హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ)/శేరిలింగంపల్లి : దేశ భవిష్యత్తు వ్యాపార, వాణిజ్య అవకాశాల్లో, ఆర్థిక క్రమశిక్షణలో చార్టర్డ్ అకౌంటెంట్ల పాత్ర అత్యంత కీలకమని, ఆర్థిక ప్రగతికి వారు ది క్సూచి అని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు చెప్పారు. మారుతున్న పన్ను నిబంధన లు, జీఎస్టీ వ్యవస్థ, డిజిటల్ పారదర్శకత కారణంగా సమాజంలో సీఏల అవసరం, వారి పరిధి వేగంగా పెరుగుతున్నదని పేర్కొన్నారు. గతంతో పోలిస్తే ప్ర స్తుతం సీఏ కోర్సుకు డిమాండ్ పెరిగిందని, దీని వె నుక ఉన్న కఠినత్వాన్ని విద్యార్థులు పట్టుదలతో అధిగమించారని కొనియాడారు. హైదరాబాద్‌లోని అన్వయ కన్వెన్షన్‌లో శనివారం ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ఐసీఏఐ) స్నాకోత్సవానికి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరై సీఏ పూర్తిచేసిన యువతీయువకులకు పట్టాలు ప్రదానం చేశారు.

ఈ సందర్భంగా కేటీఆర్ ప్రసంగిస్తూ.. ‘చార్టర్డ్ అకౌంటెంట్ కావడం అంటే పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడం మాత్రమే కాదు. తీవ్రమైన ఒత్తిడిని, అనిశ్చితిని తట్టుకొని, వైఫల్యాలను దాటుకొని ముందుకు సాగడం. జీవితంలో చిన్న కష్టాలకే చేతులెత్తేసే వారున్న ఈ రో జుల్లో.. ఇంతటి కఠినమైన కోర్సును పూర్తిచేసిన ఈ యువత, భవిష్యత్తులో రాబోయే ఎలాంటి సవాలునైనా ధైర్యంగా ఎదుర్కోగలరని నిరూపించుకున్నా రు’ అని ప్రశంసించారు.
దేశంలో ప్రస్తుతం స్టార్టప్‌ల సంఖ్య భారీగా పెరుగుతున్నదని, ఎంతోమంది యు వత సొంతంగా వ్యాపారరంగంలోకి అడుగుపెడుతున్నారని గుర్తుచేశారు. అలాంటి నవ వ్యవస్థాపకులకు సీఏల ఆర్థిక మార్గదర్శకత్వం, మద్దతు ఎంతో అవసరమని చెప్పారు. సీఏలు కేవలం పన్నుల లెకింపునకే పరిమితం కాకుండా, వ్యాపారాలను బలోపేతం చేసే శక్తులుగా ఎదగాలని పిలుపునిచ్చారు. వ్యాపారాలు వృద్ధి చెందితే ప్రభుత్వాలకు ఆదాయం పెరుగుతుందని, తద్వారా ప్రజలకు మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు అందుతాయని వివరించారు.

దేశంలోనే అత్యంత విజయవంతమైన స్టార్టప్ స్టే ట్‌గా తెలంగాణ రికార్డు సృష్టించిందని కేటీఆర్ గుర్తుచేశారు. 2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ పాలనలో సొంత పన్ను ఆదాయంలో 37శాతానికిపైగా వృద్ధిని సాధించిందని, ఇది దేశంలోనే అత్యధికమని చెప్పారు. రాష్ట్ర మొత్తం ఆదాయ వృద్ధి రేటు సుమా రు 14నుంచి 24శాతానికి పెరిగిందని తెలిపారు. తెలంగాణ ఏర్పడకముందు రూ.94వేలుగా ఉన్న తలసరి ఆదాయం, 2023 నాటికి గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక వంటి పెద్ద రాష్ట్రాలను దాటి రూ.3లక్షల పైచిలుకుకు చేరిందని గుర్తుచేశారు.
ప్రస్తుతం ప్రపంచాన్ని శాసిస్తున్న ఏఐ, అధునాతన సాంకేతికతలపై సీఏలు ప్రత్యేక దృష్టిపెట్టాలని సూచించారు. టెక్నాలజీ టూల్స్‌ను ఉపయోగించుకోవడం ద్వారా మనిషి ఉత్పాదకత, పనితీరు మరింత మెరుగవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. పట్టాలు అందుకున్న అకౌంటెంట్లకు అభినందనలు తెలుపుతూ.. విద్యార్థులు ఈ స్థాయికి చేరడానికి వారి తల్లిదండ్రులు చేసిన త్యాగాలను ఎప్పటికీ మ ర్చిపోకూడదని, వారిని ఎల్లప్పుడూ గౌరవిస్తూ జీవితంలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కేటీఆర్ ఆకాంక్షించారు.