హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ): మంత్రి పొంగులేటి, సీఎం రేవంత్‌రెడ్డిది వాటాల బంధమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కొడంగల్-నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాంట్రాక్ట్‌ను మంత్రి కంపెనీకి అప్పగించారని, రాష్ట్రంలో యథేచ్ఛగా సాగుతున్న భూదందాలు చూస్తే వారు, వారి అనుచరుల వాటాల విషయం తెలిసిపోతుందని చెప్పారు. అక్రమ మైనింగ్‌కు పాల్పడి ప్రజాధనాన్ని లూటీ చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. సర్కార్ స్పందించకుంటే గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామని స్పష్టంచేశారు. అవసరమైతే ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి ప్రభుత్వ అక్రమాలను ఎండగడుతామని హెచ్చరించారు. ఆదివారం అసెంబ్లీ ఎదుట గన్‌పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి నిరసన తెలిపారు.
‘మైనింగ్ మాఫియాకు ప్రభుత్వ వత్తాసు సిగ్గు సిగ్గు..రేవంతూ! పొంగులేటి దోపిడీలో ఎంతున్నది నీ వంతు?’ అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడారు. బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు రాఘవ కన్స్ట్రక్షన్స్ అక్రమ మైనింగ్‌ను ఆధారాలతో అసెంబ్లీ సాక్షిగా బట్టబయలు చేయడం వల్ల ప్రభుత్వం కలవరపడ్డదని చెప్పారు. ప్రభుత్వమే ఇచ్చిన డాక్యుమెంట్ల ఆధారంగా పొంగులేటి అవినీతి వ్యవహారాన్ని బహిర్గతం చేశారని గుర్తుచేశారు. నిబంధనలు ఉల్లంఘించిన ఇతర కంపెనీలపై చర్యలు తీసుకున్న ప్రభుత్వం ‘రాఘవ’ను ఎందుకు వదిలిపెట్టిందని ప్రశ్నించారు. మంత్రి కంపెనీ కావడం..ముఖ్యమంత్రి పాత్ర ఉండటం వల్లే అధికారులు ఉపేక్షించారని అనుమానం వ్యక్తంచేశారు.
ముఖ్యమంత్రే ఒప్పుకొన్నరు
రాఘవ కంపెనీ అక్రమాలను హరీశ్‌రావు బయటపెట్టడంతో ఉలిక్కిపడ్డ ముఖ్యమంత్రి నిండు సభలో అంగీకరించారని కేటీఆర్ గుర్తుచేశారు. కానీ సర్కారే బయటపెట్టిందని బీఆర్ఎస్పై దాడిచేసిన తీరు చూసి తెలంగాణ ప్రజలు ఏవగించుకున్నారని స్పష్టంచేశారు. పవిత్రమైన అసెంబ్లీలో రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీ మంత్రి పొంగులేటి దూరపు బంధువుదని చెప్పడం హాస్యాస్పదంగా ఉన్నదని చెప్పారు. మంత్రి భార్య, కొడుకు, తమ్ముడు, మరదలు కంపెనీ డైరెక్టర్లుగా ఉన్నారని, 2020 నుంచి 2022 వరకు ఆయనే చైర్మన్‌గా వ్యవహరించారని గుర్తుచేశారు. కానీ సీఎం మాత్రం వెనకేసుకు రావడం సిగ్గుచేటని మండిపడ్డారు. తెలంగాణ మాత్రమే సముద్రతీరంలేని రాష్ట్రమని చెప్పి రేవంత్‌రెడ్డి తన అవగాహనారాహిత్యాన్ని బయటపెట్టుకున్నారని దెప్పిపొడిచారు. రేవంత్‌రెడ్డి మాటలు చూసిన తర్వాత రాఘవ కన్స్ట్రక్షన్స్ అక్రమ పర్వంలో ఆయన కూడా ఉన్నట్టు స్పష్టమవుతున్నదని తెలిపారు.
తప్పు చేయకుంటే భయమెందుకు?
వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్, రెండున్నరేండ్లుగా కేసులు, కమిటీలు, కమీషన్ల పేరిట కాలయాపన చేస్తున్నదని కేటీఆర్ ధ్వజమెత్తారు. ‘రాఘవ కన్స్ట్రక్షన్స్ వ్యవహారంలో తప్పు చేయకుంటే మంత్రి కుటుంబసభ్యులపై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదు? నిబంధనలు లేకుండా పట్టుబడి రెండోసారి నోటీసు ఇస్తే ఏడాది జైలు, రూ.25 వేల జరిమానా విధించాల్సి ఉంటుంది.. కానీ సర్కార్ విస్మరించడంలోని మతలబేమిటి?’ అని ప్రశ్నించారు. మైనింగ్ శాఖ మంత్రి రాఘవ కంపెనీ అక్రమాలను కేవలం రూ.4 లక్షల అవినీతి వ్యవహారంగా చూడటం సిగ్గుచేటని నిప్పులు చెరిగారు. అధికారుల దాడిలో ఒకే రోజు రాఘవ కంపెనీకి సంబంధించిన రూ. 32 లక్షల అక్రమ సొమ్ము బయటపడిందని, ఈ పరిస్థితుల్లో రెండున్నరేండ్లలో ఎంతమేర దోపిడీకి పాల్పడ్డారో తెలిసిపోతుందని స్పష్టంచేశారు.
సీఎం బంధువులదే ‘భాగ్యలక్ష్మి’..
హైదరాబాద్ శివారు కోకాపేటలోని భాగ్యలక్ష్మీ మైనింగ్ కంపెనీ సీఎం రేవంత్‌రెడ్డి బంధువులదేనని కేటీఆర్ ఆరోపించారు. మైనింగ్ పేరిట రాష్ట్రంలో యథేచ్ఛగా అవినీతికి తెరలేపారని దుయ్యబట్టారు. ప్రభుత్వం మైనింగ్ రెవెన్యూ పెరిగిందని చెప్పుకొంటున్నదని, కానీ వాస్తవంగా రావాల్సిన రూ.1,800 కోట్లల్లో రూ.900 కోట్లే వస్తున్నాయని, మిగిలిన ఆదాయం ఎవరి జేబుల్లోకి వెళ్తుందో సీఎం సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. అక్రమ మైనింగ్ వ్యవహారంపై సభా సంఘం ఏర్పాటు చేసి మంత్రి పొంగులేటి, సీఎం రేవంత్, వారి అనుచరుల పాత్రను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. గతంలో ఓబులాపురం మైనింగ్ కేసులో అప్పటి కాంగ్రెస్ సర్కార్ హౌస్ కమిటీ వేసి ఆరోపణలు చేసిన సభ్యుడినే అధ్యక్షుడిగా నియమించిన విషయాన్ని ప్రస్తావించారు. ఇప్పుడు కూడా రేవంత్‌రెడ్డి అదే తరహాలో పారదర్శకంగా విచారణ జరిపించాలని సూచించారు. ఈ కుంభకోణాన్ని అడ్డుకొని విచారణ కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిన బీజేపీ సభ్యులు ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. గతంలో కాంగ్రెస్ స్కామ్‌లపై ఆధారాలతో ఫిర్యాదు చేసినా కేంద్రం పట్టించుకోలేదని మండిపడ్డారు. అక్రమ మైనింగ్ చేస్తూ అడ్డంగా దొరికిపోయిన మంత్రి, ఆయన కుటుంబసభ్యులను వదిలిపెట్టే ప్రసక్తిలేదని హెచ్చరించారు. ప్రజాక్షేత్రంలో వారి భూదందాలు, కబ్జాలను బయటపెడుతామని, న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని స్పష్టంచేశారు.
మెట్రో భూముల స్వాధీనానికి కుట్ర
హైదరాబాద్ మెట్రోపై కూడా ముఖ్యమంత్రి పచ్చి అబద్ధాలు చెప్పారని కేటీఆర్ విమర్శించారు. రూ. 22 వేల కోట్ల ఆస్తిని రూ.15 వేల కోట్లకు కొనుగోలు చేశామని చెప్పి ప్రజలను పక్కదోవపట్టించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. మెట్రోకు ఇచ్చిన 280 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనని, అది కేవలం లీజుకు మాత్రమే ఇచ్చిన విషయాన్ని వివరించారు. సదరు భూమిలో ఎల్అండ్టీ కంపెనీ నిర్మాణాలు పూర్తిచేసిన తర్వాత ప్రభుత్వానికి తిరిగి అప్పగించాలనే ఒప్పందం ఉన్నదని గుర్తుచేశారు. ప్రైవేట్ సంస్థ అప్పును రాష్ట్ర ప్రజలపై మోపడం సిగ్గుచేటని విరుచుకుపడ్డారు. ఎల్‌అండ్‌టీపై ఒత్తిడి తెచ్చి ఆస్తులు స్వాధీనం చేసుకొనే కుట్రలకు రేవంత్ సర్కార్ తెరలేపిందని విమర్శించారు .హైదరాబాద్ మెట్రో విస్తరణకు కేంద్రం అభ్యంతరం చెప్పలేదని, ప్రాజెక్టు ప్రారంభించినప్పుడు ఎలాంటి సమస్యలు రాలేదని చెప్పారు. ఇప్పుడు మాత్రం సాకులు చూపడం సరికాదని హితవుపలికారు. ఈ వ్యవహారం చూస్తుంటే ఒక పెద్ద భూ దందాకు స్కెచ్ వేశారని, 280 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకోవడమే అసలు లక్ష్యమని ఆరోపించారు. ఇందులో ప్రజాప్రయోజనాలు లేవని స్పష్టంచేశారు. ఈ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.