హైదరాబాద్: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అక్రమ అరెస్టుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. శంషాబాద్ విమానాశ్రయంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అన్నారు. సీఎం రేవంత్ నిరంకుశ వైఖరిని తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి అక్రమాలను, మంత్రుల అవినీతిని, కాంగ్రెస్ నేతల దుర్మార్గాలను అడుగడుగునా ప్రశ్నిస్తున్నారు కాబట్టే ఆయనపై కక్షకట్టి అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు.
గత ఏడాదిన్నర కాలంగా కాంగ్రెస్ సర్కార్ ప్రజలకు చేస్తున్న అన్యాయాలపై నిలదీస్తున్న కౌశిక్ రెడ్డిని తప్పుడు కేసులతో ఇబ్బంది పెట్టే కుట్ర అనేక నెలల నుంచి కొనసాగుతూనే ఉందన్నారు. ఇలాంటి చిల్లర చేష్టలు, పనికిరాని కేసులు, బీఆర్ఎస్ నేతల సంకల్పాన్ని, మనోధైర్యాన్ని ఎప్పటికీ దెబ్బతీయలేవని చెప్పారు. ఇందిరమ్మ రాజ్యమని చెప్పుకునే రేవంత్ ఎమర్జెన్సీని తలపించేలా ప్రశ్నించే గొంతులపై అణచివేత చర్యలతో ప్రజాక్షేత్రంలో అబాసపాలవుతున్నాడని తెలిపారు.
కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయలేని తన చేతకానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకే రేవంత్ ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నాడని ధ్వజమెత్తారు. అసమర్ధ ముఖ్యమంత్రి ఆదేశాలతో అరెస్టు చేసిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని వెంటనే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తమకు గౌరవ న్యాయస్థానాలపై సంపూర్ణ నమ్మకం ఉందని చెప్పారు. తమపై, తమ నేతలపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా అవి కోర్టుల్లో నిలబడే అవకాశమే లేదని స్పష్టం చేశారు. ఎన్ని వందల తప్పుడు కేసులు పెట్టినా రేవంత్ నియంత పాలనపై.. ప్రజల పక్షాన పోరాడుతూనే బీఆర్ఎస్ ఉంటుందని కేటీఆర్ అన్నారు.
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అక్రమ అరెస్టుపై భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS కామెంట్స్
శంషాబాద్ విమానాశ్రయంలో హుజురాబాద్ ఎమ్మెల్యే @KaushikReddyBRS గారిని అక్రమంగా అరెస్టు చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య..
సీఎం రేవంత్ నిరంకుశ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నా..
— BRS Party (@BRSparty) June 21, 2025