KTR | మూసి బాధితుల పాలిట కాలయముడిలా సీఎం రేవంత్ రెడ్డి తయారయ్యాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్లో సోమవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్, కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఇవాళ దాదాపు 25వేల కుటుంబాలను రోడ్డున పడేస్తా.. లక్షమందిని నిరాశ్రయులను చేస్తా. మూసి బాధితుల పాలిట ఒక కాలయముడిలా ముఖ్యమంత్రి మారారు. సీఎంని అడుగుతున్నా మీకు ఎవరు అధికారం ఇచ్చారు. తప్పు చేసింది ఎవరు ? శిక్ష ఎవరికి వేస్తున్నరు ? మీరు బాధితుల మాట, ఆక్రందనలు వినాలి.
1994లో మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే మాకు పట్టాలు ఇచ్చారు. రిజిస్ట్రేషన్లు అయ్యాయి. అప్పటి నుంచి 30-35 సంవత్సరాలుగా కొందరు.. 50 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మాకు పట్టాలు వచ్చాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలో రిజిస్ట్రేషన్లు అయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మేం ఇండ్లు కట్టుకున్నాం అని వారు చెబుతున్నారు. వారంతా అడుగుతున్నారు. ఆనాడు రిజిస్ట్రేషన్ చేయించుకున్నప్పుడు.. బిల్డింగ్‌కు పర్మిషన్ ఇచ్చినప్పుడు.. ప్రాపర్టీ ట్యాక్స్ కట్టించుకున్నప్పుడు.. కరెంటు కనెక్షన్ ఇచ్చినప్పుడు.. మంచినీళ్ల బిల్లు కట్టునప్పుడు లేని అభ్యంతరాలు ఈ రోజుకు ఎందుకు వస్తున్నయని బాధితులు అడుగుతున్న సూటి ప్రశ్నకు ప్రభుత్వం వద్ద సమాధానం ఉందా ? అంటూ నిలదీశారు.
‘సీఎం ఒకమాట అర్థం చేసుకోవాలి. ఒక పేద, మధ్యతరగతి కుటుంబానికి ఇల్లు అనేది జీవితకాలం వారు చేసిన కష్టానికి ప్రతిరూపం. ఇల్లు అనేది ఒక ఎమోషన్. ఇల్లు అనేది ఆ కుటుంబం కలలుగనే ఒక సౌధం. అది ఒక నాలుగు ఇటుకలు, రెండురాళ్లు పెట్టిన కట్టిన కట్టంకాదు. ఇల్లు జ్ఞాపకాల పొదరిల్లు. అలాంటి జ్ఞాపకాన్ని కూల్చేస్తామంటే ఆ బాధ మీకు తెలియది కావచ్చు రేవంత్‌రెడ్డి. కానీ, మాకు తెలుసు. స్వయంగా కేసీఆర్ కుటుంబం రెండుసార్లు డిస్ప్లేస్ అయ్యాం. మా నాయనమ్మ ఊరు పోసాన్పల్లి. ఎగువ మానేరు డ్యామ్‌లో 1940లో మునిగిపోతే అక్కడి నుంచి తట్టాబుట్ట పట్టుకొని చింతమడకకు వచ్చింది మా కుటుంబం. మా అమ్మమ్మగారి ఊరు మొన్న మిడ్‌మానేరులో 2014 తర్వాత మా ప్రభుత్వంలో మునిగిపోయింది.
మా జ్ఞాపకాలు అందులోనే మునిగిపోయినయ్. ఒకసారి కాదు.. రెండుసార్లు డిస్ప్లేస్ అయినం. మాకు ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసు. ఒకసారి నిర్వాసితులుగా మారితే ఊరుతో అల్లుకున్న జ్ఞాపకాలు.. ఆ ఇంటితో అలుముకున్న కొన్ని ఆశలు, ఆకాంక్షలు ఎలా ఉంటాయో మాకు తెలుసు.. రేవంత్‌రెడ్డికి తెలియకపోవచ్చు. మీలాగా ఆయాచితంగా.. లక్కీడ్రాలో వచ్చినట్లు దన్‌మని ఊడిపడలేదు. ప్రజలు కష్టపడి కట్టుకున్నారు. ఇవాళ మీరు సీఎంగా ఉన్నారు కావొచ్చు కానీ.. మీ కాంగ్రెస్ ప్రభుత్వమే అన్ని అనుమతులు తీసుకొని కట్టుకున్న ఇండ్లు ఇవీ. 20, 30, 40 ఏళ్ల రెక్కల కష్టంతోని ఇండ్లు. పట్టాలు ఉన్నాయి. రిజిస్ట్రేషన్లు ఉన్నాయి. ఇంటినంబర్లు ఉన్నాయి. కరెంటు బిల్లు ఉన్నయ్. నల్లా బిల్లులు ఉన్నయ్. చట్టరీత్యా అన్నిరకాలుగా న్యాయమైన పూర్తిస్థాయిలో ప్రభుత్వం గుర్తించిన ఇండ్లు’ అన్నారు.
‘సోషల్ మీడియాలో ప్రచారం చూస్తున్నాం. కాంగ్రెస్ నేత కనుగోలు కొత్త టీం పెట్టారట. వీరంతా ఆక్రమణదారులు. ఎఫ్టీఎల్లో కట్టారు. బఫర్‌జోన్‌లో కట్టారు. మరి మీ గత కాంగ్రెస్ ప్రభుత్వాలు గుడ్డి గుర్రాల పండ్లు తోమాయా?.. 50 సంవత్సరాల మీ నిర్వాకమే కదా? 50ఏళ్లలో ఏనాడైన పట్టించుకున్నారా? 2016లో మా ప్రభుత్వం వచ్చాక మొదటిసారి హైదరాబాద్‌లో చెరువులు.. వాటి ఎఫ్టీఎల్లు, బఫర్ జోన్లు డ్రా చేస్తూ మొదటిసారి జీవో ఇచ్చిన ప్రభుత్వం మా ప్రభుత్వం. అదివరకు 1956 నుంచి 2016 వరకు సరిగ్గా 60 సంవత్సరాలు. ఒక్కరంటే కాంగ్రెస్, వేరే ప్రభుత్వాలు ఉన్నా కనీసం వాటి బౌండరీలు డ్రా చేసే ప్రయత్నం లేదు. ఎలా పడితే పట్టాలు ఇచ్చారు.. రిజిస్ట్రేషన్లు చేశారు. బఫర్ జోన్లు చూడలేదు.. ఎఫ్టీఎల్ చూడలేదు.. పట్టాలు ఇచ్చిపడేశారు. 2024లో వచ్చి మీరంతా ఆక్రమణదారులు.. తప్పు చేశారంటున్నారు. మీకు దమ్ముంటే.. చేతనైనే మొదట పర్మిషన్ ఇచ్చారో వారిపై చర్యలు తీసుకో.
ఇవాళ హైకోర్టు కూడా అదే చెప్పింది కదా. ఈ రోజు ఆక్రమణలంటున్నారు కదా.. ఎవరైనాతో నాడు పర్మిషన్ ఇచ్చారో ఆనాడు.. ఎవరైనా అధికారులు.. ప్రభుత్వాలున్నాయో వారిపై చర్యలు తీసుకో. 2016లో వచ్చి జీవో ఇచ్చే వరకు మీ ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోలేదు నేను అడుగుతున్నా. అన్నింటికి మంచి లక్షలాది మంది జీవితాలు అంధకారం చేస్తాననంటే ఊరుకోం. ఒక్కమాట అడుగుతున్నా ముఖ్యమంత్రిని.. మీ ప్రాధాన్యం ఏంటీ అసలు. ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటవా..? ప్రజలకు ఇచ్చిన మాట ఏందీ? రైతులకు రైతుభరోసా అన్నారు.. రైతుకూలీలకు నెలకు రూ.1000 ఇస్తామన్నారు. ఆటోడ్రైవర్లను బాగా చేసుకుంటాం అన్నారు. మహిళలను కోటీశ్వరులను చేస్తామన్నారు.. నెలకు రూ.2500 ఇస్తానన్నావ్. ఏదీ చేయకపోగా.. వాటికి పైసలు లేవట. చేతులు రావు.. మనసు రాదు. కానీ రూ.1.50లక్షల కోట్లు ఒక మూసీ ప్రాజెక్టుకు వెచ్చిస్తున్నారు’ అంటూ ధ్వజమెత్తారు.