KTR | అలంపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడిపై కాంగ్రెస్ సీనియర్ నేత, నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి దాడిని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ఇది ప్రజాస్వామ్యంపై జరిగిన బహిరంగ దాడి అని పేర్కొన్నారు. ప్రతిపక్షాన్ని భయపెట్టేందుకు, గొంతు నొక్కేందుకు కాంగ్రెస్ నేతలు దిగజారిన రాజకీయానికి ఇది నిదర్శనమని తెలిపారు.
ప్రజలతో ఎన్నికైన ఎమ్మెల్యేను అవమానిస్తూ, శారీరక దాడికి దిగడం కాంగ్రెస్ సంస్కృతి ఎంత దిగజారిందో అర్థమవుతుందని కేటీఆర్ మండిపడ్డారు. చట్టం, రాజ్యాంగం, ప్రజాస్వామ్య విలువలపై కాంగ్రెస్‌కు గౌరవం లేదని ఈ ఘటన మరోమారు స్పష్టం చేస్తోందన్నారు. ఈ దాడిని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని తెలిపారు. ఎంపీ మల్లు రవి తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నైతిక బాధ్యత వహించి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతిపక్షాన్ని బెదిరింపులతో కాదు, ప్రజల తీర్పుతోనే ఎదుర్కోవాలని సూచించారు. బీఆర్ఎస్ నాయకులపై దాడులు చేస్తే చూస్తూ ఉరుకోమని హెచ్చరించారు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో గట్టిగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు.
మంగళవారం జోగుళాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం పైపాడ్ గ్రామంలో సీసీరోడ్ల నిర్మాణానికి ఎంపీ మల్లు రవి, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌తో పాటు బీఆర్ఎస్ అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు హాజరయ్యారు. భూమిపూజ కార్యక్రమంలో మొదట ఎంపీ కొబ్బరికాయలు కొట్టగా తర్వాత ఎమ్మెల్యే పనులు ప్రారంభించే ప్రయత్నం చేశారు. అదే సమయంలో అలంపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కొబ్బరికాయ కొట్టేందుకు ముందుకురావడంతో ప్రొటోకాల్ లేని వ్యక్తులతో ఎలా కొట్టిస్తారని ఎంపీని, ఎమ్మెల్యే ప్రశ్నించారు. దీంతో రెచ్చిపోయిన మల్లు రవి ‘ఎవడ్రా నువ్వు’ అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. ఎమ్మెల్యే విజయుడును తోసేయడంతో పాటు అక్కడున్న వారితోనూ ఓ వీధి రౌడీలా ప్రవర్తించారు. దీంతో పోలీసులు ఎంపీని అదుపు చేశారు. సీనియర్ ఎంపీ రవి ఎమ్మెల్యేతో అమర్యాదగా మాట్లాడటాన్ని నియోజకవర్గ ప్రజలు తప్పుపడుతున్నారు. ఎంపీగా గెలిచినప్పటి నుంచి నడిగడ్డలో గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తూ అలజడి రేపుతున్నారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. గతంలోనూ ఇదే ఎంపీ గద్వాల నియోజకవర్గ ప్రజాప్రతినిధితో అమర్యాదగా మాట్లాడి, ఒకరిపై ఒకరు చేయి చేసుకోవడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది