KTR : కేంద్రంలో 11 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణకు చేసిందేం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. అయోధ్య తలంబ్రాల పేరుతోటి రేషన్ బియ్యం పంచి మొన్న ఎలక్షన్లల్ల ఒక్కసారి గెలిచిండ్రని ఎద్దేవా చేశారు. కరీంనగర్ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. మొన్న సెంటిమెంటు పూసి మాయ జేసిండ్రు తప్పితే.. తెలంగాణల వాళ్ల ఆటలు ఎన్నడూ సాగలే అన్నారు.
‘బండి సంజయ్‌ని తెలంగాణకు ఏం జేసిండ్రని అడిగితే ఏం జెప్తడు. ఏం జెప్పడు. ఎందుకంటే ఆయనకు ఏ తెల్వదు. ఆయనకు ఒక్కటే తెలుసు. ఏందది మసీదు కూలగొడ్దాం. అండ్ల శవం దొరికితే మీది, శివం దొరికితే మాది అంటడు. అదొక్కటే తెలుసాయనకు. లేదంటే అన్నా ఇయ్యాలేం వారమే, రేపేం వారేమే, ఎల్లుండే వారమే అని అడుగుతడు. అంతే తప్ప వాళ్లు ఓ బడి తెచ్చింది లేదు, ఓ గుడి కట్టింది లేదు’ అని కేటీఆర్ విమర్శించారు.
‘ఒక ఓటు ద్వారా తప్పుడు పాలకులను ఎన్నుకున్నందుకు ఐదేళ్ల శిక్ష పడింది. ఇగనైనా మనం మేలుకోవాలి. మంచి పాలకులను ఎన్నుకోవాలె. బీఆర్ఎస్ను ఓడగొట్టడానికి కాంగ్రెస్ పార్టీ అసూయ, ద్వేషం, ఆశ అనే మూడు ప్రయోగాలు చేసింది. స్థానిక నాయకత్వం మీద అసూయ నింపిండ్రు. కేసీఆర్ మీద ధ్వేషం పెంచిండ్రు. ఓటర్లకు తులం బంగారం, రూ.15 వేల రైతుబంధు, పెన్షన్ల రెట్టింపు అని ఆశ పెట్టిండ్రు. వాళ్ల ప్రయోగాలు ప్రజలపై పనిచేయడంలో ప్రజల తప్పు లేదు. మన తప్పే ఉంది. కేసీఆర్ ప్రజలకు చెప్పమన్నది మనం సరిగ్గా చెప్పుకోలేకపోయినం.’ అని అన్నారు.
‘కేసీఆర్ హయాంలో దినదినాభివృద్ధి చెందిన తెలంగాణ ఇవాళ కాంగ్రెస్ పాలనలో ఆగమైతున్నది. తెలంగాణను కాపాడుకోవాలంటే మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలె. ఏప్రిల్ 27 తర్వాత కొత్తగా మెంబర్షిప్ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. కమిటీలను నిర్మించుకుందాం. కమిటీల్లో ప్రజల మధ్య ఉండే నాయకులకు చోటు కల్పిద్దాం. ప్రజలకు కాంగ్రెస్, బీజేపీ ఎట్ల అన్యాయం చేసినయో వివరించేలా మన నాయకులు, కార్యకర్తలు సిద్ధం కావాలె. అందుకోసం అన్ని జిల్లా కేంద్రాల్లో శిక్షణ కార్యక్రమాలు పెట్టుకుందాం. ఒకవేళ రేవంత్‌రెడ్డికి బుద్ధొచ్చి స్థానిక సంస్థల ఎన్నికలు పెడితే పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృష్టి చేస్తం. ఈ సారి కరీంనగర్‌లోని 13 స్థానాల్లో గులాబీ జెండా ఎగిరేలా పనిచేద్దాం. పార్టీకి టికెట్ ఇచ్చిన అభ్యర్థి వెంటే క్యాడర్ నడువాలి. వ్యక్తిగత కక్షలకుపోతే అవతలి అభ్యర్థికి లబ్ధి జరుగుతది. 2028లో కేసీఆర్‌ను ముఖ్యమంత్రిని చేద్దామని శపథం చేద్దాం.’ అని కేటీఆర్ పిలుపునిచ్చారు.