Revanth Reddy | హైదరాబాద్, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టి 15 నెలలు అవుతున్నా, ఆయన పేరును క్యాబినెట్ మంత్రులు, సొంత పార్టీ నేతలు, ఇతర ప్రముఖులు సైతం మర్చిపోతున్నారు. ఎక్కడైనా ప్రైవేటు, వ్యక్తిగత కార్యక్రమాల్లో మర్చిపోతే ఓకే గానీ, బహిరంగసభల్లో, అధికారిక ప్రెస్‌మీట్లలోనే సీఎంగా రేవంత్‌రెడ్డి పేరు పలుకలేకపోతున్నారు. నిత్యం కలిసి ఉండే క్యాబినెట్ మినిస్టర్, సొంత జిల్లాకు చెందిన సొంత పార్టీ నేత ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి పేరు సంబోధించడంలో తడబాటుకు గురవుతున్నారు.
సీఎల్పీలో మంగళవారం నిర్వహించిన ప్రెస్మీట్లో ఎక్సైజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్యమంత్రి కేటీఆర్ అని సంబోధించారు. మళ్లీ తప్పును సవరించుకొని ప్రెస్‌మీట్ కొనసాగించారు. 2024 డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుతీరిన తర్వాత క్యాబినెట్ మినిస్టర్‌గా జూపల్లి బాధ్యతలు చేపట్టారు. సీఎం రేవంత్‌రెడ్డి సొంత జిల్లా మహబూబ్‌నగర్‌కు చెందిన జూపల్లి.. నిత్యం ఆయనతోనే అనేక ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరవుతుంటారు. అయినా, ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి పేరు గుర్తుకురాకపోవడం శోచనీయమని నెటిజన్లు విమర్శిస్తున్నారు. ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డిని గుర్తించడం లేదా? లేక గుర్తుపెట్టుకోవడం లేదా? గుర్తు పెట్టుకొనేలా ఆయన పనితీరు లేదా? కావాలనే పలుకడం లేదా? అనేది చర్చనీయాంశంగా మారింది. సీఎంగా రేవంత్‌రెడ్డి పేరు ఆయన పలుకకపోవడం ఇదే మొదటిసారి కాదు.. ఇదే చివరిసారి కూడా కాబోదేమో!
నా పేరు చెప్పకోండి మీలో ఎవరైనా!
మొదట జనవరి 7వ తేదీన పుష్ప-2 ప్రీరిలీజ్ ఈవెంట్లో ప్రముఖ నటుడు అల్లు అర్జున్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేరు మర్చిపోయారు. ‘తెలంగాణ సీఎం..’ అని ఆగిపోయారు. ఎంతగానో ప్రయత్నిస్తే తప్ప ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అని చెప్పలేకపోయారు. ఈ తడబాటును కవర్ చేయడానికి ఆయన చాలా కష్టపడ్డారు. మంచినీళ్లు తాగి పక్కవారిని అడిగి రేవంత్‌రెడ్డి పేరు పలికారు. అనంతరం పుష్ప సినిమా ప్రదర్శన సందర్భంగా చోటుచేసుకున్న ఘటనతో అల్లు అర్జున్ ఒకరోజు జైలు జీవితం గడపాల్సి వచ్చింది. ఇందుకు సీఎం రేవంత్‌రెడ్డి పేరు మర్చిపోవడమే కారణమంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు. గత నెల 5వ తేదీన హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో నిర్వహించిన తెలుగు ప్రపంచ సమాఖ్య కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. సభా ప్రాంగణంలోకి రాగానే కార్యక్రమ వ్యాఖ్యాత కూడా సీఎం రేవంత్‌రెడ్డి పేరును మర్చిపోయారు. ‘తెలంగాణ ముఖ్యమంత్రి, గౌరవనీయుయులు శ్రీ కిరణ్‌కుమార్‌గారు..’ అని సంబోధించి ఆ తరువాత సవరించుకున్నారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా సీఎంగా రేవంత్‌రెడ్డి పేరు పలుకలేకపోయారు. ఇటీవల గాంధీభవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో ‘మన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి’ అని అన్నారు. ఆ తర్వాత సారీ చెప్పి సర్దుకున్నారు. తాజాగా మంగళవారం కాంగ్రెస్ ఎల్పీలో మంత్రి జూపల్లి కృష్ణారావు సీఎంగా కేటీఆర్ పేరును సంబోధించారు. ఆ తర్వాత సవరించుకొని రేవంత్ పేరు పలికారు. సీఎంగా రేవంత్‌రెడ్డి పేరు పలుకకపోవడంతో జూపల్లి మంత్రి పదవి ఊడిపోవచ్చని సోషల్‌మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. కాంగ్రెస్ మంత్రులకు, సీనియర్ నేతలకు కూడా సీఎం ఎవరో తెలియదా? అని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
క్యాబినెట్ నుంచి తప్పిస్తరు: కేటీఆర్
ప్రెస్మీట్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేరు పలుకనందుకు మంత్రి జూపల్లి కృష్ణారావును క్యాబినెట్ నుంచి తప్పిస్తరని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు జోస్యం చెప్పారు. సీఎం పేరును తప్పుగా పలికినందుకు కృష్ణారావుకు శిక్ష తప్పదేమోనని తెలిపారు. ‘నా మాటలు గుర్తుంచుకోండి. ఈ తప్పునకు క్యాబినెట్ నుంచి జూపల్లిని తొలగిస్తారు’ అని మంగళవారం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.