బంజారాహిల్స్/ వెంగళరావునగర్, నవంబర్ 15: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలు వచ్చి 24 గంటలు కూడా గడవకముందే కాంగ్రెస్ పార్టీ గూండాయిజానికి పాల్పడటం సిగ్గుచేటని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. రహ్మత్‌నగర్ డివిజన్‌కు చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు రాకేశ్ క్రిస్టఫర్పై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసిన విషయం తెలిసి కేటీఆర్ శనివారం ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిచిన తర్వాత తన ఇంటి సమీపంలోకి ముగ్గురు కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చి అకారణంగా గొడవకు దిగడంతో పాటు దాడి చేశారని రాకేశ్ క్రిస్టోఫర్ వివరించారు. కాంగ్రెస్ దాడులకు భయపడాల్సిన అవసరం లేదని రాకేశ్‌కు, ఆయన కుటుంబసభ్యులకు కేటీఆర్ ధైర్యం చెప్పారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ పదేండ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎన్నో ఎన్నికల్లో విజయం సాధించినా ఏనాడూ కాంగ్రెస్ కార్యకర్తలపై దాడులకు దిగలేదని గుర్తుచేశారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిచిన తర్వాత బీఆర్ఎస్ చిహ్నమైన కారును క్రేన్ ద్వారా తీసుకెళ్లి ధ్వంసం చేయడం కాంగ్రెస్ నేతల నైజాన్ని బయటపెట్టిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ చేస్తున్న రౌడీయిజాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. బీఆర్ఎస్ కార్యకర్త రాకేశ్‌పై జరిగిన దాడికి కాంగ్రెస్ పార్టీయే బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలు ఇలాంటి దాడులకు భయపడేవారు కాదని, వారికి నిరంతరం తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. దొంగ ఓట్లు, విపరీతమైన డబ్బుల పంపిణీ, అధికార దుర్వినియోగం చేసి గెలిచిన కాంగ్రెస్ తీరును ప్రజలంతా గమనించారని దుయ్యబట్టారు. తాను అహంకారం తగ్గించుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన కేటీఆర్ ఎవరిది అహంకారమో ప్రజలు గమనిస్తున్నారని, ఒక్క ఎన్నికలో గెలిస్తేనే ఇంత గర్వంతో మిడిసిపడుతున్నారని, కాంగ్రెస్ గూండాయిజానికి ప్రజలే బుద్ధి చెప్తారని హెచ్చరించారు. కార్యకర్తలకు ఎలాంటి ఆపద వచ్చినా అరగంటలో ఉంటామని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని ధైర్యాన్నిచ్చారు.
బీఆర్ఎస్ ఓటు బ్యాంకు చెక్కుచెదరలే
అధికార దుర్వినియోగం, అనేక అరాచకాలతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలిచినా బీఆర్ఎస్కు ఉన్న ఓటు బ్యాంకు చెక్కుచెదరలేదని కేటీఆర్ చెప్పారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటమి పాలైన మాగంటి సునీతా గోపీనాథ్‌ను, ఆమె కుటుంబసభ్యులను శనివారం మాదాపూర్‌లోని వారి నివాసంలో కేటీఆర్ కలిశారు. ఓటమితో కుంగిపోవాల్సిన అవసరం లేదని ధైర్యాన్నిచ్చారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రెండుమూడురోజుల్లో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి ఉప ఎన్నికలో ఓటమిపై సమీక్ష నిర్వహించుకొని భవిష్యత్తు కార్యాచరణను సిద్ధం చేసుకుందామని చెప్పారు. కేటీఆర్ వెంట మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యేలు మాదవరం కృష్ణారావు, పాడి కౌశిక్‌రెడ్డి, కార్పొరేటర్లు దేదీప్యరావు, రాజ్‌కుమార్ పటేల్, మాజీ ఎమ్మెల్యే విష్ణు తదితరులున్నారు.