హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): గిగ్ వర్కర్లకు వెల్ఫేర్‌బోర్డు ఏర్పాటుచేస్తామని, బీమాతో కూడిన సామాజిక భద్రత కల్పిస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన కాంగ్రెస్.. గద్దెనెక్కిన తరువాత వారికి తీరని ద్రోహం చేస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అభయహస్తం మ్యానిఫెస్టో, డిక్లరేషన్‌లో అలవికాని హామీలిచ్చి అమల్లో నిర్లక్ష్యం చేస్తూ నిండా ముంచుతున్నదని ధ్వజమెత్తారు.
తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫారమ్ వర్కర్స్ యూనియన్ నేతలు బుధవారం తెలంగాణభవన్‌లో కేటీఆర్‌ను కలిసి గోడు వెళ్లబోసుకున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చి 22నెలలు దాటినా తమకిచ్చిన ఏ ఒక్క హామీనీ అమలుచేయలేదని కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. తమ సమస్యలను అసెంబ్లీలో లేవనెత్తాలని విజ్ఞప్తిచేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల ముందు గిగ్ వర్కర్స్ కోసం ప్రత్యేక డిక్లరేషన్‌ను విడుదల చేసిన కాంగ్రెస్ గద్దెనెక్కిన తర్వాత ఆ ఊసే మరిచిందని మండిపడ్డారు.
ఇచ్చిన హామీ మేరకు గిగ్‌వర్కర్స్ వెల్ఫేర్‌బోర్డు ఏర్పాటు చేయాలని, ప్రమాద బీమాతో కూడిన సామాజిక భద్రత కల్పించాలని, సరైన వేతనాలందేలా చర్యలు తీసుకోవాలని, మరణించిన కార్మికుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయిన గిగ్ వర్కర్లు అహ్మద్బిన్ అబ్దుల్ ఖదీర్, శ్యాంసుందర్ లోకుర్తి నరేశ్ కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ఇస్తామని చెప్పిన ప్రభుత్వం విస్మరించడం దురదృష్టకరమని పేర్కొన్నారు.
గిగ్ వర్కర్ల ప్లాట్‌ఫారమ్ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చట్టం చేయాలని కేటీఆర్ కోరారు. ఇందుకు బీఆర్ఎస్ మద్దతు ఇస్తుందని ప్రకటించారు. బాధిత కుటుంబాలకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఓట్ల కోసం హామీలు ఇవ్వడం, ఓట్లు డబ్బాలో పడగానే విస్మరించడం హస్తం పార్టీకి అలవాటుగా మారిందని విమర్శించారు.