మైదం మహేశ్ కుటుంబానికి బీఆర్ఎస్ తరఫున అండగా ఉంటాం. ఆయన ముగ్గురు బిడ్డలను కేసీఆర్ తరఫున ఆదుకుంటాం. పార్టీ ద్వారా పిల్లల పేరిట నగదు జమ చేయిస్తాం. రెండు రోజుల్లో రెడ్కో మాజీ చైర్మన్ సతీశ్ వచ్చి నగదును అందిస్తారు.. మీరు అధైర్యపడవద్దు.
-కేటీఆర్
హైదరాబాద్, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ)/ములుగు: ‘ములుగులో మున్సిపల్ పారిశుధ్య కార్మికుడు మైదం మహేశ్‌ది ఆత్మహత్య కాదు.. ముమ్మాటికీ సర్కారు హత్యే’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. ఆరు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతోనే మహేశ్ పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. బలవన్మరణానికి అసమర్థ కాంగ్రెస్ సర్కారే కారణమని విమర్శించారు. ఇందుకు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి సీతక్క బాధ్యత వహించి వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. పారిశుధ్య కార్మికుడు మహేశ్ మృతిపై కేటీఆర్ ఆరా తీశారు. ఆయన ఆదేశాల మేరకు రెడ్కో మాజీ చైర్మన్ వై సతీశ్‌రెడ్డి ఆదివారం ములుగు జిల్లా మాధవరావుపల్లి గ్రామంలోని మృతుడి ఇంటికి చేరుకొని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. కేటీఆర్‌తో మహేశ్ తల్లి, ఇతర కుటుంబ సభ్యులను మాట్లాడించారు. ఈ సందర్భంగా మహేశ్ మృతికి గల కారణాలను కేటీఆర్ తెలుసుకున్నారు. అధైర్యపడవద్దని అండగా ఉంటానని హామీ ఇచ్చారు. మహేశ్ మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. అంతకుముందు మహేశ్ మృతిపై కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. 6 నెలలుగా వేతనాలందక పోవడంతోనే మహేశ్ ఆత్మహత్య చేసుకున్నాడని, కాంగ్రెస్ పాలనలో మున్సిపల్ సిబ్బందికి కనీసం వేతనాలు చెల్లించలేని దుస్థితి నెలకొనడం బాధాకరమని పేర్కొన్నారు. మంత్రి సీతక్క నియోజకవర్గమైన ములుగులో జరిగిన ఈ దారుణ ఘటనకు సీఎం, మంత్రిదే బాధ్యతని తేల్చిచెప్పారు.
బాధిత కుటుంబాన్ని ఆదుకోవాల్సిన సర్కారు.. మహేశ్ మరణంపై దుష్ప్రచారం చేయడం దుర్మార్గమని కేటీఆర్ ధ్వజమెత్తారు. మంచినీళ్లు అనుకొని పురుగుల మందు తాగానంటూ చెప్పిన ఓ ఫేక్ వీడియోను సృష్టించి సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఆదుకోవాల్సిన సర్కారే ఇలాంటి దుర్మార్గానికి ఒడిగట్టిందని మండిపడ్డారు. ఇలాంటి తప్పుడు చర్యలతో ప్రభుత్వ ఘోర వైఫల్యాలను కప్పిపుచ్చుకోలేరని హెచ్చరించారు. సోషల్ మీడియా ముసుగులో తప్పించుకునేందుకు యత్నిస్తున్న కాంగ్రెస్‌కు ప్రజాక్షేత్రంలో శిక్ష తప్పదని స్పష్టంచేశారు. మహేశ్ కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, అతడి భార్యకు ప్రభుత్వం ఉద్యోగమిచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే బాధిత కుటుంబానికి, కార్మికులకు న్యాయం జరిగేదాకా బీఆర్ఎస్ పోరాడుతుందని హెచ్చరించారు. కాంగ్రెస్ వైఖరిని ప్రజాక్షేత్రంలో ఎండగడతామని తేల్చిచెప్పారు.
బీఆర్ఎస్ నేతల ద్వారా కేటీఆర్ మహేశ్ తల్లితో ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె భోరున విలపించారు. ఉబికి వస్తున్న కన్నీళ్లను దిగమింగుకుంటూ కొడుకు మృతికి గల కారణాలను ఏకరువు పెట్టింది. తన కొడుకుకు ఆరు నెలలుగా జీతమివ్వకుండా శ్మశానంలో పనిచేయించారని చెప్పారు. ‘మహేశ్‌కు నలుగురు ఆడపిల్లలని, గతంలో ఒక బిడ్డకు జ్వరం రాగా.. పైసల కోసం తిప్పలు పడితే రూ.2 వేలే ఇచ్చారని.. చికిత్సకు డబ్బు లేకపోవడంతో పాప ప్రాణాలు కోల్పోయిందని ఆవేదన వ్యక్తంచేసింది. కొన్ని రోజుల కింద మరోక బిడ్డకు జ్వరమొస్తే రూ.2 వేలు అప్పు తెచ్చి దవాఖానలో వైద్యం చేయించిండని కన్నీటిపర్యంతమైంది. ఆరు నెలల నుంచి జీతాలందకపోవడంతో భార్యాపిల్లలు తిండికి టికానా లేక అవస్థలు పడుతున్నారని ఆ మాతృమూర్తి వాపోయింది. ఇలాంటి దిక్కుతోచని స్థితిలో మున్సిపాలిటీ వాళ్లు శ్మశానవాటిక కోసం ఇచ్చిన గడ్డి మందును తాగి చనిపోయాడని వెల్లడించింది. ఆమె మాటలు విన్న కేటీఆర్ చలించిపోయారు. గతంలో ఇలాంటి ఇబ్బందులుండేవా? అని కేటీఆర్ అడగగా లేవని బదులిచ్చింది. ఆరు నెలల నుంచే కొడుకు చేతిలో చిల్లిగవ్వలేక అష్టకష్టాలు పడుతున్నాడని ఏకరువు పెట్టింది.
మహేశ్ అన్న బిడ్డ మైదం జ్యోతి తన బాబాయ్ మరణంపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని రెడ్కో మాజీ చైర్మన్ సతీశ్‌రెడ్డి దృష్టి కి తీసుకొచ్చారు. తన బాబాయ్ చనిపోయే ముందు ఎవరూలేని సమయంలో కిరీటి, రఘు వచ్చి నీళ్లు అనుకొని గడ్డి మందు తాగినట్టు బలవంతంగా చెప్పించి వీడియో తీసుకున్నారని చెప్పింది. బాబాయ్ మైకంలో లేని సమయంలో ఆయనతో బలవంతంగా మా ట్లాడించారని చెప్పింది. జీతం రాకపోవడం, మున్సిపల్ వాళ్లు పెట్టిన ఇబ్బందులతోనే చనిపోయాడని తెలిపింది. కేటీఆర్ ఆదేశాల మేర కు పార్టీ తరఫున ఆర్థికసాయం చేస్తామని సతీశ్‌రెడ్డి వారికి భరోసా ఇచ్చారు. ఆయన వెంట బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రమేశ్‌రెడ్డి, నాయకులు పోమానాయక్, భిక్షపతి, పోరిక విజయ్‌రామ్‌నాయక్, గజ్జి నగేశ్, కోగిల మహేశ్, ఆకుతోట చంద్రమౌళి, గరెగే రఘు ఉన్నారు.