KTR : తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఏడుగురు ప్రముఖులకు పద్మ శ్రీ అవార్డులు దక్కడం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, కల్వకుంట్ల తారకరామారావు (KTR) హర్షం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా 131 మందికి పద్మ పురస్కారాలు ప్రకటించగా, తెలంగాణ నుంచి వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన మేధావులకు సముచిత స్థానం లభించడం రాష్ట్ర ప్రజలందరికీ గర్వకారణమని ఆయన కొనియాడారు. ముఖ్యంగా సైన్స్, వైద్యం, కళలు, పశుసంవర్ధక వంటి విభిన్న రంగాల్లో తెలంగాణ ప్రతిభ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం అభినందనీయమని కేటీఆర్ పేర్కొన్నారు.
సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగంలో విశేష పరిశోధనలు చేసిన చంద్ర మౌళి గడ్డమానుగు, కృష్ణమూర్తి బాలసుబ్రహ్మణియన్, కుమారస్వామి తంగరాజ్లకు పద్మశ్రీ పురస్కారాలు లభించడం వారి మేధస్సుకు దక్కిన గౌరవమని కేటీఆర్ ప్రశంసించారు. వైద్య రంగంలో సామాన్యులకు అత్యాధునిక చికిత్సలను అందుబాటులోకి తెచ్చిన ప్రముఖ సర్జన్ గూడూరు వెంకట్ రావు, ప్రముఖ క్యాన్సర్ నిపుణులు పాల్కొండ విజయ ఆనంద్ రెడ్డిలకు ఈ అత్యున్నత గౌరవం దక్కడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. అలాగే కూచిపూడి నృత్య కళాకారిణి దీపికా రెడ్డికి నృత్య రంగంలో ఆమె చేసిన అద్భుత ప్రదర్శనలకుగానూ ఈ పురస్కారం లభించిందని కేటీఆర్ గుర్తు చేశారు.
Seven individuals from #Telangana have been named for the #PadmaShri awards this year, recognising contributions in science, medicine, engineering, research, and the arts. https://t.co/fNeiaHA0ih
— Telangana Today (@TelanganaToday) January 25, 2026
పశుసంవర్ధక రంగంలో నిస్వార్థ సేవలందించిన రామారెడ్డి మామిడికి మరణానంతరం పద్మ శ్రీ ప్రకటించడం ఆయనకు దక్కిన నిజమైన గుర్తింపు అని కేటీఆర్ అభివర్ణించారు. క్షేత్రస్థాయిలో నిశ్శబ్దంగా సమాజం కోసం పనిచేసే వారిని గుర్తించడం ముదావహమని, ఈ పురస్కారాలు రాబోయే తరాలకు గొప్ప స్ఫూర్తినిస్తాయని ఆయన ఆకాంక్షించారు. పురస్కార గ్రహీతలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపిన ఆయన.. తెలంగాణ గడ్డపై పుట్టిన ప్రతిభావంతులు దేశ కీర్తిని మరింత ఇనుమడింపజేయాలని ఆయన కోరారు.