హైదరాబాద్, మార్చి 31 (నమస్తే తెలంగాణ) : హెచ్‌సీయూ భూముల పరిరక్షణ కోసం విద్యార్థులు చేస్తున్న పోరాటంపై రేవంత్‌రెడ్డి సర్కారు దుర్మార్గంగా వ్యవరిస్తున్నదని, దుశ్శాసన పర్వం కొనసాగిస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. సోమవారం తెలంగాణ భవన్లో తనను కలిసిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల పోరాటానికి అండగా ఉంటామని కేటీఆర్ భరోసానిచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ భూముల పరిరక్షణ కోసం ఆందోళన చేస్తున్న ఆడబిడ్డలను లాగి పడేసి దుస్తులను చించి దౌర్జన్యం చేయడం ఏమిటని నిలదీశారు. 1968-71 వరకు జరిగిన తొలిదశ తెలంగాణ ఉద్యమంలో 370 మంది ఆత్మబలిదానాల సాక్షిగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పడిందని గుర్తుచేశారు. యూనివర్సిటీ విద్యార్థులపై, భూములపై కాంగ్రెస్ ప్రభుత్వం దాష్టీకం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్ర ప్రభుత్వం వందల బుల్డోజర్లను, హిటాచి యంత్రాలను, పోలీసులను పెట్టి అకడున్న చెట్లను నరికేసి.. జంతువులను తరిమేసి, అక్కడ ఏమీ లేని బంజరు భూమి అని చెప్పేందుకు ఎందుకు ఆరాట పడుతున్నదని ప్రశ్నించారు. ‘గచ్చిబౌలి, నానక్‌రామ్ గూడ, ఖాజాగూడ, కోకాపేట వరకు నగరం కాంక్రీట్ జంగల్లా మారింది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏరియాలో నగరం విసృ్తతంగా పెరిగింది. దేశంలోని ఏ నగరంలోనూ ఇంత తకువ విస్తీర్ణంలో భారీగా నగరం అభివృద్ధి చెందలేదు. కోట్లాది చదరపు అడుగుల్లో నిర్మాణాలు జరుగుతున్నాయి’ అని వివరించారు.
పశ్చిమ హైదరాబాద్‌కు ఊపిరినిచ్చే కొన్ని గ్రీన్ ప్రాంతాల్లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, దాని చుట్టూ ఉన్న ప్రాంతాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. పశ్చిమ హైదరాబాదులో భవిష్యత్తులో ఢిల్లీ మాదిరి ఊపిరి పీల్చుకోవడమే కష్టమయ్యే పరిస్థితి ఏర్పడుతుందని వాపోయారు. సెంట్రల్ యూనివర్సిటీ చుట్టూ ఉన్న హరితాన్ని అలాగే ఉంచితే భవిష్యత్తుకు కొంత భరోసా ఉంటుందని పేర్కొన్నారు. ఒక ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది చేయకుండా ఏ విధంగా ఈ 400 ఎకరాలను అమ్ముతారని విద్యార్థులు అడుగుతున్నారని వివరించారు. 400 ఎకరాలను అమ్మేముందు జరిగే పర్యావరణ నష్టంపై అధ్యయనం చేయాలని అడుగుతున్నారని చెప్పారు. 2003లో ఐఎంజీ భారత్ అనే కంపెనీకి క్రీడా సదుపాయాల కోసం ఈ 400 ఎకరాలను కేటాయించిందని వ్యాఖ్యానించారు. కేవలం స్టేడియాలు, కీడా శిక్షణకు సంబంధించిన మౌలిక వసతులను ఏర్పాటు చేసేందుకు గత ప్రభుత్వాలు భూములను ఆ సంస్థకు ఇచ్చినట్టు గుర్తుచేశారు. కానీ ఈ ప్రభుత్వం అదే ప్రాంతంలో 400 ఎకరాల్లో కోట్లాది చదరపు అడుగుల నిర్మాణాలు చేపట్టి కాంక్రీట్ జంగల్‌గా మార్చే ప్రయత్నం చేస్తున్నదని విమర్శించారు. 21 ఏండ్ల తర్వాత ఈ భూములపై తీర్పు వచ్చిందని వెల్లడించారు. కానీ ప్రభుత్వం మాత్రం వెంటనే ఆ భూములను అమ్మి రూ.30 వేల కోట్లు సేకరించాలని ప్రయత్నం చేస్తున్నదని మండిపడ్డారు. ‘ఆస్తులు అమ్మడం.. అప్పులు తేవడం అనే రేవంత్‌రెడ్డి ఎజెండా తప్పా? ఒప్పా? అనేది ప్రజలే నిర్ణయిస్తారు’ అని పేర్కొన్నారు.
ప్రజాస్వామిక స్ఫూర్తి, సామాజిక స్పృహ ఉన్న ఎవరికైనా హెచ్‌సీయూలో జరుగుతున్న పరిణామాల పట్ల బాధ కలుగుతుంది. హెచ్‌సీయూ విద్యార్థులు ఎలాంటి స్వార్థం లేకుండా సమాజహితం కోసం గొప్ప పోరాటం చేస్తున్నరు. కొత్త తరం విద్యార్థుల్లో పోరాట పటిమ స్ఫూర్తిదాయకం. విద్యార్థులు చూపుతున్న ఈ తెగువకు సెల్యూట్ చేస్తున్నా.
ఫ్యూచర్ సిటీని 50 వేల ఎకరాల్లో కడతామని సీఎం రేవంత్‌రెడ్డి ఓ వైపు ప్రచారం చేసుకుంటున్నారని, ఇప్పటికే 15 వేల ఎకరాల భూమి ఉన్నదని, మరో 35 వేల ఎకరాలను సేకరిస్తామని ఊదరగొడుతున్నారని కేటీఆర్ విమర్శించారు. ఫార్మాసిటీ భూములతో పాటు మరో 30 వేల ఎకరాలను సేకరించి కొత్త నగరం కడతామంటున్నారని, ప్రభుత్వం వద్ద 15 వేల ఎకరాలు ఉంటే హెచ్‌సీయూలోని 400 ఎకరాలపై ఎందుకు కన్ను పడిందో చెప్పాలని నిలదీశారు. వరుసగా 4 రోజులు కోర్టుకు సెలవులని తెలిసే బుల్డోజర్లు, పోలీసులతో దౌర్జన్యానికి తెగ బడ్డారని నిప్పులు చెరిగారు.
హెచ్‌సీయూలో బుల్డోజర్లతో అర్ధరాత్రి చేస్తున్న పనులకు నెమళ్లు, పక్షులు అరుస్తున్న విజువల్స్ రాహుల్‌గాంధీకి కనిపించడం లేదా అని కేటీఆర్ ప్రశ్నించారు. హైకోర్టులో ఇప్పటికే ఈ అంశంపై ప్రజాప్రయోజన వ్యాజ్యం వేశామని, హైకోర్టు ఆదేశాలు రాకముందే ప్రభుత్వం అరాచకంగా వ్యవహరిస్తున్నా రాహుల్ గాంధీ ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. ‘ఇదే రాహుల్ గాంధీ గతంలో ముంబై మహానగరంలోని ఆరే అడవుల్లో 800 ఎకరాల్లో 2,500 చెట్లు కొట్టేస్తే నగరం కాంక్రీట్ జంగల్‌గా మారుతుందన్నరు.. ఛత్తీస్‌గఢ్‌లో హస్దియో అడవులను అక్కడి బీజేపీ ప్రభుత్వం మైనింగ్‌కు కేటాయిస్తే.. పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని గగ్గోలు పెట్టిండ్రు. మరి నేడు హెచ్‌సీయూ విద్యార్థులు, పశ్చిమ హైదరాబాద్ భవిష్యత్తు నాశనమైనా రాహుల్‌కు ఫర్వాలేదా?’ అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ భూములపై చేస్తున్న రాజకీయంతో ఇబ్బందులు పడుతున్న పిల్లలు, పర్యావరణం, వన్యప్రాణుల రోదనలు రాహుల్ గాంధీకి వినిపించడం లేదా అని నిలదీశారు. బీఆర్ఎస్ తరఫున రాజ్యసభలో ఈ అంశంపై కేంద్రాన్ని నిలదీస్తామని చెప్పారు. కేంద్ర హెచ్ఆర్డీ శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను ఈ అంశంపై అడుగుతామని తెలిపారు.
హెచ్‌సీయూలో బుల్డోజర్లతో అర్ధరాత్రి చేపడుతున్న పనులకు నెమళ్లు, పక్షులు అరుస్తున్న విజువల్స్ రాహుల్‌గాంధీకి కనిపించడం లేదా? ఇప్పటికే ఈ అంశంపైన పర్యావరణహితం కోసం హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేసినం. ప్రభుత్వం హైకోర్టు ఆదేశాలకంటే ముందే అరాచకంగా వ్యవహరిస్తున్నది. గతంలో సెంట్రల్ యూనివర్సిటీకి రెండుసార్లు వచ్చి వెళ్లిన రాహుల్ గాంధీ, విద్యార్థులపై ఇంత అరాచకం జరుగుతున్నా ఎందుకు స్పందించడం లేదు?
హెచ్‌సీయూ విద్యార్థులకు అండగా ఉంటామని కేటీఆర్ భరోసానిచ్చారు. ‘రేవంత్‌రెడ్డి అంటే రియల్ ఎస్టేట్.. రియల్ ఎస్టేట్ అంటే రేవంత్ రెడ్డి’ అని ఎన్నికల ముందే చెప్పినప్పుడే మనం జాగ్రత్త పడాల్సిందని చెప్పారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఫుట్‌బాల్ ఆడి మరీ అకడున్న భూములపై కన్నేశాడని విమర్శించారు. అందుకే పిల్లలు, పర్యావరణం, సెంట్రల్ యూనివర్సిటీ ఏమైనా సరే ఆ భూములు వదిలిపెట్టనని ఈ రోజు అరాచకంగా వ్యవహరిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తంచేశారు. తమను సెంట్రల్ యూనివర్సిటీకి రావాలని అనేకమంది అడుగుతున్నారని, విద్యార్థుల ఆందోళనకు రాజకీయ రంగు పులుముతాడనే తాము ఇప్పటిదాకా నేరుగా హెచ్సీయూకు వెళ్లలేదని వివరించారు. విద్యార్థుల ఆందోళనలను సైతం మలినం చేసేలా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతారని.. సరైన వేదికలపైన ఈ అంశాన్ని లేవనెత్తుతామని స్పష్టంచేశారు. ప్రభుత్వ ఆస్తులు అమ్ముకుంటే భవిష్యత్తు తరాల కోసం స్మశానాలకు కూడా జాగాలు ఉండవని చెప్పింది రేవంత్‌రెడ్డి కాదా? అని ప్రశ్నించారు. మరిప్పుడు రేవంత్ అవన్నీ మర్చిపోయాడా? అని నిలదీశారు. ఇద్దరు యూనివర్సిటీ పిల్లలను జైలుకు పంపారని విద్యార్థులు చెప్తున్నారని, వారికి అండగా ఉంటామని, న్యాయపరంగా అన్ని రకాల సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. ఆ ఇద్దరు విద్యార్థుల ఆచూకీని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం బయటపెట్టాలని డీజీపీకి విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పూర్వ విద్యార్థులైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార, మంత్రి శ్రీధర్‌బాబు లాంటి వాళ్లు ఈ అంశంపై ఎందుకు మాట్లాడటం లేదని కేటీఆర్ ప్రశ్నించారు. వారికి పిల్లల తరఫున నిలబడేందుకు మనసు రావడం లేదని వాపోయారు. ప్రభుత్వంలో ఉన్న వారు ఏకపక్షంగా వ్యవహరించడం తగదని హితవు పలికారు. వైస్ చాన్స్‌లర్ అనుమతులు లేకుండా పోలీసులు వర్సిటీ లోనికి వెళ్లడం ఏమిటని ప్రశ్నించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోకి వెళ్లే అనుమతి పోలీసులకు ఉండదని, కానీ విచ్చలవిడిగా పోలీసులను పంపించి విద్యార్థులను భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నాన్ని సీఎం రేవంత్‌రెడ్డి చేస్తున్నాడని మండిపడ్డారు. అరెస్ట్ చేసిన రోహిత్, నవీన్ కుమార్‌పై పెట్టిన కేసులు ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తు దుష్పరిణామాలను దృష్టిలో ఉంచుకోకుండా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం హెచ్‌సీయూ భూముల విషయంలో అనుసరిస్తున్న వైఖరిని ఖండిస్తున్నామని తెలిపారు. హెచ్‌సీయూ అంశంలో బీజేపీ, కమ్యూనిస్టులతో పాటు ఇతర పార్టీలు తమ స్పష్టమైన వైఖరిని వెల్లడించాలని డిమాండ్ చేశారు.