతున్న నోట్ల కట్టాలతోనే రాహుల్‌గాంధీ నోరు మెదపడం లేదని మండిపడ్డారు.
దేశంలో ఫిరాయింపుల సంస్కృతిని తెచ్చిందే ఇందిరాగాంధీ.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే ఆలోచన గాని, ఆ ఎజెండా గాని మాకు ఎంత మాత్రం లేవు. రేవంత్‌రెడ్డి చేస్తున్న పిచ్చి పనులతో ప్రజల్లోనే తిరుగుబాటు వస్తది. రేవంత్ ప్రైవేట్ సైన్యంలా, రేవంత్ ముఠాలా పనిచేస్తున్న కొంతమంది పోలీసు అధికారులు ఊచలు లెక్కించాల్సి వస్తది.
‘హెచ్‌సీయూ వ్యవహారంలో మూటలు అందుతున్నయి కాబట్టి రాహుల్ మాట్లాడటం లేదు.. మరి బీజేపీకి ఏం అడ్డం వస్తున్నది? మోదీ ఎందుకు మాట్లాడటం లేదు?.. బీజేపీ స్టూడెంట్ యూనియన్ ఏబీవీపీతోపాటు బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఆందోళన చేసినా రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని కాపాడేందుకు మోదీ ఎందుకు ఆరాటపడుతున్నారు?’ అని కేటీఆర్ ప్రశ్నించారు. ‘ఏఐ జనరేటెడ్ వీడియోలంటూ ప్రభుత్వం మూర్ఖపు వాదన చేసింది. కానీ, నిన్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి గవాయి.. అవి ఏఐ వీడియోలు కాదు, జంతువుల అర్తనాదాలను మేం విన్నామని స్పష్టం చేశారు. రీట్వీట్లు చేసినా రాష్ట్ర ప్రభుత్వం కేసులు పెట్టింది. కుకల దాడిలో జింకలు చచ్చిపోయిన విజువల్స్ చూసి కూడా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు అకడ వన్యప్రాణులు లేవు.. గుంటనకలే ఉన్నయని చెప్పడం వాళ్ల మూర్ఖత్వానికి నిదర్శనం’ అని కేటీఆర్ మండిపడ్డారు.
ఆర్థిక దోపిడీ, పర్యావరణ విధ్వంసంపై ప్రధానమంత్రి స్పందించాలని, లేకుంటే ఈ పాపంలో మోదీకి కూడా వాటా ఉన్నదని అనుకోవాల్సి ఉంటుందని కేటీఆర్ పేర్కొన్నారు. ‘కేంద్ర ప్రభుత్వ స్పందన కోసం కొద్ది రోజులు ఓపికగా ఎదురు చూస్తం. ఏప్రిల్ 27 తర్వాత కేంద్ర ప్రభుత్వ సంస్థల దగ్గరికి మా పార్టీ ప్రతినిధులం వెళ్తం. హెచ్‌సీయూ వ్యవహారంలో ఆధారాలను అందిస్తం. అప్పుడు కూడా స్పందించకపోతే ప్రజాక్షేత్రంలో బీజేపీని ఎండగడుతం. రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని కాపాడుతున్నది బీజేపీయేనని ప్రజలకు చెప్తం’ అని కేటీఆర్ పేర్కొన్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి లాంటివాళ్లు తప్ప చెరువును ఎవరూ తాకట్టు పెట్టరని, చివరికి రేవంత్ సర్కారు జల వనరును కూడా తాకట్టు పెట్టిందని కేటీఆర్ మండిపడ్డారు. హెచ్‌సీయూలో వేలాది చెట్లను నరికేశారని, అకడి జంతువులకు నిలువ నీడ లేకుండా చేశారని, ఆ భూముల్లో బడా ఆర్థిక మోసం జరిగిందని కేంద్ర సాధికార కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్ర ప్రభుత్వం, టీజీఐఐసీ ఉద్దేశాల మీద తమకు తీవ్ర అనుమానాలు ఉన్నాయని సీఈసీ తన నివేదికలో స్పష్టంచేసిందని పేర్కొన్నారు. ‘1974, 1981, 2006 పర్యావరణ చట్టాలను తుంగలో తొకుతూ టీజీఐఐసీ ఉద్దేశపూర్వకంగానే అకడి చెట్లను నరికి వేసింది. ఎన్నో డాక్యుమెంట్లను పరిశీలించిన తర్వాత ఆ 400 ఎకరాల భూమి సెంట్రల్ యూనివర్సిటీకి చెందినదే అని సీఈసీ తేల్చింది. ఆ భూమికి హెచ్‌సీయూ లీగల్ ఓనర్ అని నివేదికలో పొందుపరిచింది. ప్రభుత్వ దుందుడుకు చర్యలతో రాష్ట్ర సంపద, ప్రజల డబ్బులు ప్రమాదంలో పడ్డాయని కమిటీ హెచ్చరించింది. ఆ భూముల్లో ఉన్న చెరువులను కూడా ప్రభుత్వం తాకట్టు పెట్టింది. చెరువును కూడా తాకట్టు పెట్టే ప్రభుత్వం ప్రపంచంలో ఒక రేవంత్‌రెడ్డిదే’ అని విమర్శించారు.
హెచ్‌సీయూ భూముల తనఖా విషయంలో బడా ఆర్థిక మోసం జరిగిందని సుప్రీంకోర్టు నియమించిన సాధికార కమిటీ కూడా నివేదిక ఇచ్చిందని కేటీఆర్ చెప్పారు. ఈ సందర్భంగా సీఈసీ ఇచ్చిన నివేదికలోని కొన్ని కీలక అంశాలను కేటీఆర్ ప్రస్తావించారు. ప్రతిపక్ష పార్టీగా తాము చేసిన ఆరోపణలకు బలం చేకూరేలా సీఈసీ సుప్రీంకోర్టుకు చాలా స్పష్టంగా నివేదిక ఇచ్చిందని చెప్పారు. ఆ 400 ఎకరాలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన స్థలమే అని సాధికార కమిటీ తేల్చి చెప్పిందని పేర్కొన్నారు. భూయాజమాన్య హకులు తేలేదాకా తనఖా, లీజుతోపాటు అకడ కట్టడాలు నిర్మించడాన్ని తక్షణమే ఆపేలా సుప్రీంకోర్టు చొరవ తీసుకోవాలని సీఈసీ స్పష్టంచేసిందని చెప్పారు. ఇకడ జరిగిన ఆర్థికపరమైన అవకతవకలు, ఉద్దేశపూర్వకమైన అరాచకత్వాన్ని దృష్టిలో పెట్టుకొని స్వతంత్ర సంస్థతో సమగ్ర విచారణకు ఆదేశించాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించిందని తెలిపారు. ‘ఆర్బీఐ, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్, సీబీఐ, సీవీసీ జోక్యం చేసుకోవాలని కొన్ని రోజుల క్రితం నేను విజ్ఞప్తి చేశాను. మా వాదన నిజమే అని సెంట్రల్ ఎంపవర్ కమిటీ నివేదికతో స్పష్టమైంది’ అని కేటీఆర్ వివరించారు.
హెచ్‌సీయూ భూముల్లో అర్ధరాత్రి బుల్డోజర్లను పంపి కాంగ్రెస్ ప్రభుత్వం ఆగమాగం చేసిందని ప్రవచనాలు చెప్పిన ప్రధాని మోదీ.. రాజ్యాంగాన్ని, చట్టాలను అపహాస్యం చేస్తున్న రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని కాపాడేందుకు ఎందుకు ఆరాటపడుతున్నరు? సానుభూతి కాదు మోదీజీ.. చిత్తశుద్ధి ఉంటే సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో లేదా కేంద్ర సంస్థలతో రేవంత్ ప్రభుత్వ అక్రమాలపై విచారణ జరిపించాలె.
-కేటీఆర్
కాంగ్రెస్, బీజేపీ దొందూదొందేనని కేటీఆర్ ఎద్దేవా చేశారు. సోనియా, రాహుల్‌పై నమోదైన ఈడీ కేసుపై మీడియా ప్రశ్నించగా కేటీఆర్ సమాధానమిచ్చారు. ‘కాంగ్రెస్ హయాంలో సీబీఐ కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనేవారు. ఈడీని తీసుకొచ్చింది నాటి కాంగ్రెస్ ప్రభుత్వం. ఆనాడు సీబీఐని కాంగ్రెస్ దుర్వినియోగం చేస్తే ఈనాడు ఈడీని బీజేపీ విచ్చలవిడిగా వాడుతున్నది. ఈ రెండు ఢిల్లీ పార్టీలు వాళ్ల రాజకీయ ప్రయోజనాల కోసం ఎలాంటి అరాచకాలకైనా పాల్పడతాయి. తన రాజకీయ ప్రత్యర్ధులపై ఈడీ కేసులు పెడితే కాంగ్రెస్ స్వాగతిస్తుంది. తనదాకా వస్తే మాత్రం ఈడీ మీద ఆరోపణలు చేస్తుంది. ఇదేం రాజకీయం?’ అని కేటీఆర్ నిలదీశారు.
‘తెలంగాణ పోలీసులు రేవంత్ ప్రైవేట్ సైన్యంలా వ్యవహరిస్తూ ఎక్స్‌ట్రాలు చేస్తే న్యాయవ్యవస్థ ద్వారా ఎదురొంటం. దర్శనం వెంకటయ్య అనే ఒక దళిత వృద్ధ రైతును కూడా జైల్లో పెట్టించిన పిరికోడు రేవంత్‌రెడ్డి. సోషల్ మీడియా కంటే ఎకువగా క్షేత్రస్థాయిలోనే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నది. ప్రజలు విమర్శిస్తే ఫీడ్ బ్యాక్ లాగా తీసుకోవాలి. అదే ప్రజాస్వామిక స్ఫూర్తి’ అని కేటీఆర్ సూచించారు.
దేశంలో ఫిరాయింపుల సంస్కృతిని తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని కేటీఆర్ విమర్శించారు. ‘ఈ దేశంలో ఆయారామ్ గయారాం ఫిరాయింపుల సంస్కృతిని తెచ్చింది హర్యానాలో నాటి ఇందిరాగాంధీ. 2004లో కాంగ్రెస్‌తో కలిసి మేం పోటీ చేసినం. 26 మంది ఎమ్మెల్యేలు మా పార్టీ తరఫున గెలిస్తే అందులో 10 మందిని కాంగ్రెస్ పార్టీ గుంజుకున్నది. తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల సంస్కృతికి బీజం వేసింది కాంగ్రెస్. మొన్నటికి మొన్న మా ఎమ్మెల్యేలను కూడా కాంగ్రెస్ గుంజుకున్నది’ అని మండిపడ్డారు.
‘ఈ దికుమాలిన ప్రభుత్వాన్ని కూలగొట్టే కర్మ మాకు లేదు. ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టే ఆలోచన, ఎజెండా మాకు లేవు. ప్రజలకు కోపం వస్తే బంగ్లాదేశ్‌లో లాగా వాళ్లే రోడ్డెకి ప్రభుత్వాన్ని తొకుతారు. పెద్ద పెద్ద నియంతలే కొట్టుకుపోయారు.. రేవంత్‌రెడ్డి ఎంత? దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి చెప్పింది అక్షర సత్యం. ప్రజలు మా దగ్గరకు కూడా వచ్చి ప్రభుత్వాన్ని కూల్చేయాలని చెప్తున్నరు. కానీ ఈ ఐదేండ్లు రేవంత్‌రెడ్డే అధికారంలో ఉండాలి. అప్పుడే ఇంకో 20 ఏండ్లు కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యాలంటే భయపడుతరు. ఇంతకంటే పెద్ద పెద్ద నియంతలనే ప్రజలు మట్టిలో కలిపారు’ అని కేటీఆర్ పేర్కొన్నారు.
‘అధికారం ఉన్నదన్న అహంకారంతో ఎవరైనా విర్రవీగుతూ నియంతలం, చక్రవర్తులం, రారాజులం అని ఏ రాజకీయ నాయకుడైనా భావిస్తే ప్రజాస్వామ్యంలో వారికి గుణపాఠం తప్పదు.. బుధవారంనాటి సుప్రీంకోర్టు తీర్పు ఒక చెంపపెట్టు’ అని కేటీఆర్ స్పష్టంచేశారు. సుప్రీంకోర్టులో జస్టిస్ గవాయి ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు విన్న తర్వాత ఈ దేశంలో సగటు పౌరుడికి న్యాయ వ్యవస్థపై మరింత గౌరవం పెరిగిందని చెప్పారు. ‘హెచ్‌సీయూలోని 100 ఎకరాలను ఎప్పుడు పునరుద్ధరిస్తారు? ఎట్లా పునరుద్ధరిస్తారో స్పష్టమైన రోడ్డు మ్యాప్‌తో రాకుంటే అదే స్థలంలో తాతాలిక జైలు ఏర్పాటు చేసి అధికారులను జైలుకు పంపుతామని సుప్రీంకోర్టు చెప్పడం ఇంతకుముందెన్నడూ జరగలేదు. ఆత్మాభిమానం, పౌరుషం ఉన్న ముఖ్యమంత్రి అయితే ఈపాటికి రాజీనామా చేసేవాడు. కానీ అకడ ఉన్నది రేవంత్‌రెడ్డి. ఆయనకు ఆత్మాభిమానం, పౌరుషం ఏమీలేవు. ఎన్ని విమర్శలు వచ్చినా అన్నింటినీ దులుపుకొని పోతున్నాడు’ అని ఎద్దేవాచేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలు హెచ్‌సీయూ విద్యార్థులు, ప్రొఫెసర్ల విజయమని, పర్యావరణ ప్రేమికుల విజయంమని అభివర్ణించారు. ‘రేవంత్‌రెడ్డి సరార్ చేసిన పర్యావరణ విధ్వంసం మీద వివిధ దేశాల్లో ఉండి స్పందించిన ప్రతి ఒకరికీ, వారికి మద్దతుగా నిలబడ్డ వారందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు.. సుప్రీంకోర్టుకు బీఆర్ఎస్ తరఫున ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు. క్షేత్రస్థాయిలో పర్యటించి అందర్నీ కలిసి వాస్తవాలను సుప్రీంకోర్టుకు నివేదించిన సీఈసీకి మా ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు.
మూటల వేట కోసం రేవంత్‌రెడ్డి చేస్తున్న అక్రమాల్లో అధికారులు బలి పశువులు అవుతున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. ఇవాళ ఐఏఎస్, ఫారెస్ట్ అధికారులు సుప్రీంకోర్టు ఆగ్రహానికి గురయ్యారని తెలిపారు. ‘తెలంగాణ పోలీసుల్లో కొంతమంది రేవంత్‌రెడ్డి ప్రైవేట్ సైన్యం లాగా పనిచేస్తున్నారు. ఆ కొంతమందికి కూడా ఇదే హెచ్చరిక. మిమ్మల్ని కూడా వదిలిపెట్టం. మీ మీద కూడా సుప్రీంకోర్టుకు వెళ్తం. ఇష్టానుసారం అడ్డమైన కేసులు పెడుతున్న పోలీసు అధికారులను వదిలిపెట్టేది లేదు. ఉన్నతాధికారులు కొందరు కూడా రేవంత్ ముఠాలాగా, ఆయన ప్రైవేటు సైన్యంలా పనిచేస్తున్నారు. వారికి ఇదే మా హెచ్చరిక. తస్మాత్ జాగ్రత్త. మూటల వేట, పైసల వేట రేవంత్‌రెడ్డిది. బలి పశువులు అవుతున్నది అధికారులు. రేవంత్ ఉచ్చులోపడి చట్టాన్ని అతిక్రమిస్తే ఊచలు లెక్కపెట్టాల్సి వస్తుంది’ అని హెచ్చరించారు. ‘ఫార్ములా ఈ రేసు విషయంలో నా మీద అడ్డమైన కేసులు పెడితే నేను అధికారులను బలి పశువులుగా చేయలేదు. విధానపరమైన నిర్ణయం నేనే తీసుకున్న, ఎలాంటి బాధ్యత అయినా నేనే తీసుకుంటా అని చెప్పిన. రాజకీయం అంటే ఇలా చేయాలి. మంచి జరిగితే నాది. చెడు జరిగితే అధికారులదే బాధ్యత అని బలి పశువులు చేయకూడదు’ అని హితవుపలికారు.
తనది కాని భూమిని టీజీఐఐసీ తాకట్టుపెట్టి రూ.10 వేల కోట్లు అప్పు తీసుకోవడం తప్పు కాదా? అని కేటీఆర్ ప్రశ్నించారు. ‘యాజమాన్య హకులు లేకుండా ఆర్థిక సంస్థలను, బ్యాంకులను మోసం చేయడం నేరం కాదా? ఆర్థిక సంస్థలను మోసం చేసిన ముఖ్యమంత్రిని, టీజీఐఐసీని విచారించకపోతే మోదీది తప్పు కాదా? సీఈసీ నివేదిక ఇంత స్పష్టంగా ఉన్న తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే ఇందులో కూడా వారికి వాటా ఉన్నదని అనుకోవడం తప్పవుతుందా? హడావుడిగా కుట్రపూరితంగా లోను తీసుకోవడానికి ఒక బ్రోకర్ సంస్థకు రూ.170 కోట్లు చెల్లించడం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం కాదా? మారెట్ రేటు కంటే మూడు శాతం ఎకువగా 9.5 శాతం వడ్డీ రేటుకు లోన్ తీసుకొచ్చి బ్రోకర్ సంస్థకు అనుచిత ఆర్థిక లబ్ధి చేకూర్చడంపై విచారణ జరపాల్సిన అవసరం లేదా? ఇందులో మోదీ ప్రభుత్వానికి బాధ్యత లేదా? అన్ని రకాల నిబంధనలను తుంగలో తొకి పర్యావరణ హననానికి పాల్పడి భారీ అవినీతికి పాల్పడిన రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రిపై వెంటనే కేంద్ర సంస్థలు విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నం. కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ నెలాఖరు వరకు స్పందించి సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో లేదంటే కేంద్ర సంస్థలతో విచారణ జరపాలి’ అని కేటీఆర్ డిమాండ్ చేశారు.