హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై లాఠీచార్జి చేయడం అమానుషమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. కేంద్రంలోని విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థులు, యువకులు చేపట్టిన చలో పార్లమెంట్లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిపై ఢిల్లీ పోలీసులు లాఠీచార్జి చేయడం, బాష్పవాయువును ప్రయోగించడం ప్రజాస్వామ్య విరుద్ధమని సోమవారం ఎక్స్ వేదికగా విమర్శించారు. విద్యార్థులు శాంతియుతంగా నిరసన తెలియజేస్తుంటే ప్రభుత్వం వారిని అణచివేసేందుకు శక్తిని ప్రయోగించడం దురదృష్టకరమని వాపోయారు. నిరసనకారులపై పోలీసులు వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు. రాజ్యాంగం ప్రతి ఒకరికీ భావప్రకటన స్వేచ్ఛను హకుగా కల్పించిందని, వాటికి విఘాతం కల్పించేలా ప్రవర్తించి విద్యార్థులపై లాఠీచార్జ్ చేయడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు అందోళనకారులపై అణచివేత ధోరణి వీడనాడాలని , ప్రజలకు జవాబుదారీగా ఉండాలని ఇలాంటి సిగ్గుమాలిన చర్యలకు పాల్పడవద్దనిహితవు పలికారు.