హైదరాబాద్: నిండు శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క మహిళల పట్ల అత్యంత అవమానకరంగా ప్రవర్తించారని, వారి ప్రవర్తన తనను ఆశ్చర్యానికి గురిచేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డికి ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎంలు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కూడా.. ఎంతో హుందాగా, ప్రజలకు సేవ చేసే గుణం వారిది. అలాంటి మహిళ నేతలను ఇంత చులకనగా మాట్లాడటం సిగ్గు చేటని విమర్శించారు.
కాంగ్రెస్ నాయకులు చేసిన ఈ వ్యాఖ్యలు వారిద్దరిపై మాత్రమే కాదు మొత్తం మహిళలపై వారికున్నా చులకన భావాన్ని తెలియజేస్తుందన్నారు. కాంగ్రెస్ నేతల వ్యవహార శైలిని మహిళలంతా గమనిస్తున్నారని చెప్పారు. వారికి సరైన సమయంలో బుద్ధి చెప్పటం ఖాయమన్నారు.
అసెంబ్లీలో బుధవారం మధ్యాహ్నం ద్రవ్య వినిమయ బిల్లుపై ప్రభుత్వం, కేటీఆర్ మధ్య సంవాదం కొనసాగుతున్నది.. వెంటనే అసందర్భంగా లేచిన సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతూ.. ‘కేటీఆర్ వెనకాల ఉండే అక్కలు ఇక్కడ (గతంలో అధికారపక్షంలో) ఉండి చెప్పీ చెప్పీ ఇక్కడ ముంచి అక్కడికి తేలిండ్రు. ఆ అక్కల మాటలు విన్నడనుకో జూబ్లీ బస్టాండులో కూర్చోవాల్సి వస్తది’ అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీమంత్రి సబితాఇంద్రారెడ్డిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో సీఎం చేసిన వ్యాఖ్యలు సభలో తీవ్ర గందరగోళానికి దారితీశాయి. సీఎం మాట్లాడిన మాటలు యథాతథంగా.. ‘తాము కలిసి వస్తాం, ప్రభుత్వానికి సహకరిస్తామని కేటీఆర్ పదేపదే చెప్తున్నారు. కలిసి వస్తరా? లేదా? అనేది, అన్నం ఉడికిందా? లేదా? అనేది ఒక మెతుకును చూస్తే తెలుస్తుంది. ప్రతిపక్ష నాయకుడు సభలకే రానప్పుడు వీళ్లు కలిసి వస్తరంటే నమ్మేదెవరు? అందుకే నేను వారికి సూచన చేస్తున్నా.. కేటీఆర్ వెనకాల ఉండే అక్కలు..’ అంటూ అసందర్భ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంలో కేటీఆర్ వెనుక సీట్లో సబితాఇంద్రారెడ్డి, సునీతాలక్ష్మారెడ్డి కూర్చున్నారు. సీఎం వ్యాఖ్యలు సభలో వాయిదాలకు, ఆందోళనలకు, నిరసనలకు కారణమయ్యాయి.