KTR | జీహెచ్ఎంసీని అడ్డగోలుగా విభజించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ కేవలం డబ్బుల కోసం చేస్తున్నదనే అని అన్నారు. మర్చంట్ బ్యాంకర్ బ్రోకర్ చెప్పినట్లుగా రేవంత్ రెడ్డి చేస్తున్నారని మండిపడ్డారు.
అసెంబ్లీలో మీడియాతో కేటీఆర్ చిట్‌చాట్‌లో మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీని మూడు ముక్కలు చేస్తున్నారని మండిపడ్డారు. ఫోర్త్ సిటీ అని పెట్టాడని.. దాన్ని కూడా తొందరలో ఏదో కార్పొరేషన్ చేస్తాడు కావచ్చని ఎద్దేవా చేశారు. ఏం చేసినా శాస్త్రీయంగా ఉండాలని.. కానీ ఇష్టమొచ్చినట్లు చేస్తే ఊరుకోరని తెలిపారు. వీటన్నింటికీ సమాధానం చెప్పాల్సి ఉంటుందని హెచ్చరించారు. జీహెచ్ఎంసీ డివిజన్ల విభజనపై సభలో చర్చకు పెట్టాలని డిమాండ్ చేశారు. చర్చలో అన్ని విషయాలపైనా తాము మాట్లాడతామని స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీలో కాంగ్రెస్, ఎంఐఎం ఏం చేుకుంటారో.. ఎవరికి లాభం చేకూర్చేలా చేసుకుంటారో వాళ్లిష్టమని అన్నారు. కానీ తమకు మాత్రం 2016లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నిక చారిత్రాత్మక ఎన్నిక అని తెలిపారు. అలాంటి ఎన్నికలు ఇప్పటివరకు చూడలేదని.. మళ్లీ చూడబోమని చెప్పారు. గతంలో ఓల్డ్ సిటీలో కూడా బీఆర్ఎస్ రెండు సీట్లు గెలిచామని గుర్తుచేశారు. గతంలో మేం గెలిచిన సీట్లు ఇంకా ఎవరు గెలవలేరని వ్యాఖ్యానించారు.
అసెంబ్లీలో కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి షేక్‌హ్యాండ్ ఇవ్వడంపైనా కేటీఆర్ స్పందించారు. కేసీఆర్ అంటే గౌరవం ఉంటే చాలని అన్నారు. తెలంగాణ తెచ్చిన నాయకుడివగా కేసీఆర్ పట్ల తెలంగాణలో ప్రతి ఒక్కరికీ గౌరవం ఉంటుందని తెలిపారు. ముఖ్యమంత్రికి సభలో కేసీఆర్‌ను కలిసేంత సంస్కారం ఉంటే చాలని.. ఇదే సంస్కారం బయట మాటల్లో కూడా ఉంటే బాగుండేదని వ్యాఖ్యానించారు. రాజకీయ ప్రత్యర్థులు ఒకరినొకరు పలకరించుకునేంత సానుకూల వాతావరణం ఉంటే మంచిదేనని అన్నారు.